Read more!

శ్రీకాకుళంలో ఆముక్తమాల్యద

 

 

 

శ్రీకాకుళంలో ఆముక్తమాల్యద

 


కృష్ణానది కేవలం ప్రజల దాహార్తిని మాత్రమే తీర్చలేదు. వారి ఆధ్మాత్మికత తృష్ణను సైతం తీర్చిన పుణ్యక్షేత్రాలెన్నింటికో నెలవుగా మారింది. కృష్ణాతీరం కేవలం వ్యవసాయానికి మాత్రమే ఊతమివ్వలేదు. సాహిత్యాన్ని సైతం పండించింది. దానికి ఆముక్తమాల్యద గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆ విశేషాలు...

 

పంచమహాకావ్యం

తెలుగునాట పంచమహాకావ్యాలలో కృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యదను ఒకటిగా భావిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగతా నాలుగు కావ్యాలను రాసింది కూడా ఆయన ఆస్థానకవులే (అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, రామరాజ భూషణుడు, ముక్కు తిమ్మన). అంతటి ప్రతిభావంతులైన కవులను గుర్తించి, వారితో సంభాషించగల ప్రతిభ ఉన్న కృష్ణరాయలకు స్వయంగా కావ్యాన్ని రచించగల నేర్పు ఉండటంలో ఆశ్చర్యం ఏముంది!

 

 

శ్రీకాళహస్తి- కృష్ణదేవరాయలు

కృష్ణాతీరాన వెలసిన శ్రీకాళహస్తి, దేశంలోనే అత్యంత ప్రాచీనమైన ఆలయాలలో ఒకటి. ఇందులో వెలసిన ఆంధ్ర మహావిష్ణువు తెలుగువారికే సొంతమైన దైవం. కృష్ణదేవరాయల వారు తన దండయాత్రలలో భాగంగా ఒకమారు విజయవాడను చేరుకున్నారట. అక్కడకి దగ్గరలోనే ఉన్న శ్రీకాకుళ ప్రసక్తిని విని ఆంధ్రమహావిష్ణువుని దర్శించుకుని అక్కడే విడిది చేశారు. అవి ఏకాదశి దినాలు. రాజుగారు ఏకాదశి సందర్భంగా నిరాహార వ్రతాన్ని ఆచరించి నిదురించారు. ఆ నిదురలోనే స్వామివారు స్వయంగా కృష్ణదేవరాయుని కలలో కనిపించి కలియుగంలో సశరీరంగా తనను పెండ్లాడిన గోదాదేవి కథను కావ్యంగా మలచమని ఆజ్ఞను ఇచ్చారు.

 

 

విష్ణువు నోట తెలుగులెస్స

సాధారణంగా తెలుగుభాష గొప్పదనం గురించి చెప్పుకొనేటప్పుడు ‘దేశభాషలందుఁ తెలుఁగు లెస్స’ అనే కృష్ణదేవరాయుని మాటను చెప్పుకొంటాము. నిజానికి ఇది కలలో ఆంధ్రమహావిష్ణువుతో, కృష్ణదేవరాయునికి జరిగిన సంభాషణలో భాగం. కన్నడిగుడనైన తనను తెలుగులో రాయమంటూ ఆంధ్రమహావిష్ణువు...

తెలుఁగ దేల నన్న దేశంబు దెలుఁగేను

తెలుఁగు వల్లభుండఁ దెలుఁ గొకండ

యెల్ల నృపులగొలువ నెరుఁగ వే బాసాడి

దేశభాషలందుఁ తెలుఁగు లెస్స!

 

... అని శాసించారంటారు కృష్ణదేవరాయలు. ఒక పక్క కృష్ణదేవరాయలేమో కన్నడిగులు. మరోపక్క గోదాదేవి ఇతివృత్తం తమిళం, ఆనాటి రాజభాష సంస్కృతం! అయినా వీటన్నింటికీ భిన్నమైన తెలుగులో ఆముక్తమాల్యదను రచించడంతో అది తెలుగు సాహిత్యంలో ఒక మూలస్తంభంగా నిలిచిపోయింది.

 

ఆముక్తమాల్యద కథ

గోదాదేవి కథ అందరికీ తెలిసిందే! తమిళనాట శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు. ఆయన చిత్తం ఎప్పుడూ విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది. ఆయన నిత్యం విల్లిపుత్తూరులోని స్వామివారికి పుష్పమాలను కైంకర్యం చేస్తుండేవాడు. అలా ఒకనాడు పువ్వుల కోసం వనంలో తిరుగుతుండగా ఒక బాలిక కనిపించింది. ఆమెను సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి ప్రసాదంగా భావించి ఆమెకు కోదై (పూలమాల) అన్న పేరుతో పెంచుకోసాగాడు. ఆమె యవ్వనవతి అవుతున్న కొద్దీ సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి మీదే ఆమె మనసు లగ్నం కాసాగింది. ఆయన కోసం అల్లిన పూమాలను మొదటగా తాను ధరించి నీటి నీడలో చూసి మురుసుకునేది. అలా ఆమెకు ఆముక్తమాల్యద అన్న పేరు కూడా వచ్చింది. ఎట్టకేలకు ఆమె ఆశ ఫలించి, సాక్షాత్తూ శ్రీరంగంలోని విష్ణుమూర్తి ఆమెను పరిణయం చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

 

శ్రీకాకుళ చరిత్రలోనూ...

ఆశ్చర్యం ఏమిటంటే... భగవంతుని కోసం అల్లిన మాలను ఒక స్త్రీ ముందుగా అలంకరించుకోవడం అన్నది శ్రీకాకుళ చరిత్రలో కూడా కనిపిస్తుంది. ఆలయ గాథల ప్రకారం ఆంధ్ర విష్ణువుని అర్చించేందుకు నియమింపబడ్డ ఒకానొక పూజారి వేశ్యాలోలుడైనాడు. రోజూ స్వామివారి కోసం అల్లిన పూమాలను తన ప్రియురాలికి అలంకరించిన పిదపే విష్ణుమూర్తి మెడలో ధరింపచేసేవాడు. అలా ఒకనాడు మాలలో శిరోజం ఉండటాన్ని గమనించిన రాజుగారు... దానికి కారణం ఏమిటని గద్దించేసరికి, విగ్రహానికి శిరోజాలున్నాయని అబద్ధం చెప్పాడు పూజారి. నమ్మశక్యం కాని ఆ మాటను పరీక్షించేందుకు రాజుగారు ఆంధ్ర విష్ణువు విగ్రహం చెంతకు చేరుకున్నారు. భక్తదయాళువైన ఆ విష్ణుమూర్తి తన పూజారిని రక్షించేందుకు, ఆ సమయంలో కొప్పుతో సహా ప్రత్యక్షం అయినాడట! అప్పటి నుంచీ శ్రీకాకుళ మహావిష్ణువు విగ్రహానికి కొప్పు ఉండటాన్ని గమనించవచ్చు.
కృష్ణదేవరాయునిదే!

 

ఆముక్తమాల్యద కృష్ణదేవరాయుని కృతి కాదన్నది కొందరు విమర్శకుల వాదన. దీనిని అల్లసాని పెద్దన రాశాడని కొందరూ, శ్రీకాకుళంలోని ఒక వైష్ణవ భక్తుడు రాశాడని కొందరు ఆరోపిస్తూ ఉంటారు. దీని మీద చర్చోపచర్చలు అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. కన్నడిగుడైన రాజు ఈ కావ్యంలో సమాసభూయిష్టమైన పద్యాలను రాయలేడన్నది చాలామంది ఆరోపణ. అయితే ఆముక్తమాల్యద ఒక ప్రేమ కావ్యం అయినప్పటికీ అందులో కనిపించే దుడుకుదనం, అక్కడక్కడా కనిపించే రాజనీతి గురించిన చర్చ... కృష్ణదేవరాయుని రాజసంతో సరిపోలతాయన్నది మరో వాదన. ఏది ఏమైనప్పటికీ శ్రీకాకుళ క్షేత్రంతోనూ, కృష్ణానది తీరంతోనూ... ఆముక్తమాల్యద ఎప్పటికీ ముడిపడిపోయి ఉంటుంది.

 

- నిర్జర.