Read more!

కంసుడికి చురకలు పెట్టింది ఎవరు!

 

కంసుడికి చురకలు పెట్టింది ఎవరు!

యాదవులకు ఎంతో ఆత్మీయుడైన అక్రూరుడు చాలా గొప్ప వ్యక్తి. ఒకరోజు కంసుడు అక్రూరుడిని పిలిపించాడు. అక్రూరుడు కంసుని దగ్గరకు వెళ్ళగానే ఎంతో మర్యాదగా మరింత అభిమానంగా పలకరించాడు కంసుడు. కంసుని పిలుపుకు అక్రూరుడు ఆశ్చర్యపోయాడు.  అయితే.. ఆతని కృత్రిమ, కపట ప్రేమను అక్రూరుడు ఇట్టే గ్రహించేశాడు.  అప్పుడు కంసుడు అక్రూరుడితో.. "అక్రూర మహాశయా! కృష్ణద్వైపాయనులైన వేదవ్యాసులవారు, రేపు మన మధురకు వస్తున్నారట. ఈ సంగతి మీకు తెలిసే వుంటుంది. వారెందుకు వస్తున్నారో వివరిస్తే, మీరు ఎదురుగా చెబుతూ ఉంటే  వినాలన్నది నా కోరిక" అంటాడు. అంతేకాదు..   వేదవ్యాసుల వారు ఇక్కడికి వస్తున్నారు, మరొక వైపు భీష్ముల వారు కూడా వస్తున్నట్టు వర్తమానం పంపారు. ఈ రెండింటికి ఏదో సంబంధముండి వుండాలి. ఆ రహస్యం మీకు తప్పక తెలిసి వుండాలి. వుంటుంది కూడా! అవునూ.. భీష్ములవారు, వసుదేవుని రాకను కోరుతూ, మాకు సమాచారం  పంపారన్న సంగతి మీకు తెలుసా?" అని కంసుడు అడుగుతాడు.

కంసుడు ప్రశ్నలకు సమాధానంగా, అక్రూరుడు "అవును, వారు వస్తున్న సంగతి నాకు తెలుసు." అంటాడు. 

“ఎందుకు వస్తున్నారో తెలుసుకోవచ్చా ?" అని కంసుడు అసహనంగా ప్రశ్న వేస్తాడు. 

"అది నాకేం తెలుసు ? మహాత్ముల రాకలను కనిపెట్టి చెప్పగల శక్తి మనకుందా??" అని  ప్రశ్నకు.... ప్రశ్నలాంటి సమాధానం ఇస్తాడు అక్రూరుడు.

కంసుడు అక్రూరుడు వైపు తదేకంగా చూస్తూ "మీకు తెలిసే వుంటుంది." అని క్షణమాగి, "అది సరే… ఆయన మీకు తెలుసా ?" తనే అడుగుతాడు కంసుడు భయపడుతూనే.

"ఆ తెలుసు. వారిని చాలాసార్లు కలుసుకున్నాను. నేను.” అని అక్రూరుడు సమాధానం ఇస్తాడు.

"అలాగా! ఈ మునేనా ? ఆ చేపలదాని కొడుకు, కురువంశ యువరాజు తండ్రి ?" అంటూ కపట క్రూరత్వాలు నిండిన కళ్ళతో, వెకిలిగా నవ్వాడు కంసుడు.

అందుకు సమాధానంగా, అక్రూరుడు -"నిజమే... ఆ మహాతల్లే సత్యవతి. వ్యాసుని మాత. కురువంశ యువరాజులకు పితామహి కూడా. ఆమె మత్స్యరాజు... అదే చేపలవాని కూతురే కావచ్చును. కాని ఆమె వ్యాసుని మాత. వ్యాసుని తండ్రి పరాశరులు. ఆ మహర్షి శక్తి కుమారుడు, వసిష్ఠుల వారి మనుమడు. ఆ పరాశరమహర్షి పుత్రుడే మనం దర్శించబోయే మహనీయులు, కురువంశ యువరాజుల తండ్రియైన వ్యాసుల వారు. వీరినే వేదవ్యాసులని కూడా అంటారు. మహాత్ములే శిరసు వంచి నమస్కరించే మహనీయులు శ్రీ వేదవ్యాసుల వారు" అని కంసుడికి చురకలు పెట్టినట్టే సమాధానం ఇస్తాడు అక్రూరుడు.

                                ◆నిశ్శబ్ద.