Read more!

ఆశ్చర్యం కలిగించే ఘంటాకర్ణుడి వృత్తాంతం!

 

ఆశ్చర్యం కలిగించే ఘంటాకర్ణుడి వృత్తాంతం!

శ్రీకృష్ణుడికి అష్టపత్నులతోపాటు మరో పదహారు వేలమంది భార్యలున్నారు. వారికి ఒక్కొక్కరికి పదిమంది చొప్పున కొడుకులు పుట్టారు. వారందరిలోనూ రుక్మిణీదేవి కుమారుడయిన ప్రద్యుమ్నుడూ, జాంబవతి కుమారుడైన సాంబుడూ ప్రసిద్ధులు.

రుక్మిణీదేవి అన్నగారైన రుక్మికి రుక్మవతి అనే కూతురు వుంది. ఆ అమ్మాయి ప్రద్యుమ్నుడ్ని వరించి పెళ్ళి చేసుకుంది. ఆ రుక్మవతీ ప్రద్యుమ్నులకు అనిరుద్ధుడు. పుట్టాడు. అనిరుద్ధుడి భార్య పేరు రోచన. వాళ్ళకి వజ్రుడు జన్మించాడు. యాదవ వినాశనం తర్వాత ఆ వంశంలో మిగిలినవాడు వజ్రుడు ఒక్కడే.

ప్రద్యుమ్నుడు కలిగాక శ్రీకృష్ణుడు ఒకసారి పూర్వం తను తపస్సు చేసుకున్న బదరీవనానికి వెళ్ళాడు. అప్పుడు నల్లనయ్యను సందర్శించుకునేందుకు భరద్వాజుడు, వాల్మీకి, వ్యాసుడు, గౌతముడు, కశ్యపుడు, కణ్వుడు, పరాశరుడు మొదలయిన మహర్షులందరూ ఆ వనానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు వాళ్ళతో ఆ రోజంతా గడిపాడు. ఆ తర్వాత అర్థరాత్రివేళ బయలుదేరి శ్రీకృష్ణుడు గంగకు ఉత్తరంగా వెళ్ళి అక్కడ కొంతసేపు సమాధి స్థితిలో వుండి తిరిగి వనసందర్శనకు బయలుదేరాడు. ఆ సమయంలో ఆయనకు కొన్ని అడవి జంతువులు 'జై జయ గోపాల! జై జయ గోవింద!' అని అరవడం వినిపించింది. ఆ తర్వాత.. కొంతసేపటికి బాణాలు గుచ్చుకుని విలవిలలాడుతూ పులులూ, దుప్పులూ, అడవి పందులూ అటుగా పరుగెత్తాయి. వాటి వెనకాలే వాటిని తరుముకుంటూ కొందరు కిరాతకులు వచ్చారు. రక్తంకారుతున్న ఆయుధాలతో, ఎర్రని కళ్ళతో చూసేందుకు భయంకరంగా ఉన్న వాళ్ళుకూడా హరిసంకీర్తన చేస్తూండడం శ్రీకృష్ణుడికి ఆశ్చర్యం కలిగించింది.

అంతలో పిశాచాల నాయకుడయిన ఘంటాకర్ణుడు కృష్ణుని సమీపించి, దాటివెళ్ళబోతూ ఆగి తేరిపార చూశాడు.

'మీరెవరు? ఎక్కడికి ఇలా వెడుతున్నారు?' అని శ్రీకృష్ణుడు ఘంటాకర్ణుడ్ని అడిగాడు.

'మేము మాధవుడ్ని చూసేందుకు మధురానగరం వెళుతున్నాం' అని గొప్పగా చెప్పాడు ఘంటాకర్ణుడు. 

కృష్ణుడు నవ్వి వూరుకున్నాడు.

ఘంటాకర్ణుడు కృష్ణునికి ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళి 'నాయనా! నువ్వెవరివో నాకు తెలియదు. కాని నీ రూపు, నీ తేజం, నీ మాట నన్ను ఆకట్టుకున్నాయి. దయతలచి నా ఆతిథ్యాన్ని స్వీకరించు' అని తన బాణానికి గుచ్చివున్న మాంసపు ముక్కను ఆయనకు అందించాడు. నల్లనయ్య వద్దనకుండా ఆ మాంసం ముక్కను స్వీకరించి 'జీవహింస ఎందుకు చేస్తున్నావు?” అని ఘంటాకర్ణుడ్ని అడిగాడు.

'స్వామీ! ఏ పాపం చేశామో మాకీ జన్మ లభించింది. ఈ పాపిష్టి జన్మనుంచి తొలగిపోవాలనే మేమూ కోరుకుంటున్నాం. అందుకోసం మేము చెయ్యని పూజలు లేవు. ఇప్పుడు మేము జంతువులను వేటాడటం కూడా విఘ్న పూజ కోసమే. మా మనసుల్లో మాధవుని నిలుపుకున్నాం. ఆయననే సదా స్మరిస్తాం. మధుర మాకు ప్రాణం. కృష్ణయ్యే మాకు సర్వం. ఆయనను చూడాలనే ఇప్పుడు పోతున్నాం. మాధవుడు భక్తసులభుడని అందరూ అంటారు. అందుకని మాది ఏ వృత్తి అయినా ఆయనను భక్తి మార్గాన చేరుకోదలిచాం. ఆ అయ్య కనిపిస్తే చెబుతాం - మాకీ పిశాచాల రూపం వదిలించకపోతే మేము నీ జట్టు వుండమని. ఈ బతుకులకు తగ్గట్టుగా జీవహింస చేస్తున్నాం. ఇది దోషం కాదనుకుంటాను'. అన్నాడు ఘంటాకర్ణుడు వినయంగా. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు వితుడయ్యాడు. ప్రేమగా ఘంటాకర్ణుడ్ని దగ్గరకు తీసుకున్నాడు. తన దివ్య రూపంతో అతని ముందు నిలిచాడు.

ఘంటాకర్ణుడు ఆయనను అనేక విధాల స్తుతించాడు. తన మనస్సులో రూపు కట్టిన దివ్యమంగళస్వరూపాన్నే తన ఎదుట వున్న స్వామిలో దర్శించుకుని ఘంటాకర్ణుడు సంతోషంతో తలమునకలయ్యాడు. నల్లనయ్య ఘంటాకర్ణుడి శరీరాన్ని స్పృశించాడు. వెంటనే అతనికి దివ్యదేహం లభించింది. అతని కోరిక మేర శ్రీకృష్ణుడు అతనికి నితాంతభక్తిని ప్రసాదించాడు.

                                            *నిశ్శబ్ద.