Read more!

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి - కాలజ్ఞానం - 9 (Sri Potuluri Virabrahmendra Swami Kalagnanam)

 

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి - కాలజ్ఞానం - 9

(Sri Potuluri Virabrahmendra Swami Kalagnanam)


గ్రామాలలో, పట్టణాలలో నెత్తుటి వాన కురిసేను..

రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడటం కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు చూశారు. వివిధ రసాయనాలు, వాతావరణ కాలుష్యం కారణంగా ఎరుపురంగు వర్షం పడుతోందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.

సూర్యుడు, చంద్రుడు ఉన్నంతవరకు నా మఠానికి పూజలు జరుగుతూనే ఉంటాయి. నా మఠానికి ఈశాన్యం వైపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుట్టేను.. అతడు ''నేనే భగవంతుడను నన్ను పూజించండి '' అని పలుకుతాడు..

నెల్లూరు సీమ మొత్తం నీట మునిగి ఉంటుంది..

తుఫాను సమయంలో నెల్లూరు మొత్తం జలమయం అవడం అనేక సంవత్సరాలుగా మనకు తెలుసు కదా.

నవాబుకు కాలజ్ఞానం వినిపించిన వీరబ్రహ్మేంద్రస్వామి

వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన జోస్యాలు, మహిమల గురించి బనగానపల్లె నవాబు విన్నాడు. అతనికి నమ్మకం కలగలేదు. అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. పోతులూరి చెప్పేవి సత్యాలో కాదో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాక భటులచేత బ్రహ్మంగారిని పిలిపించాడు. ఆయనకు ఎదురువెళ్ళి నమస్కారం చేసి, స్వాగతం పలికాడు. తర్వాత ఆయనను ఒక ఆసనంపై కూర్చోబెట్టారు.

నవాబు, తన సేవకుడిని పంపి స్వామివారు తినేందుకు పండ్లు, ఫలహారాలు తెప్పించాడు. అందులో మాంసాహారం పెట్టి తీసుకురమ్మని ముందుగానే పురమాయించాడు.

నవాబు ఆదేశాన్ని అనుసరించి, సేవకుడు కొన్ని మాంస ఖండాలను పళ్ళెంలో ఉంచి, వాటిపై వస్త్రం కప్పి, వినయంగా స్వామివారికి ఇచ్చాడు. ఆ పళ్ళెం పైనున్న వస్త్రాన్ని తీస్తే తాను ఫలహారం స్వీకరిస్తానని స్వామివారు చిరునవ్వుతో చెప్పాడు. ఆ సేవకుడు వస్త్రాన్ని తొలగించాడు.

నవాబు ఆశ్చర్యపోయే విధంగా ఆ పళ్ళెంలో పుష్పాలున్నాయి. ఈ ఉదంతంతో వీరబ్రహ్మేంద్రస్వామి నిజంగా శక్తివంతుడే అని బనగానపల్లె నవాబు నమ్మక తప్పలేదు. వెంటనే నవాబు క్షమాపణ చెప్పాడు. తనకు కూడా కాలజ్ఞానం వినిపించాలని కోరాడు.

అప్పుడు బ్రహ్మంగారు నవాబుకు కొన్ని సంగతుల గురించి వివరించాడు. ఆయన చెప్పిన వాటిలో కొన్ని ముఖ్యమైనవి...

విచిత్రమైన ఈత చెట్టొకటి పుట్టి రాత్రులు నిద్ర పోతుంది. పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరవు ఏర్పడుతుంది...

ఈ విషయం యదార్ధంగా జరిగింది. గుంటూరు జిల్లా చేబ్రోలు దగ్గర ఒక పొలంలో ఉన్న ఈతచెట్టు అచ్చం బ్రహ్మంగారి కధనాన్ని పోలి ఉండేది. రాత్రిపూట ఆ పొలంలో ఉన్న డొంక రోడ్డుకు అడ్డంగా పడుకునేది. మళ్ళీ సూర్యోదయం కాగానే లేచి నిలబడేది. ఈ వింత చెట్టు గురించిన విషయం అప్పట్లో ఫొటోలతో సహా దినపత్రికలో ప్రచురితమైంది.

కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ దాత్రు నామ సంవత్సరంలో అనేక ఊళ్ళల్లో రూపాయికి చారెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు.

ఇప్పటికే బియ్యం ధరలు మండిపోతున్నాయి. కిలో బియ్యం 40 రూపాయలు ఉంది. మరో ఐదేళ్ళలో కిలో 100 రూపాయలు పలికినా ఆశ్చర్యం లేదు. ఆకలి చావులు ఎక్కువయ్యాయి. కొన్నాళ్ళకి పేద ప్రజలకు బియ్యం అందుబాటులో లేకుండా పోతాయేమో!

బ్రహ్మంగారు తాను చెప్పినవన్నీ నిజాయితీతో, నిర్భీతితో చెప్పారు. నవాబును సంతోషపెట్టేందుకు కాకుండా తనకు ఏది నిజంగా అనిపించిందో దాని గురించే చెప్పుకుంటూ వచ్చారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నా, ఈ కింద చెప్పినవి చదివితే ఈ విషయం సులభంగా అర్ధం అవుతుంది.

5000 సంవత్సరానికి వచ్చేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరూ మిగలరు. ఈ వంశానికి ఉన్న ఆస్తి అయిన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదు.

బనగానపల్లె నవాబు పాలన క్రమంగా నాశనమైపోతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.

బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడం పూర్తయిన తర్వాత ఆయనకు 70 ఎకరాల భూమిని తన కానుకగా ఇచ్చాడు నవాబు. తన మఠానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మంగారు మరల తన భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపసాగారు.

దేశాటనకు బయల్దేరిన బ్రహ్మంగారికి ఒక సంవత్సరం గడిచిన తర్వాత దేశంలో పర్యటించి రావాలనే కోరిక పుట్టింది. తన కోరికను భక్తులు, శిష్యులకు చెప్పారు. వారెవ్వరూ దీనికి ఒప్పుకోలేదు. కానీ, అంతా ఆ సర్వేశ్వరుని నిర్ణయం ప్రకారమే జరుగుతుందని తన పర్యటనను ఆపేందుకు ఎవ్వరూ ప్రయత్నించరాదని నచ్చచెప్పారు స్వామి. ఆ తర్వాత కడప జిల్లాకు ప్రయాణమయ్యారు.

ఆ జిల్లాలో తిరుగుతూ కందిమల్లాయపల్లె చేరుకున్నారు. ఆ ఊరు ఆయనకు బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. ఆయన ఒక మామూలు వడ్రంగి మాదిరిగా జీవించడం మొదలుపెట్టారు. తన గురించి ఎప్పుడూ, ఎవరికీ చెప్పుకోలేదు.

ఇదిలా ఉంటే ఆ ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిలో ప్రతి సంవత్సరం వేలాది రూపాయల ఖర్చుతో జాతర జరగడం ఆనవాయితీ. దీనికోసం ఊళ్ళో ఉన్న వారందరూ చందాలు వేసుకునేవారు.

ఆ ఊరి పెద్దలు వడ్రంగి పని చేసే బ్రహ్మంగారి వద్దకు వచ్చి, అమ్మవారి జాతరకు చందా ఇమ్మని కోరారు. తాను పేదవాడినని, తానేమీ ఇవ్వలేనని చెప్పారు ఆయన. దాంతో పెద్దలు ఆయనను ఎగతాళి చేశారు.

తప్పనిసరి పరిస్థితులలో తాను జాతరకు ఏదో ఒకటి ఇవ్వగలనని, కానీ అందుకోసం అమ్మవారి గుడి దగ్గరకు పెద్దలందరూ రావాలని చెప్పారు బ్రహ్మంగారు. ఆ మాటల ప్రకారం అందరూ కలిసి ఆ ఊరి దేవత గుడి దగ్గరకు వెళ్లారు.

గుడి బయట నిలబడిన బ్రహ్మంగారు ఒక చుట్ట తీసుకుని గుడిలోని అమ్మవారిని ఉద్దేశించి నిప్పు తీసుకురా అని కోరారు. వెంటనే అమ్మవారు అదృశ్య రూపంలో ఒక మూకుడులో నిప్పు తీసుకుని వచ్చి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి ఇచ్చింది. ముక్కున వేలేసుకోవడం అందరి వంతయింది.