Margashira Lakshmi and Gold
మార్గశిర లక్ష్మీపూజతో బంగారు కాసులు
Margashira Lakshmi and Gold
ద్వాపరయుగంలో సౌరాష్ట్రలో శ్రవణుడు అనే రాజు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడూ, వేదాలు, శాస్త్రాలు , పురాణాలు చదివినవాడు. ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుని చిత్తశుద్ధితో పరిపాలించేవాడు. శ్రవణుడి భార్య సురత చంద్రిక. ఆమె కూడా ఉత్తమురాలు. గొప్ప భక్తురాలు. వారికి ఎనిమిదిమంది సంతానం. ఏడుగురు కొడుకులు, ఒక కూతురు. ఆ రాజు పాలనలో ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉన్నారు.
ఇదిలావుండగా, ధనధాన్యాలిచ్చే లక్ష్మీదేవి సౌరాష్ట్రకు వెళ్ళాలని, రాజును, ప్రజలను దీవించాలని నిర్ణయించుకుంది. లక్ష్మి ఒక వృద్ధ స్త్రీ రూపంలో రాజభవనానికి వెళ్ళింది. అక్కడ మహారాణి దగ్గర పనిచేసే దాసీ ''ఎవరమ్మా నువ్వు?” అనడిగింది.
''నేను మహారాణిని కలవడానికి వచ్చాను. ఆమె క్రితం జన్మలో ఒక పేద వైశ్యుని భార్య. ఆ పేదరాలు ఒకరోజు అంతులేని నిరాశతో ఇళ్ళు విడిచి నడుస్తూ వెళ్ళి అడవి చేరింది. అక్కడ ఆకలితో అలమటిస్తూ, చలికి తాళలేక తిరగసాగింది.
అది చూసిన లక్ష్మీదేవి ఆమెమీద జాలితో మామూలు స్త్రీగా కనిపించి ''మార్గశిర లక్ష్మీదేవి పూజ చేసుకోమని'' చెప్పింది. దాంతో ఆమె వెంటనే ఇల్లు చేరి ఆ పూజ చేసింది. వెంటనే వారి కష్టాలు తీరాయి. ఆ ఇళ్ళు సంపదలతో తులతూగింది...'' అంటూ చెప్పింది.
దాసి వెళ్ళి మహారాణితో అదంతా చెప్పింది. రాణీకి ఆ మాటలు ఎంతమాత్రం నమ్మశక్యంగా తోచలేదు. ''ఈవిడెవరో పబ్బం గడుపుకోవడానికి ఏదో చెప్పింది'' అనుకుని ఆ వృద్ధ స్త్రీని కలవనేలేదు. దాంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి నగరం విడిచి వెళ్ళిపోడానికి సిద్ధమైంది.
ఈ సంగతి తెలిసిన రాకుమారి పరుగున వెళ్ళి వృద్ధస్త్రీని నిలవరించింది. ''మా అమ్మను క్షమించు తల్లీ! మార్గశిర లక్ష్మీ పూజ నేను చేస్తాను'' అంటూ వేడుకుంది. చెప్పినట్లుగానే లక్ష్మీపూజ ఎంతో నమ్మకంతో భక్తిగా చేసింది. లక్ష్మీదేవి సంతోషించింది. ఆ రాకుమారికి ధీరుడు, వీరుడు అయిన రాజుతో వివాహం జరిగింది.
కొంతకాలానికి సౌరాష్ట్ర రాజు శ్రవణుడికి కష్టకాలం దాపురించింది. వర్షాభావంతో పంటభూములు బీడుల్లా మారాయి. విపరీతమైన కరవు వచ్చింది.
మహారాణి సలహా మేరకు, శ్రవణుడు కూతురి ఇంటికి వెళ్ళాడు. ఆమె ఎంతో సానుభూతి చూపి ఒక పాత్ర నిండా బంగారు కాసులు నింపి, మాత బిగించి తండ్రికిచ్చింది. ఆయన రాజ్యానికి తిరిగివచ్చి ఆ పాత్ర మూత తెరిచాడు. అయితే దాన్నిండా బొగ్గు కనిపించింది. అది చూసి రాజు దుఃఖంతో కన్నీళ్ళు కార్చాడు. రాణి అయితే కోపంతో ఊగిపోయింది. ''సాయం చేయకపోగా ఇంత అవమానిస్తుందా'' అంది. ''ఎందుకిలా పరాభావించిందో వెళ్ళి అడుగుతాను'' అంటూ వెళ్ళింది.
రాణి వెళ్ళేసరికి కూతురు మార్గశిర లక్ష్మీపూజ చేసుకుంటోంది. ఆమె తల్లిని చూసి సంబరపడి ''అమ్మా, నువ్వూ పూజ చేయి'' అంది. తల్లి ''చేయలేను'' అంటూ అడ్డంగా తల ఊపింది. కానీ కూతురు విడిచిపెట్టక తల్లితో కూడా పూజ చేయించింది. ఇక రాణి కూతుర్ని ఏమీ అడక్కుండానే పూజ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగివెళ్ళింది. రాణి రాజ్యం తిరిగి చేరేసరికి ఆశ్చర్యకరంగా పూర్వ వైభవం తిరిగి వచ్చింది. రాజభవనం కళకళలాడిపోతోంది. ప్రజలంతా మునుపటిమాదిరిగానే సుఖసంతోషాలతో సంతృప్తిగా కనిపించారు.
అదంతా మార్గశిర లక్ష్మీదేవి పూజ మహిమేనని మహారాణికి స్పష్టమైంది. ఇక అప్పటినుంచీ ప్రతి సంవత్సరం మార్గశిర లక్ష్మీవ్రతం నియమం తప్పకుండా చేయసాగింది. శ్రవణుడు ''ప్రజలంతా మార్గశిర లక్ష్మీవ్రతం చేసుకోవాలని, లేకుంటే అనర్ధమని'' చాటింపు వేయించాడు.
Sourashtra queen lakshmi puja, Lakshmi puja brings glory, Margashira Lakshmi Puja Story, happiness with Lakshmi puja