Read more!

బ్రహ్మోత్సవాలు 8వ రోజు సందర్భంగా – వెంకమాంబ చరిత్ర!

 

 

బ్రహ్మోత్సవాలు 8వ రోజు సందర్భంగా – వెంకమాంబ చరిత్ర!
 

     ఎనిమిదో రోజుతో మలిదశకు చేరుకున్న బ్రహ్మోత్సవాల సంబరంలో ఉదయం వేళల స్వామివారు రథం మీద ఊరేగుతారు. గతినీ, ప్రగతినీ సూచిస్తూ… అనుగ్రహిస్తూ రథం మీద నిలిచిన స్వామివారిని చూసేందుకు భక్తుల ఆతురుత అంతా ఇంతా కాదు. ఇక సాయం వేళల్లో `అశ్వవాహనం` మీద స్వామివారు ఊరేగుతారు. అశ్వం చలనానికీ, వేగానికీ ప్రతీక. కలియుగ జీవనంలో ఈ రెండూ అవసరమే కదా! బ్రహ్మోత్సవాలలో స్వామివారు చివరగా అధిరోహించే వాహనం ఇదే కావడంతో… తాను అశ్వారూఢుడై కల్కి అవతారంలో మళ్లీ రాబోతున్నానన్న సూచనను స్వామివారు చేసినట్లవుతుంది. స్వామివారి వైభవాన్ని గురించి చెప్పుకున్నప్పుడు ఆయన పరమభక్తులను కూడా తల్చుకోవడం సమంజసం. అలా తన భక్తిపారవవ్యంతో, కవితావైభవంతో స్వామివారిని కొల్చుకున్న తెలుగు కవయిత్రి తరిగొండ వెంకమాంబ గురించి ఓసారి తల్చుకుందాము.

తరిగొండ వెంకమాంబ:
చిత్తూరు జిల్లా తరిగొండ అన్న గ్రామంలో కృష్ణయ్య, మంగమాంబ అనే దంపతులకు 1730లో జన్మించారు వెంకమాంబ. తరిగొండ అన్న పేరు వెనుకే ఓ చిత్రమైన కథ ఉంది. లక్ష్మీనరసింహస్వామివారి భక్తులు ఒకామె వెన్నని చిలుకుతుండగా, ఆ కుండలో స్వామివారి విగ్రహం కనిపించిందట. ఆ `తరి కుండ` (వెన్నకుండ) అనే పేరు మీదుగా తరిగొండ ఊరి పేరు స్థిరపడిందని ఓ నమ్మకం. వెంకమాంబ సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి అంశతో జన్మించిందని ఆమె తల్లి నమ్మకం. దానికి తగినట్లుగానే వెంకమాంబ ఊహ తెలిసినప్పటి నుంచీ భక్తిపారవశ్యంలో మునిగితేలేది. భగవంతుని విగ్రహం కనిపిస్తే చాలు తనని తాను మైమరచిపోయి ఆడిపాడేది. వెంకమాంబలో ఉన్న భక్తిని గమనించిన తండ్రి ఆమెను సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువుగారి దగ్గర విద్య నేర్పించాడు. చదువులో పడి ఆమెలోని భక్తి పాళ్లు తగ్గుతాయనుకున్నారు కానీ, గురువుగారి దగ్గర ఇతిహాసాలనూ, పురాణాలనూ నేర్చుకున్న వెంకమాంబలోని భక్తి అంతకు పదింతలయ్యింది.

 

 

వెంకమాంబలోని ఈ భక్తి తత్పరతకి తెగ కంగారుపడిపోయారు తల్లిదండ్రులు. పెళ్లి చేస్తే ఆమె మామూలు మనిషిగా మారుతుందని ఆశించారు. దాంతో వెంకటాచలప్ప అనే వ్యక్తితో ఆమెకు వివాహాన్ని జరిపించారు. తాను పేరుకి భార్యే అయినా, ఆ వేంకటేశ్వరునికే తన జీవితం అంకితం అని తన భర్తకు తెగేసి చెప్పింది వెంకమాంబ. విధివశాన కొద్దరోజులకే ఆమె భర్త చనిపోయాడు. అయితే అప్పటి సంప్రదాయం ప్రకారం ఆమెను విధువను చేసే కార్యక్రమానికి ఏమాత్రం సహకరించలేదు వెంకమాంబ. తన భర్త అయిన శ్రీనివాసుడు చిరంజీవి కాబట్టి, తనకు వైధ్యవ్యం దక్కే అవకాశమే లేదని ఊరిపెద్దలకు తెగేసి చెప్పింది. ఊరి పెద్దల మాటను కాదనడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. వెంకమాంబకు అక్కడ ఇంక ఉండబుద్ధి కాలేదు. తన ఊహల్లో నిలిచిన శ్రీనివాసుని కొలుచుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు.

 

తిరుమలలోని తుంబుర కోనలో నివాసాన్ని ఏర్పరుచుకుని నిత్యం వేంకటేశ్వరుని ధ్యానిస్తూ, ఆధ్యాత్మిక గ్రంథాలను రచిస్తూ, ప్రవచనాలని చేస్తూ కాలం గడపసాగారు వెంకమాంబ. మరికొన్నాళ్లకు ఆలయానికి చేరువలోనే ఉండసాగారు. స్వామివారిని ప్రతిరోజూ స్మరించుకోవడం, దర్శించుకోవడంతో పాటు ఆయనకు సేవ చేసుకోవాలన్న కోరిక ఓనాడు వెంకమాంబకు కలిగింది. అనుకున్నదే తడువుగా ఆమె శ్రీవారికి రాత్రివేళ హారతిని అందించసాగారు. ఒక స్త్రీ, అందులోనూ విధవరాలు స్వామివారికి హారతిని ఇవ్వడం అక్కడి పూజారులకు ఏమాత్రం నచ్చలేదు. ఆమెను నిర్దాక్షిణ్యంగా ఆ సేవ నుంచి తప్పించారు. అర్చకుల చేష్టకి వెంకమాంబ ఊరుకున్నా స్వామివారు ఊరుకోలేదు. ఓనాటి రథోత్సవం వేళ రథాన్ని నాలుగు మాడవీధులలో తిప్పుతుండగా వెంకమాంబ నివాసానికి చేరుకునేసరికి గుర్రం మొరాయించింది. ఎంత కదిల్చినా, ఎంతగా విదిల్చినా లాభం లేకపోయింది. సమయం గడుస్తోంది కానీ రథం మాత్రం కదలననే లేదు. `వెంకమాంబ పట్ల తాము చేసిన అపచారం ఫలితమే ఇది` అని తెలుసుకున్న అర్చకులు ఆమెను క్షమాపణలు వేడుకున్నారు. వెంకమాంబ మనసు వెన్నలా కరిగి రథం దగ్గరకు వచ్చి స్వామివారికి హారతి ఇచ్చిన తరువాత కానీ రథచక్రం ముందుకు సాగలేదు. అప్పటి నుంచీ స్వామివారి రాత్రివేళ హారతిని వెంకమాంబ వంశీకులే ఇస్తున్నారు.

 

వేంకటేశ్వరుని సన్నిధిలో వెంకమాంబ మాహాత్మ్యాలకు సంబంధించి చాలానే గాథలు ప్రచారంలో ఉన్నాయి. స్వామివారు వెంకమాంబ కీర్తనలను ఏకాంతంలో ఆలకించేవారనీ, ఆత్మరూపంగా వెంకమాంబ స్వామివారి సన్నిధిలో గడిపేదనీ… ఇలా రకరకాల కథలు వినవస్తుంటాయి. వాటిలో నిజానిజాలు ఎంతో కానీ వెంకమాంబ అనే భక్తురాలు ఉండేదనీ, ఆమె శ్రీనివాసుని తన పతిగా భావించి సేవించిందనీ చెప్పేందుకు ఆమె చేసిన లెక్కలేనన్ని రచనలే రుజువు. పద్యకావ్యాలు, ద్విపద కావ్యాలు, శతకాలు, కీర్తనలు, యక్షగానాలు… ఇలా ఎన్నో ప్రక్రియలలో భగవంతుని వేనోళ్ల కొలుచుకుంది వెంకమాంబ. వేంకటాచలమాహాత్మ్యం, శ్రీకృష్ణమంజరి, విష్ణుపారిజాతం మొదలైన రచనలు ఇప్పటికీ ఆమె పారవశ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

1817లో వైకుంఠప్రాప్తిని పొందిన వెంకమాంబ సమాధి ముఖ్య ఆలయానికి అతిచేరువలోనే ఉంది. చాలా ఏళ్లపాటు మరుగున పడిపోయిన `తరిగొండ వెంకమాంబ` వైభవాన్ని ప్రచారంలోకి తెచ్చేందుకు తి.తి.దే వంటి సంస్థలు ఎంతో కృషిని చేశాయి. అన్నదాన ప్రియురాలైన వెంకమాంబ పేరుమీదుగా `తరిగొండ వెంకమాంబ అన్నదాన సత్రా`న్ని తిరుమలలో నెలకొల్పారు. ఆమె జీవితం ఆధారంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఒక ధారావాహికను రూపొందించారు. ఇక వెంకమాంబ భక్తిని చాటేందుకు ఆమె రచనలు ఎలాగూ ఉన్నాయి.

- నిర్జర.