తెలుగునాట వెలసిన ఈ ఆలయ గొప్పదనం తెలుసుకుని తీరాల్సిందే..

 

తెలుగునాట వెలసిన ఈ ఆలయ గొప్పదనం తెలుసుకుని తీరాల్సిందే..


పరమేశ్వరుడు వెలసిన ఆలయాలలో ఎక్కువ భాగం ఎక్కువ చరిత్ర కలిగి ఉన్నవే ఉంటాయి. పరమేశ్వరుడు వెలసిన ప్రతి క్షేత్రానికి ఓ కథ ఉంటుంది. అలాగే దాని వెనుక ఆసక్తికరమైన నిర్మాణం ఉంటుంది. అలాంటి నిర్మాణాలలో కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న అగస్త్యేశ్వరాలయం ప్రముఖమైనది. దీని గురించి తెలుసుకుంటే..


కడప జిల్లా ప్రొద్దుటూరులోని అగస్త్యేశ్వరాలయం చాలా ప్రాచీనమైంది. ఇది చోళుల కాలం నాటిదని ప్రసిద్ధి. క్రీస్తుశకం 15వ శతాబ్దంలో విజయనగర సేనాని నరసా నాయకుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచాడని అంటారు.


ఈ గుడి 140 అడుగుల పొడవు, 120 అడుగులు వెడల్పు ఉండి, నలుదిక్కులా నాలుగు ద్వారాలతో శోభిల్లుతోంది. ఇక్కడి దేవేరి రాజరాజేశ్వరీదేవి. ఇక్కడ భ్రమరలింగేశ్వర, సుందరేశ్వర, కోదండరామ ఆలయాలు, నవగ్రహ మండపం ఉన్నాయి. అగస్త్యేశ్వర, రాజరాజేశ్వరీ మూర్తులకు విడి విడి ఆలయాలున్నా రెండు గుడులనూ కలుపుతూ ఉండే మండపం ఒకటే. శ్రీఅగస్త్యేశ్వర లింగంపై రససిద్ధికి సంబంధించిన గంటలున్నాయి. ఇది అరుదైన సంగతి. అంతరాలయంలో వీరభద్ర, వినాయక, కార్తికేయ సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ కార్తికేయుడు నెమలిని అధిరోహించి ఉండడం ఒక విశేషం.


ఇక్కడ ఉన్న నవగ్రహ మండపం మామూలుగా తెలుగు ప్రాంతాల గుడులలో కనిపించే మాదిరిది కాదు. ఇక్కడి నవగ్రహ మూర్తులు విలక్షణమైనవనీ, ఇలాంటి మూర్తులు ఒక్క కర్ణాటక రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేవని అంటారు. ఇక్కడి వీరభద్రమూర్తి సమభంగ భంగిమలో నిల్చొని ఉంటారు. కాళ్ళ క్రింద మేక తల ఉండడం విశేషం. ఈ ఆలయ పునరుద్ధరణ కృషిలో భాగంగా పశ్చిమాన గల ప్రధాన రాజగోపురంపై అయిదు బంగారు కలశాలను ప్రతిష్ఠించారు. తూర్పున కూడా రాజ గోపురం ఉంది. ఉత్తర, దక్షిణ రాజ గోపురాలపై బంగారు కలశాలు ఉంటాయి.


తెలుగునాట కొన్ని ఆలయాలకూ, కవులకూ సంబంధం కనిపిస్తుంది. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలోని ఆంధ్రవిష్ణువు ఆలయంలో కూర్చుని శ్రీకృష్ణ దేవరాయలు 'ఆముక్త మాల్యద'ను రచించాడని అంటారు. అలాగే ఈ ప్రొద్దుటూరు ఆలయానికి ఒక కవికి కూడా సంబంధం ఉన్నట్టు చరిత్ర చెబుతోంది.   ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయంలో కూర్చుని ప్రభావితులైన 20వ శతాబ్దపు కవి 'సరస్వతీ పుత్ర' పుట్టపర్తి నారాయణాచార్యులు.


పుట్టపర్తి నారాయణాచార్యులు తమ గేయకావ్యం 'శివ తాండవం' ఇక్కడే రచించారంటారు. రోజూ ఈ గుడి చుట్టూ ఆచార్యులవారు 101 ప్రదక్షిణాలు చేస్తూ ఆ కావ్యరచన చేశారట. ఇక్కడ ఆ మహాకవికి ఒక స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయ విశిష్టతకు అది కూడా మెరుగులుదిద్దే అంశమే.


ఇలా ఈ తెలుగునాట ఎన్నో సుప్రసిద్ధమైన ఆలయాలు వాటి వెనుక ఎన్నో గొప్ప కథనాలు ఉన్నాయి.


                                     ◆నిశ్శబ్ద.