Read more!

శ్రావణమాసం పండగలు... పర్వదినాలు..

 

శ్రావణమాసం పండగలు... పర్వదినాలు..

 

శ్రీ గణేశాయ నమః
శ్రీ గురుభ్యో నమః

భారతీయ సనాతన ధర్మంలో చాంద్రమానం అనుసరించి ఉన్న పన్నెండు మాసములలో ఐదవది ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసము. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణా నక్షత్రములో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసము అని పేరు వచ్చింది.

స్థితికారుడైన శ్రీహరి ప్రియపత్ని అయినా శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన మాసము కావడముతో ప్రతి చోటా వివిధ రకాల పూజలు, వ్రతాలు, నోములు, వాయినాలు,ఉపవాసములు, ప్రదక్షిణాలు అంటూ వాతావరణము అంతా భక్తి పూర్వకముగా ఉంటుంది. ఆషాఢ మాసములో మొదలైన శక్తి పూజ కొనసాగింపుగా ఇప్పుడు మరో రూపములో అమ్మవారి ఆరాధన ప్రారంభము అవుతుంది.

శ్రీనివాసుని జన్మ నక్షత్రం శ్రవణం కాబట్టి ఈ మాసము అత్యంత పవిత్రము అయింది అని భావించి తిరుమలలో శ్రీవారికి కూడా ఈ మాసములోనే పవిత్రోత్సవములు జరుపుతారు.  అందుకే ఈ మాసములో చేసే ప్రతి చిన్న పుణ్య కార్యము అనంతమైన ఫలితములను ఇస్తుంది అని పెద్దలు చెపుతూ ఉంటారు.

దక్షిణాయనంలో ఉన్న అత్యంత ఫలప్రదమైన మాసములలో ఇదీ ఒకటి.  శివ, కేశవా భేదము లేకుండా పూజనీయమై ఆనందప్రదమైన మాసము ఇది.  ఈ మాసములో సోమవారాలు అంటే శ్రావణ సోమవారాలు సాంబ శివునికి ప్రీతికరమైనవి అని పెద్దలు చెపుతూ ఉంటారు. అందుకే సోమవారములు రుద్రాభిషేకములు, బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదము అని పెద్దలు తెలిపారు. 

ఇక మంగళవారముల సంగతి అందరికి తెలిసిందే. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, ఈ మాసములు మంగళ గౌరీ వ్రతము చేసుకుంటారు. మాంగల్యానికి అధిదేవత అయినా మంగళ గౌరీ దేవిని తాము ఎప్పటికీ సుమంగళిగా ఉండాలని కోరుకుంటూ భక్తి, శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు.

ఇక పూర్ణిమకు ముందు వచ్చే వరలక్మి వ్రతం అందరు స్త్రీలు ఆచరిస్తారు. ఆ సిరుల తల్లిని తమకు అన్ని విధాలా మేలు జరగాలని, పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండేలా చూడమని వేడుకుంటూ ఆ తల్లిని అలంకరించి, పూజ చేసి, తమ ఇంటి బిడ్డగా భావించి మురిసిపోతూ ఉంటారు. అలాగే శ్రీవారి జన్మ నక్షత్రం ప్రాధాన్యత ఉన్న ఈ మాసములో శనివారములు హరికి పూజలు విశిష్టమైనవి అని ఆచరిస్తూ ఉంటారు. ఆ శ్రీహరి ఆరాధనలో తరిస్తూ ఉంటారు.

ఇవే కాకుండా తోబుట్టువులకు ఆనందాన్ని పంచే రాఖీ, నూతన యజ్ఞోపవీత ధారణా చేయవసిన శ్రావణ పౌర్ణమి, విద్యాధిదేవుడైన హయగ్రీవ స్వామి జయంతి, సంస్కృత దినం అన్నీ ఒకే రోజు వస్తాయి ఈ మాసములో. అంటే కాకుండా జగద్గురువైన కృష్ణుని జన్మదినం  కృష్ణాష్టమి, పోలాల అమావాస్య వంటివి ఈ నెలలోనే ఉంటాయి.

శ్రావణ మాసములో ఈ పూజల కోసము పసుపు విరివిగా వాడతారు. ఈ నెలలో ప్రకృతి వరంగా లభించే పూలను ఈ పూజల్లో విరివిగా వాడుతూ ఉండడం వల్ల ఆయా ఔషధ గుణాలు పొందడం వలన ఈ కాలములో వచ్చే అనారోగ్యముల నుంచి రక్షణ కవచములా పని చేస్తుంది. దేశవాళీ శనగలు వాయినాలలో ఇచ్చి పుచ్చుకోవడం కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయం అవ్వడముతో పాటుగా, ఇంట్లో బాధ్యతలతో తలమునకలుగా ఉన్న స్త్రీలు నలుగురు కలుసుకుని ఆనందముగా కాస్త సమయము గడపడానికి ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకుని  సంతోషపడానికి ఒక చక్కని అవకాశము. 

ఈ రోజుల్లో అయితే కనిపించడము లేదు కానీ మన పెద్ద తరములలో కడుపులో బిడ్డ, చేయి పట్టుకుని పసి బిడ్డలతో, పట్టు చీరతో, పసుపు,కుంకుమ,పూల శోభలతో అమ్మాయి వాయినం కోసము, పసుపు, కుంకుమల కోసం వానకు తడిసి చిత్తడిగా ఉన్న నేల మీద నెమ్మదిగా, జాగ్రత్తగా నడిచి వెళుతూ ఉంటే సాక్షాత్తు అమ్మవారు నడిచివస్తున్నట్లు అనిపించేది.

ఇలాంటి అద్భుతమైన దృశ్యాలకు, పరమాద్భుతమైన భక్తి భావనకు ఆలవాలం అయినా మన శ్రావణమాసముకు స్వాగతం చెప్పి, మన వల్ల అయిన ఆరాధన చేసి తరిద్దాం.