Read more!

ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం చేకూర్చే ధనత్రయోదశి!

 

ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం చేకూర్చే ధనత్రయోదశి!

తెలుగు పంచాంగంలో మాసాలకు, తిథులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సాధారణంగానే తెలుగు పండుగల వివరణ విశ్లేషణ, ప్రాధాన్యత అంతా వీటితో అనుబంధమై ఉంటుంది. ప్రస్తుతం ఆశ్వయుజ మాసం నడుస్తోంది. దీపావళి పండుగ రోజులు వచ్చేస్తున్నాయి. దుర్గా నవరాత్రులను పదిరోజులు జరుపుకున్నట్టు దీపావళి పండుగను ఐదురోజుల పాటు జరుపుకుంటారు. ధనత్రయోదశితో ఈ సందడి మొదలవుతుంది. చాలామంది ధనత్రయోదశి నాడు విశేష పూజలు చేస్తారు. 

ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఇంటిని శుభ్రం చేసి, పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అప్లైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మీ, కుబేరులను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం జరుగుతుందంటారు. ఇంకా కుబేర యంత్రాలు పెట్టి పూజలు చేసేవారు కొందరు.

ఇకపోతే ధనత్రయోదశి వెనుక ఉన్న కారణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు  క్షీరసాగరాన్ని మధించినప్పుడు ఆ క్షీరసాగరం లో నుండి అమృతకలశంతో పాటు హలాహలం, మహాలక్ష్మి దేవి  ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువును ఇంటికి తెచ్చినా అది అమృతభాండం అవుతుంది. అందుకే ధనత్రయోదశి నాడు బంగారం కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. బంగారం కొనుగోలు చేస్తే అది వృద్ధి చెందుతుందని అందరి నమ్మకం. 

కొందరు మూర్ఖత్వపు వాదులు ఉంటారు. ప్రతి సంవత్సరం బంగారం కొంటె అది పెరగకుండా ఉంటుందా ఏంటి అంటారు. అయితే కొందరు ఎంత బంగారం కొన్నా అది ఏదో ఒక రూపంలో నష్టపోతూ ఉంటారు. అదే ధనత్రయోదశి నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే అది ఎలాంటి సమస్యల నుండి జారిపోకుండా ఉంటుందట. 

అది మాత్రమే కాకుండా ధనత్రయోదశి నాడు మరొక విశిష్టత ఉంది. అదే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి. ఆరోగ్యమే మహాభాగ్యం..  అంటారు అందరూ. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మథనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్యశక్తులతోపాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అవతారం. చాలామంది గమనించి ఉంటారు ఆయుర్వేధ వైద్యం ఇస్తున్నప్పుడు చాలామంది వైద్యులు ఔషదాన్ని రోగులకు ఇచ్చేటప్పుడు ధన్వంతరిని ధ్యానం చేసి తరువాత ఔషధం ఇస్తారు. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్న ఆయుర్వేదం భారతీయులకు దొరికిన గొప్ప వరం. 

ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధన త్రయోదశి ఓ ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది.

దీపావళి రోజుల్లో మొదటిది అయిన ధనత్రయోదశి వెనుక ఇలా ఆరోగ్యమే కాదు మహాలక్ష్మి ఇంటి ఇంటిని పలకరించే మహాయోగం కూడా దాగుంటుంది. 

                                      ◆నిశ్శబ్ద.