Read more!

బాబా ఆజ్ఞ మేరకు షిరిడీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది

 

శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము

 




స్వచ్చమైన మనసుతో భగవంతుని శరణుజొచ్చిన వారికి ఆయన కృప కలుగును. భగవంతుని దూషించిన వారు కూడా క్షమాభావనతో బాబాను ఆశ్రయించిన వారిని బాబా కరుణించును. ఈ అధ్యాయములో అలాంటి కథ తెలుసుకుందాం.

షోలాపూర్, అక్కలకోట వాసి సపత్నేకర్. అతను న్యాయశాస్త్రం చదువుతుండెను. అతని మిత్రుడు శేవడే. పరీక్ష సమయంలో పాఠ్యాంశములపై ప్రశ్నోత్తరములు నిర్వహించిరి. అందులో శేవడే వెనుకబడి వున్నాడని తేలింది. కానీ షేవడే తాను తప్పకుండా పరీక్షలలో ఉత్తీర్ణుడవుతాని, షిరిడీలో గల బాబా కృప తనపై వుందని నమ్మకంగా చెప్పాడు. ఇది తోటి విద్యార్థులకు ఆశ్చర్యం కలిగించింది. సపత్నేకర్ శేవడేని హేళన చేసెను. అతని మాటలను వెక్కిరించెను.
ఆ పరీక్షలలో సపత్నేకర్ ఉత్తీర్ణుడయి, న్యాయవృత్తిని చేపట్టాడు. అలా పది సంవత్సరాలు గడిచాయి. 1913లో అతని కుమారుడు గొంతు వ్యాధితో మరణించెను. మానసిక వ్యథతో సపత్నేకర్ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించెను. పండరీపురం, గాణగాపురం దర్శించి శాంతి పొందాలని ప్రయత్నించెను. అతని వేదన తీరలేదు. అప్పుడు శేవడే చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే తన సోదరుడు పండితరావుతో కలిసి షిరిడీకి బయలుదేరాడు. అక్కడ బాబా దర్శనానికి వెళ్లి, బాబా పాదాల చెంత కొబ్బరికాయ వుంచి, సాష్టాంగ నమస్కారం చేసేను. వెంటనే బాబా అతనిని బయటకు వెళ్లుమని అరిచెను. సపత్నేకర్ వెనుకకు జరిగి అక్కడే కూర్చున్నాడు. బాబా కటాక్షం పొందడానికి సలహా కోసం ప్రయత్నించాడు. బాలాషింపి పేరు తెలుసుకుని, ఆయన దగ్గరకు వెళ్లాడు. ఆయన వారితో బాబా ఫోటోలు కొనిపించి, బాబా వుండే మసీదుకు తీసుకు వెళ్లాడు. బాలాషింపి ఒక ఫోటో బాబా చేతిలో పెట్టి అది ఎవరిది అని అడిగెను. దానికి బాబా నన్ను ప్రేమించే వారిది అని చెప్పి సపత్నేకర్ ని చూపించారు. బాబా నవ్వుతూ  వుండగా సపత్నేకర్ ఆయన పాదాలకు నమస్కరించెను. అప్పుడు బాబా మళ్లీ సపత్నేకర్ ని అక్కడ నుంచి వెళ్లమని, ఆ మసీదు ప్రదేశాన్ని పూర్తిగా విడిచి వెళ్లాలని ఆజ్ఞాపించారు. సపత్నేకర్ బాబా ఆజ్ఞ మేరకు షిరిడీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

 



ఆ సంఘటన జరిగి ఒక సంవత్సరం గడిచింది. సపత్నేకర్ అశాంతి రోజురోజుకి పెరగసాగింది. ఇక దిక్కుతోచక అతను కాశీకి పయనమవ్వాలని నిశ్చయించుకున్నాడు. మరో రెండు రోజులలో యాత్రకు బయలుదేరవలసి వుండగా అతని భార్యకు ఒక కల వచ్చింది. అందులో ఆమె నీళ్ళ కోసం లకడ్షాబావికి వెళుతూ వుంది. అక్కడ ఒక ఫకీరు, ఆమె దగ్గరకు వచ్చి "అమ్మా! నీవు అనవసరంగా శ్రమపడుట ఎందుకు? నేను స్వచ్చమైన నీటితో నీ కుండ నింపుతాను కదా" అని పలికెను. ఆమె ఫకీరును చూసి భయపడి వెనక్కి బయలుదేరింది. ఫకీరు కూడా ఆమె వెంట వచ్చెను. అంతట ఆమె కళ్లు తెరిచింది. ఈ కల గురించి ఆమె తన భర్తకు చెప్పింది. అతను మారు ఆలోచన లేకుండా ఆమెను షిరిడీకి తీసుకొని వెళ్లాడు. అప్పుడు బాబా లెండీ తోటలో వున్నారు. తోటలో బాబా, ఆమె కలలో కనిపించిన బాబా ఒకరే అని ఆమె గ్రహించింది. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి, అక్కడే కూర్చుండి పోయింది. ఆమె భక్తికి సంతోషించిన బాబా ఒక కథ చెప్పుట మొదలుపెట్టెను. "నా చేతులు, పొత్తికడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెడుతున్నాయి అనేక మందులు వాడాను. అయినా లాభం లేదు. కానీ ఆశ్చర్యం... ఇక్కడ నా నొప్పులన్నీ వెంటనే తగ్గిపోయాయి." అనెను. సపత్నేకర్ భార్య ఆ నొప్పులతో బాధపడుతూ వుండేది. కొంత కాలం తర్వాత ఆమె నొప్పులన్నీ నిజంగానే తగ్గిపోయాయి. సపత్నేకర్ మరలా బాబా దర్శనానికై వెళ్లాడు. బాబా ఈ సారి కూడా బయటకు పొమ్మన్నారు. అతడు గతంలో బాబాను నిందించి, ఎగతాళి చేసినదానికి ఇది ప్రతిఫలం అని గ్రహించాడు. దానికి పరిహారం చేసుకొనుటకు పశ్చాతాప హృదయంతో ప్రయత్నించాడు. బాబా ను ఒంటరిగా కలిసి క్షమాపణ అడిగి ఆయన పాదాలపై తల పెట్టి, రోదించాడు. బాబా  కాళ్ళు నొక్కుతూ అక్కడే కూర్చిండి పోయాడు.

 



అంతలో ఒక గొల్లస్త్రీ వచ్చి బాబా సేవ చేయుట ఆరంభించెను. అప్పుడు బాబా ఒక కొమటి వాని కథ చెప్పెను. అందులో అతని కొడుకు మరణించెనని చెప్పారు. ఆ కథ తనదేనని సపత్నేకర్ తెలుసుకున్నాడు. బాబాకు తన గురించి అన్ని విషయాలు ఎలా తెలుసా అని అతనికి ఆశ్చర్యం కలిగింది. ఇంతలో గొల్లస్త్రీకి కథ చెబుతున్నట్లుగా నటిస్తూనే బాబా సపత్నేకర్ వైపు చూసి "వీడు తన కొడుకుని నేనే చంపానని నన్ను నిందిస్తున్నాడు. నేను బిడ్డలను చంపేవాడినా..! మళ్లీ మసీదుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు..? అదే బిడ్డ వీడి భార్య గర్భం ద్వారా జన్మించే లా చేస్తా.." అని సపత్నేకర్ తలపై తన చేతిని వుంచి ఓదార్చెను. "ఈ పాదాలు ముసలివి, పవిత్రమైనవి. నీ కోరిక నెరవేరును" అని సపత్నేకర్ కి బాబా అభయమిచ్చెను. ఆ రోజు రాత్రి సపత్నేకర్ కు బాబా పాండురంగనివలె దర్శనమిచ్చెను. ఆ మరుసటి రోజు ఇంటికి బయలు దేరు ముందు బాబాను దర్శించుకున్నాడు సపత్నేకర్ . అప్పుడు బాబా టెంకాయ ఇచ్చి "నీ భార్య చీరకొంగులో పెట్టు. ఆందోళన చెందకు" అని ఆశీర్వదించెను.  సంవత్శరములోపునే సపత్నేకర్ దంపతులకు కొడుకు పుట్టెను. వారు ఆ బిడ్డతో కలిసి షిరిడీకి వచ్చి  బాబాని భక్తి శ్రద్ధలతో ప్రార్థించిరి. వారు తమ పుత్రుడికి మురళీధర్ అని పేరు పెట్టిరి. తర్వాత పారికి భాస్కర్, దినకర్ అను ఇద్దరు సంతానం కూడా కలిగెను. అలా బాబా కృపతో వారి కోరికలు తీరినాయి.