Read more!

శ్రీసాయిసచ్చరిత్రము పన్నెండవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము  పన్నెండవ అధ్యాయము

 

 

శ్రీ సాయి లీలలు : 1. కాకా మహాజని 2. ధమాల్ ప్లీడరు 3. నిమోణ్ కర్ భార్య 4. ములేశాస్త్రి 5 . రామభక్తుడైన ఒక డాక్టరు, మొదలైనవారి అనుభవాలు
శిష్టులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడని ఇంతకుముందు అధ్యాయాలలో తెలుసుకున్నాము. కాని సద్గురుమూర్తుల కర్తవ్యమ్ దానికి భిన్నమైనది. వారికి మంచివాడూ, చెడ్డవాడూ ఒక్కటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గంలో ప్రవర్తించేలా చేస్తారు. భవసాగరాన్ని హరించడానికి వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయడానికి వారు సూర్యునివంటి వారు. భగవంతుడు యోగుల హృదయంలో నివశిస్తారు. వాస్తవంగా వారు భగవంతునికంటే వేరుకాదు. సద్గురుశ్రేష్టుడైన శ్రీసాయిబాబా భక్తుల క్షేమంకోసం అవతరించారు. జ్ఞానంలో ఉత్క్రుష్టులై, దైవీతేజస్సుతో ప్రకాశిస్తూ వారు అందరిని సమానంగా ప్రేమించేవారు. వారికి దేనిలో అభిమానము ఉండేదికాదు. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమాన్ని వినండి. భక్తులకోరకు తమ పుణ్యం అంతా వెచ్చించి ఎప్పుడూ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. వారికి ఇష్టం లేకపోతే భక్తులు వారి దగ్గరికి రాలేకపోయేవారు. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించేవారు కాదు. వారి లీలలు తెలుసుకోవటం కూడా తటస్థించేది కాదు. మరి అలాంటి వారికి బాబాను దర్శించుకోవాలనే బుద్ది ఎలా పుడుతుంది? కొందరు బాబాను దర్శించుకోవాలని అనుకున్నారు. కాని బాబా మహాసమాధి చెందేలోపు వారికి ఆ అవకాశము కలగలేదు. బాబాను దర్శించుకోవాలనే కోరిక ఉన్నవారు అనేకమంది ఉన్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అలాంటివారు విశ్వాసముతో బాబా లీలలను వింటే దర్శనం వల్ల కలిగే సంతృప్తి పొందుతారు. కొందరు అదృష్టం వల్ల వారి దర్శనము చేసుకున్నా, బాబా సన్నిధిలో ఉండాలని అనుకున్నా అక్కడ ఉండలేకపోయారు. ఎవ్వరూ తమ ఇష్టానుసారము షిరిడీ వెళ్ళలేకపోయేవారు. అక్కడ ఉండటానికి ప్రయత్నించినా ఉండలేకపోయారు. బాబా ఆజ్ఞ ఎంతవరకు ఉండేదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగే వారు. బాబా వెళ్ళిపొమ్మన్న వెంటనే షిరిడీ విడిచి పెట్టాల్సి వస్తుండేది. కాబట్టి సర్వం బాబా ఇష్టం పైనే ఆధారపడి ఉండేది.

కాకా మహాజని :

 

 

 

ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి వెళ్ళారు. అక్కడ ఒక వారంరోజులు వుండి గోకులాష్టమి ఉత్సవాన్ని చూడాలని అనుకున్నారు, బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇలా అన్నారు "ఎప్పుడు తిరిగి యింటికి వెళ్తావు?'' ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపోయారు. కాని ఏదో జవాబు యివ్వాలి కదా! బాబా ఆజ్ఞ ఎప్పుడయితే అప్పుడు వెళ్తాను అని జవాబు యిచ్చారు. అందుకు బాబా ఇలా అన్నారు, "రేపు వెళ్ళు'' బాబా ఆజ్ఞ ఉల్లంఘనీయం కాదు. కాబట్టి అలాగే చేయవలసి వచ్చింది. అందుకే ఆ మరుసటి రోజు కాకా మహాజని షిరిడీ విడిచి పెట్టారు. బొంబాయిలో తన ఆఫీసుకు వెళ్ళగానే వారి యజమాని వారికోసమే ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బు పడ్డారు. కాబట్టి కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఈ విషయం యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా వ్రాశారు. అది కొన్నిరోజుల తరువాత తిరుగు టపాలో బొంబాయి చేరింది.

బాపూసాహెబు ధుమాల్ :

 

 

 

పై దానికి భిన్నంగా కథని ఇప్పుడు వినండి. ప్లీడరు వృత్తిలో ఉన్న బాపూసాహెబు ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ వెళ్తున్నారు. దారిలో దిగి షిరిడీకి వెళ్ళారు.  బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ వెళ్ళాలని శలవు కోరారు. కానీ బాబా ఆజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారంరోజులు వుండేలా చేశారు. ఆ తరువాత అతను బాబా దగ్గర శలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మేజిస్ట్రేటుకు కడుపునొప్పి వచ్చి కేసు వాయిదా పడిందని తెలిసింది. తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగింది. నలుగురు మేజిస్ట్రేటులు దాన్ని విచారించారు. చిట్టచివరికి ధుమాల్ దాన్ని గెలిచారు. అతని క్లయింటు విడుదలయ్యారు.

నిమోన్ కర్ భార్య :

 

 

 

నిమోన్ గ్రామ నివాసి, గౌరవ మోజిస్త్రేటు అయిన నానాసాహెబు నిమోన్ కర్, తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉన్నారు. ఆ దంపతులు తమ సమయమంతా మసీదులోనే గడుపుతూ బాబా సేవ చేస్తుండేవారు. బేలాపూరులో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్టుగా కబురు వచ్చింది. బేలాపూర్ వెళ్ళి తన కుమారున్ని, అక్కడున్న తమ బంధువులను చూసి అక్కడ కొన్ని రోజులు వుండాలని తల్లి అనుకుంది. కాని బేలాపూర్ వెళ్ళి ఆ మరుసటి రోజే షిరిడీ తిరిగి రావాల్సిందని భర్త చెప్పారు. ఆమె సందిగ్ధంలో పడింది. ఏమి చేయాలో తోచలేదు. ఆమె దైవమైన శ్రీసాయినాథుడు అప్పుడు ఆమెను ఆదుకున్నారు. బేలాపూరుకు వెళ్ళడానికి ముందు ఆమె బాబా దర్శనానికి వెళ్ళింది. అప్పుడు బాబా సాఠేవాడా ముందు నానాసాహెబు మొదలైనవారితో ఉన్నారు. ఆమె బాబా దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, బేలాపూరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని కోరింది. అప్పుడు బాబా ఆమెతో ఇలా అన్నారు "వెళ్ళు, ఆలస్యం చేయకు! హాయిగా బేలాపూరులో నాలుగురోజులు వుండి రా! ణీ బంధువులందర్నీ చూసి, నింపాదిగా షిరిడీకి రా!'' బాబా మాటలెంత సమయాకూలంగా ఉండేవో గమనించండి. నిమోన్ కర్ ఆదేశాన్ని బాబా ఆజ్ఞ రద్దుచేసింది.

నాసిక్ నివాసియైన ములేశాస్త్రి :

 

 

 

ములేశాస్త్రి పూర్వాచార పారాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన షట్ శాస్త్ర పారంగతుడు. జ్యోతిషసాముద్రిక శాస్త్రంలో దిట్ట. అతను నాగపూరుకు చెందిన కోటీశ్వరుడైన బాపూసాహెబు బూటీని కలుసుకోవడానికి షిరిడీ వాచారు. బూటీని చూసిన తరువాత బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్లారు. బాబా తన డబ్బుతో మామిడిపండ్లు, కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులో వున్న వారందరికీ పంచిపెడుతున్నారు. మామిడిపండుని బాబా ఒక చిత్రమైన విధంగా అన్నివైపులా నొక్కేవారు. తినేవారు ఆ పండుని నోట్లో పెట్టుకుని చప్పరించగానే రసం అంటా నోటిలోకి వెళ్ళి తొక్క, టెంక మిగిలేవి. అరటిపళ్ళను వలిచి గుజ్జుని భక్తులకు పంచిపెట్టి, తొక్కలు బాబా తన వద్ద ఉంచుకునేవారు. ములేశాస్త్రి సాముద్రికం తెలిసిన వాడవడంతో పరీక్షించటానికి బాబాను చేయి చాచమని అడిగారు. బాబా దాన్ని అసలు పట్టించుకోకుండా, నాలుగు అరటిపళ్ళని అతని చేతిలో పెట్టారు. తరువాత అందరూ వాడా చేరారు. ములేశాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని యగ్నిహోత్రం మొదలైనవి ఆచరించడానికి మొదలుపెట్టారు. బాబా మామూలుగానే లెండీతోటకి బయలుదేరారు.

 

 

మార్గమధ్యలో బాబా హఠాత్తుగా "గేరు (ఎర్రరంగు) తయారుగా వుంచండి. ఈరోజు కాషాయవస్త్రాన్ని ధరిస్తాను'' అని అన్నారు. ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండీతోటనుంచి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం హారతి కోసం సర్వం సిద్ధమయ్యాయి. మధ్యాహ్న హారతికి తనతో వస్తారా అని మూలేశాస్త్రిని బూటీ అడిగారు. సాయంకాలం బాబా దర్శనం చేసుకుంటానని శాస్త్రీ బదులు చెప్పారు. అంతలో బాబా తన ఆసనంపై కూర్చున్నారు. భక్తులు వారికి నమస్కరించారు. హారతి ప్రారంభమైంది. బాబా నాసిక్ బ్రాహ్మణుని దగ్గరనుంచి దక్షిణ తీసుకురమ్మన్నారు. బూటీ స్వయంగా దక్షిణ తీసుకురావడానికి వెళ్ళారు. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతను ఆశ్చర్యపోయాడు. తనలో తాను ఇలా అనుకున్నాడు "నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు. కానీ, నేనాయన అశ్రితుడిని కాదే! వారికి నేనెందుకు దక్షిణ యివ్వాలి?'' సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడగటంతో అతను కాదనలేక పోయాడు. తన అభీష్టం మధ్యలోనే ఆపి, బూటీతో మసీదుకు బయలుదేరాడు.

 

 

మడితో వున్న తాను మసీదులో అడుగుపెడితే మైలపడిపోతానని భావించి, మసీదు బయటే దూరంగా నిలబడి, బాబాపై పువ్వులను విసిరాడు. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువైన ఘోలప్ స్వామి కూర్చుని ఉన్నారు. అతను ఆశ్చర్యపోయాడు. అది కలా నిజమా అని సందేహపడ్డాడు. తనని తాను గిల్లుకుని మళ్ళీ చూశాడు. తాను పూర్తి జాగ్రదావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి అనుకోవడానికి వీలులేదు. అయినా ఏనాడో గతించిన తన గురువు ఇక్కడికి ఎలా వచ్చారు? అతనికి నోటమాట రాలేకపోయింది. చివరికి సందిగ్ధాలన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి, తన గురువు పాదాలపై పది, లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. తక్కిన వారందరూ బాబా హారతి పాడుతుండగా, మూలేశాస్త్రి తన గురువుగారి నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు. తాను అగకులానికి చెందినవాడిని, పవిత్రుడిని అనే అభిజ్యాతము వదిలిపెట్టి తన గురువు పాదాలపై పది సాష్టాంగ నమస్కారం చేసి, కళ్ళు మూడుకున్నాడు. లేచి కళ్ళు తెరిచి చూసేసరికి, అతన్ని దక్షిణ అడుగుతూ సాయిబాబా కన్పించారు. బాబావారి ఆనందరూపాన్ని, ఊహకందని వారి శక్తిని చూసి మైమరిచిపోయాడు. మిక్కిలి సంతోషం కలిగింది. అతని నేత్రాలు సంతోషభాష్పాలతో నిండిపోయాయి. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ యిచ్చాడు. తన సందేహము తీరిందనీ, తనకు గురుదర్శనం అయిందని చెప్పాడు. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను చూసినవారందరూ ఆశ్చర్యం పొందారు. "గేరు తీసుకురండి! కాషాయవస్త్రాలు ధరిస్తా''నని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థాన్ని అప్పుడు గ్రహించారు. సాయియోక్క తీలలు ఆశ్చర్యకరాలు.

రామభక్తుడైన డాక్టరు :

 

 

 

ఒకరోజు మామలతదారు తన స్నేహితుడైన డాక్టరుతో కలిసి షిరిడీ వచ్చారు. షిరిడీ బయలుదేరడానికి ముందు తన మిత్రునితో ఆ డాక్టరు 'తన ఆరాధ్య దైవము శ్రీరాముడ్ని, తాను షిరిడీకి వెళ్ళి ఒక మహామ్మదీయుడికి నమస్కరించడానికి మనస్సు అంగీకరించడం లేదని చెప్పాడు. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంత పెట్టారని, కలిసి సరదాగా గడపడానికి తనతో రావాలని మామలతదారు కోరాడు. దానికి ఆ డాక్టరు సమ్మతించాడు. షిరిడీ చేరుకొని, బాబాను చూడటానికి వారు మసీదుకు వెళ్ళారు. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించటం చూసి ముందు ఆశ్చర్యపడి తన మనో నిశ్చయాన్ని మార్చుకుని ఒక మహామ్మదీయుడికి ఎలా నమస్కరించావని అందరూ అడిగారు. తన ఇష్టదైవమైన శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించటంతో వారి పాదాలపై పడి సాష్టాంగనమస్కారం చేశానని డాక్టరు బదులు చెప్పాడు. అతడు అలా అని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించారు. ఏమీ తోచక, అతడు "ఇది స్వప్నమా ఏమిటి? వారు మహమ్మదీయుడు అవడం ఏమిటి? వారు గొప్ప యోగసంపన్నులైన అవతారపురుషులు'' అని అనుకున్నాడు.

 

 

ఆ మరుసటి రోజే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉన్నాడు. బాబా తనను అనుగ్రహించేవరకూ మసీదుకు వెళ్ళనని నిశ్చయించుకుని మసీదుకి వెళ్ళటం మానుకున్నాడు. ఇలా మూడు రోజులు గడిచాయి. నాలుగవ రోజు తన ప్రియ స్నేహితుడైన ఒకడు ఖాందేషునుండి రావడంతో, వాడితో కలిసి మసీదులో బాబా దర్శనం కోసం తప్పక మసీదుకు వెళ్ళవలసి వచ్చింది. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో "ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచారా ఏమిటి? ఇలా వచ్చావు'' అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న డాక్టరు మనస్సును కదిలించింది. ఆనాటి రాత్రే నిద్రలో అతనికి గొప్ప అధ్యాత్మిక అనుభూతి కలిగి, అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాడు. ఆ తరువాత అతడు తన ఊరికి వెళ్ళినా, ఆ ఆనందానుభూతిని 15 రోజుల వరకు అలాగే ఉండిపోయింది. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా పట్ల భక్తి అనేక రెట్లు వృద్ధి పొందింది.
పై కథల వలన, ముఖ్యంగా ములేశాస్త్రి కథ వలన, నేర్చుకున్న నీతి ఏమిటంటే మనము మన గురువులోనే అనన్యమైన నిశ్చల విశ్వాసము ఉంచుకోవాలి. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెపుతాను.

పన్నెండవ అధ్యాయము సంపూర్ణము