Read more!

శ్రీసాయిసచ్చరిత్రము రెండవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము

 

రెండవ అధ్యాయము

 

ఈ గ్రంథ రచనకు ముఖ్యకారణము

 

 

మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరిబయట చల్లి కలరా వ్యాధిని తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించాను. ఇదేగాక, శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము వ్రాయుటకు పురిగొల్పింది. అదేగాక బాబాగారి వింత లీలలను, చర్యలను మనస్సుకు ఆనందము కలుగ చేస్తాయి. అవి భక్తులకు భోధనలుగా ఉపయోగపడతాయి. తుదకు పాపములను పోగొట్టును గదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయటం మొదలుపెట్టాను. యోగీశ్వరుని జీవితచరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యమును, అధ్యాత్మికమైన మార్గమును చూపును.

గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత - బాబా అభయము

 

 

శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడిని కానని హేమాడ్ పంతు భయపడెను. అతను ఇలా అనుకొన్నాడు 'నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవితచరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు కనిపించటం లేదు. ఈ స్థితిలో ఒక యోగీశ్వర్ని చరిత్రను నేను ఎలా వ్రాయగలను? అవతార పురుషుల లక్షణములు ఎలా వర్ణించగలను? వేదములే వారిని పొగడలేవు. తాను యోగియినా గానీ యోగి యొక్క జీవితమును గ్రహింప లేడు. అలా వారి మహిమలను నేను ఎలా కీర్తించగలను? సప్తసముద్రముల లోతును కొలవ వచ్చు, ఆకాశమును గుడ్డలో వేసి మూయ వచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయటం చాలా కష్టం. ఇది గొప్ప సాహసకృత్యమని కూడా నాకు తెలుసు' అందుకని నలుగురులో నవ్వులపాలు అవుతానేమోనని భయపడి శ్రీసాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను.

 

 

మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవి, యోగీశ్వరుడు అయిన జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసినవారిని భగవంతుడు ప్రేమిస్తాడని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయటానికి కుతూహల పడతారో వారి కోరికలు నెరవేరేలా, వారి గ్రంథములు కొనసాగేలా చేయడానికి యోగులు అనేక మార్గములు అవలంభిస్తారు. అలాంటి పనులకు యోగులే ప్రేరేపిస్తారు. దానిని నెరవేర్చటానికి భక్తుని కారణమాత్రునిగా ఉంచి వారి వారి కార్యాలను వారే కొనసాగించుకుంటారు. 1700 శక సంవత్సరంలో మహీపతి అను పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయాలని కాంక్షించారు. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యాన్ని కొనసాగించారు. అలాగే 1800 శక సంవత్సరములో దాసగుణు సేవను ఆమోదించారు. మహీపతి నాలుగు గ్రంథాలను వ్రాసారు. అవి భక్త విజయము, సంత విజయము, బక్తలీలామృతము, సంతకథామృతము అనేవి. దాసగుణు వ్రాసినవి భక్తలీలామృతము, సంతకథామృతము మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీటిలో ఉన్నాయి. భాక్తలీలామృతములోని 31,32,33 అధ్యాములలలోను, సంతకథామృతములోని 57వ అధ్యయనము అందు సాయిబాబా జీవితచరిత్ర, వారి బోధనలను చక్కగా వ్రాసారు. ఇవి సాయిలీలా మాసపత్రిక, సంపుటము 17, సంచికలు 11,12లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యాయములు కూడా భక్తులు చదవాలి. శ్రీ సాయిబాబా అద్భుతలీలలు బాంద్రా నివాసి అయిన శ్రీమతి సావిత్రీబాయి రఘునాథ్ టెండూల్కర్ చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడ్డాయి. దాసగుణు మహారాజుగారు కూడా శ్రీసాయి పాటలు మధురంగా వ్రాసారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవాని మెహతా అను భక్తుడు శ్రీసాయి కథలను ముద్రించారు. సాయినాథప్రభ అనే మాసపత్రిక షిరిడీలోని దక్షిణభిక్ష సంస్థవారు ప్రచురించారు. ఇన్ని గ్రంథములు ఉండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయటానికి కారణమేమిటి? దాని అవసరమేంటి? అని ఎవరైనా ప్రశించవచ్చు.

 

 

దీనికి జవాబు చాలా తేలిక! సాయిబాబా జీవితచరిత్ర సముద్రములాగా విశాలమైనది, లోతైనది. అందరూ దీనిలో మునిగి భక్తీజ్ఞాన మణులను వెలికితీసి కావలసినవారికి పంచి పెట్టవచ్చు. శ్రీసాయిబాబా కథలు నీతిబోధకంగా, లీలలు చాలా ఆశ్చర్యాన్ని కలగచేస్తాయి.  అవి వికలమైన మనస్సు వారికి, విచారగ్రస్తులకి శాంతి చేకూర్చి, ఆనందము కలగజేస్తాయి. ఇహపరములకు కావలసిన జ్ఞానాన్ని, బుద్ధిని ఇస్తాయి. వేదాలలాగా, జనరంజకంగా ఉపదేశాలైన బాబా ప్రభోదాలు విని, వాటిని మననము చేస్తే భక్తులు కోరినవి, అంటే బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందుతారు. అందుకే బాబా లీలలను పుస్తకరూపములో రాయాలని నిశ్చయించుకున్నాను. బాబాను సమాధి ముందు చూడని భక్తులకు ఈ లీలలు చాలా ఆనందము కలుగ చేస్తాయి. అందుకే బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమైన పలుకులు, బోధలు సమకూర్చుకోడానికి పూనుకున్నాను. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించారు. నా అహంకారాన్ని ఆయన పాదములపై ఉంచి శరణు కోరాను. కావున నా మార్గము నవ్యమైనవని, బాబా ఇహపరసౌఖ్యాలు తప్పక దయచేస్తారని నమ్మాను.

 

 

నా అంతటా నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకపోయాను. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అనే వారు బాబాకు ముఖ్యభక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించాలని కోరాను. నా తరపున వారు బాబాతో ఇలా చెప్పారు "ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్ర వ్రాయాలని ఆకాంక్షిస్తున్నాడు, 'నేను భిక్షాటన చేస్తూ జీవించే ఫకీరును, నా జీవిత చరిత్ర రాయాల్సిన' అవసరంలేదని అనకండి! మీరు సమ్మతించి సహాయపడితే వారు వ్రాస్తారు. లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేస్తుంది. మీయొక్క అనుమతి, ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము'' అది విన్న వెంటనే శ్రీసాయిబాబా మనస్సు కరిగి, నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించి శ్యామాతో ఇలా చెప్పసాగారు "కథలను, అనుభవాలను, ప్రోగుచేసుకోమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేస్తాను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవితచరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చాలి. వాడు తన అహంకారాన్ని విడవాలి. దానిని నా పాదములపైన పెట్టవలెను. ఎవరయితే వారి జీవితములో ఇలా చేస్తారో వారికి నేను మిక్కిలి సహాయపడతాను. నా జీవితచర్యల కోసమే కాదు, సాధ్యమయినంతవరకూ వారి గృహకృత్యాలలో కూడా తోడ్పడతాను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన తరువాత అది మచ్చుక కూడా లేనప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుంటాను. నా కథలు, బోధనలు విన్న భక్తులకు భక్తివిశ్వాసములు చేకూరుతాయి. వారు ఆత్మ సాక్ష్యాత్కారము, బ్రహ్మానందము పొందుతారు. నీకు తోచిన దానినే నీవు నిర్థారణ చేయడానికి ప్రయత్నించకు. ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయడానికి ప్రయత్నించకు. ఏ విషయంపైనైనా కీడు, మేలు ఎంచుకోవడంలో వివాడకు కూడదు''
వివాదమనగానే నన్ను 'హేమాడ్ పంతు' అని పిలవటానికి క్రారణమేమో, మీకు చెప్తానని వాగ్దానం చేసిన మాట జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోతున్నాను. కాకాసాహేబు దీక్షిత్, నానాసాహెబు చాందోర్కరులతో నేను ఎక్కువగా స్నేహముతో ఉన్నాను. వారు నేన్ను షిరిడీ వెళ్ళి బాబా దర్శనము చేయమని బలవంతం చేశారు. అలాగే చేస్తానని వారికి మాట ఇచ్చాను. ఈ మధ్యలోనే ఏదో జరిగింది. అది నా షిరిడీ ప్రయాణానికి అడ్డుపడింది. లోనావాలాలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడ్డాడు. నా స్నేహితుడు మందులు, మంత్రాలు అన్నీ ఉపయోగించాడు గాని ఫలితం కనబడలేదు, జబ్బు తగ్గలేదు. చివరికి వాడి గురువుని పిలిచి దగ్గర కూర్చుండబెట్టుకున్నాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఈ సంగతి విని "నా స్నేహితుని కుమారుడిని రక్షంచలేనట్టి గురువుయొక్క ప్రయోజనము ఏమిటి? గురువు మనకు ఏ విధమైన సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఎలా వెళ్ళాలి?'' అని భావించి, షిరిడీ ప్రయాణాన్ని మానుకున్నాను. కాని జరగాల్సింది జరగకమానదు. అది ఈ విధంగా జరిగింది.

 

 

నానాసాహెబు చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకరోజు వసయీకి పర్యటనకై వెళుతున్నాడు. ఠాణానుండి దాదరుకు వచ్చి అచ్చట వసయీకి వెళ్లవలసిన బండి గురించి వేచివున్నాడు. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చింది. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి, నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందుకు నన్ను కోప్పడ్డారు. నానా సంతోషంగానూ, అనుకూలంగానూ ఉన్నారు. అందుకే ఆ రాత్రికే షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకున్నాను. సామానులు కట్టుకుని షిరిడీ బయలుదేరాను. బాంద్రా నుండి దాదరు వెళ్ళి, అక్కడ మన్మాడ్ రైలు ఎక్కాలని అనుకున్నాను. అలాగే దాదరుకు టిక్కెట్టుకొని, రైలు రాగానే ఎక్కి కూర్చున్నాను. బండి ఇక బయలుదేరుతుందనగా ఒక మహమ్మదీయుడు నేను కూర్చుని ఉన్న పెట్టెలోకే హడావుడిగా ఎక్కి నా సామాను అంతా వెతికి ఎక్కడికి వెళుతున్నావు? అని అడిగాడు. నా ఆలోచనను ఆయనకీ చెప్పాను. వెంటనే అతను దాదరు స్టేషనులో దిగవద్దనీ, ఎందుకంటే మన్మాడ్ మెయిలు దాదరులో ఆగదనీ, అదే రైలులో ఇంకా ముందుకు పోయి బోరీబందరు స్టేషనులో దిగమని నాకు సలహా ఇచ్చాడు. ఈ చిన్న లీలయే జరగకపోయివుంటే నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరుకోలేకపోయే వాడిని. అనేక సందేహములు కూడా కలిగాయి. కాని నా అదృష్టవశాత్తు అది అలా జరగలేదు. మరుసటి రోజు సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరుకున్నాను. శిరిడీలో నా కోసం కాకాసాహెబు దీక్షిత్ ఎదురుచూస్తున్నారు.

 

 

ఇది 1910 ప్రాంతంలో జరిగింది. అప్పటికి సాఠేవాడా ఒక్కటే షిరిడీకి వచ్చే భక్తులకోసం నిర్మించబడినది. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించుకోవాలనే ఆతృత నాలో కలిగింది. అంతలో, అప్పుడే మసీదునుండి వస్తున్న తాత్యాసాహెబు నుల్కరు, బాబా వాడా చివరన ఉన్నాయనీ, మొట్టమొదట ధూళీదర్శనము చేసుకోమని నాకు సలహా ఇచ్చారు. స్నానం చేసిన తరువాత ఓపికగా మళ్ళీ చూడవచ్చు అని చెప్పారు. ఇది విన్న వెంటనే నేను వెళ్ళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాలో ఆనందము పొంగిపొరలింది. నానాసాహెబు చాందోర్కరు చెప్పిన దానికంటే ఎన్నోరెట్లు అనుభవం కలిగింది. నా సర్వేంద్రియాలు తృప్తిచెంది ఆకలిదప్పికలు మరిచిపోయాను. మనస్సుకు సంతోషం కలిగింది. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగింది. నాకు షిరిడీ పోవాలని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో ఋణపడినట్లుగా భావించాను. వారిని నా నిజమైన శేనితులుగా భావించాను. వారి ఋణాన్ని నేను తీర్చుకోలేను. వారిని జ్ఞాపకానికి తెచ్చుకుని, వారికి నా మనసులో సాష్టాంగప్రణామము చేసాను. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనమువల్ల కలిగే విచిత్రం ఏమిటంటే మనలో ఉన్న ఆలోచనలు మారిపోతాయి. వెనుకటి కర్మల బలము తగ్గిపోతాయి. క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగుతాయి. నా పూర్వజన్మ సుకృతం వల్లనే నాకు ఈ దర్శనము లభించిందని అనుకున్నాను. సాయిబాబాని చూసినంతనే ఈ ప్రపంచమంతయూ సాయిబాబా రూపము వహించెను.

తీవ్ర వాగ్వివాదము :

 

 

 

నేను షిరిడీ చేసిన మొదటి రోజుననే నాకూ బాలాసాహెబు భాటేకు గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగింది. మన స్వేచ్చను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెను అని నేను వాదించాను. "మన కర్మలను మనమే చేయుటకు గురుగు యొక్క ఆవశ్యకత ఏమిటి? తనంతట తానే కృషి చేసి, మిక్కిలి యత్నముతో ఈ జన్మదుఃఖము నుండి తప్పించుకోనవలెను. ఏమీ చేయక సోమరిగా కూర్చునేవాడికి గురువు ఏమి చేయగలడు?'' అని నేను స్వేచ్చ పక్షాన్ని ఆశ్రయించాను. భాటే ఇంకొక వాదమును పట్టుకుని, ప్రారబ్ధము తరపున వాదిస్తూ "కానున్నది కాక మానదు మహనీయులు కూడా ఈ విషయములలో ఓడిపోయారు. మనుషులు ఒకటి తలిస్తే భగవంతుడు వేరొకటి తలుస్తాడు. నీ తెలివితేటలను అటు ఉండనివ్వు. గర్వముగాని, అహంకారముకాని మీకు తోడ్పడవు'' అని చెప్పాడు. ఈ వాడడాన ఒక గంట వరకు జరిగింది. కాని యిదమిద్ధమని ఏమే తేలలేదు. అలసి పోవడంతో ఘర్షణను మానుకున్నాము. ఈ మనశ్శాంతి లేకుండా పోయింది. దేహాత్మబుద్ధి, అహంకారము లేకపోతే వివాదమునకు తావు లేదు అని గ్రహించాను. వివాదమునకు మూలకారణం అహంకారము. ఇతరులతో కూడి మేము మసీదుకు వెళ్లగా, బాబా కాకాను పిలిచి ఇలా అడిగారు "వాడాలో ఏమి జరిగింది? ఏమిటా వివాదము? అది దేని గురించి? ఈ హేమాడ్ పంతు ఏమంటున్నాడు?
ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. సాఠేవాడా మసీదుకు చాలా దూరంగా వుంది. మా వివాదము గురించి బాబాకి ఎలా తెలిసింది? అతను సర్వజ్ఞుడై ఉండ వలెను. లేకపోతే మా వాదన ఎలా గ్రహిస్తారు? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును.

హేమాడ్ పంతు అను బిరుదునకు మూలకారణము :

 

 

సాయిబాబా నన్నెందుకు "హేమాడ్ పంతు" అని పిలుస్తారని ఆలోచించ సాగాను. ఇది 'హేమాద్రిపంతు' అనే నామానికి రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవవంశ రాజులకు హేమాద్రిపంతు ప్రధాన అమాత్యుడు. అతను గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు' చతుర్విర్గ చింతామణి, రాజ ప్రశస్తి అను గొప్ప గ్రంథాలను రచించినవాడు' మోడీ భాషను, ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా? వారికి వ్యతిరేక బుద్ధిగలవాడను. మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకీ 'బిరుదు' ఇచ్చారో తెలియలేదు. ఆలోచన చేయగా అది నా అహంకారమును చంపుటకు ఒక నెపమని, నేనెప్పుడూ అణుకువ, నమ్రతలు కలిగి ఉండ వలెనని బాబా కోరిక అయి ఉండవచ్చును అని గ్రహించాను. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకున్నాను. భవిష్య చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు (దాభోళ్కరును 'హేమాడ్ పంతు' అనుట) గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా అతనేననియు భావించవచ్చును. ఎలా అనగా హేమాడ్ పంతు శ్రీసాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపారు. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా ఉంచెను. అదేకాక భక్తీ, జ్ఞానము, నిర్వామోహము, ఆత్మశరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలైన విషయాలతో శ్రీసాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథమును రచించెను.

గురువు యొక్క ఆవశ్యకత :

 

 

ఈ విషయమై బాబా ఏమనేనో హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ, కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకున్న దానిని ప్రచురించెను. హేమాడ్ పంతు బాబాను కలిసిన రెండవ రోజు కాకా సాహెబు దీక్షిత్ బాబావద్దకు వచ్చి "షిరిడీ నుండి వెళ్ళ వచ్చునా?'' అని అడిగారు. బాబా అలాగే అని జవాబిచ్చారు. "ఎక్కడకు'' అని ఎవరో అడుగగా "చాలాపైకి'' అని బాబా చెప్పారు. "మార్గమేది?'' అని దీక్షిత్ అడిగారు. "అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీనుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున ఉన్న అడవిలో పులులు, తోడేళ్ళు కలవు'' అని బాబా బదులిచ్చారు. "మార్గదర్శకుని వెంట టీఉకుని పోయినచో?'' అని కాకాసాహెబు అడుగగా, "అట్లయితే కష్టమే లేద''ని బాబా జవాబిచ్చారు. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున ఉన్న తోడేళ్ళు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడు లేకపోతే అడవి మృగాల వల్ల చంపబడవచ్చును. లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును అన్నారు. మసీదులో అప్పుడు అక్కడే వున్న దాభోళ్కరు తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించారు. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్చాపరుడా? కాదా? అనే వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించారు. పరమార్థము నిజముగా గురుబోదలవల్లనే చిక్కుతుందని, రామకృష్ణులు తమ గురువులైన వసిష్టసాందీపులకు లొంగి అనుకువతో ఉంది ఆత్మసాక్షాత్కారము పొందారని, దానికి దృఢమైన నమ్మకము (నిష్ఠ), ఓపిక (సబూరీ) అను రెండు గుణములు ఆవశ్యకమనీ గ్రహించారు.
                రెండవ అధ్యాయము సంపూర్ణము