Read more!

మనం అడిగింది కాదు మనకు అవసరమైంది ఇస్తాడు షిర్డీ సాయి (Shirdi Saibaba Prayer)

 

మనం అడిగింది కాదు

మనకు అవసరమైంది ఇస్తాడు షిర్డీ సాయి

(Shirdi Saibaba Prayer)

సాయిబాబా మనతోబాటు మెలిగిన రోజుల్లో, సమాధి అయిన తర్వాత కూడా ఆయన్ను ఎందరో ఎన్నో కోరుకుంటున్నారు. బాబా మహిమాన్వితుడు అయ్యుండీ, అందరికీ అన్నీ ఇవ్వలేదు. భక్తులు, తాము కోరుకున్నది బాబా ఇవ్వనప్పుడు, తాము తలపెట్టిన పనులు నేరవేరనప్పుడు వేదనకు గురవ్వడం సహజం. ఒక్కోసారి బాబా తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపిస్తూ నిందించడమూ జరుగుతుంది.

 

రాగద్వేషాలను జయించాలని, పరమాత్మను అవలోకిస్తూ, ఆత్మజ్ఞానాన్నిపెంచుకోవాలని సాయిబాబా చెప్పేవారు. ఇహలోక స్వార్ధ చింతనలోనే గడుపుతుంటే, పరలోక సాధన ఎలా సాధ్యమౌతుంది?

 

దేవుళ్ళు ఆకాశాన ఉన్నారు. మన భయాలు, భ్రమలు, కోరికలు, మోహాలు భూమ్మీద ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఇంకా కిందికి లాగుతుంటాయి. మరి మనం ఆ కోరికలను తీర్చుకునే నెపంతో అధః పాతాళానికి వెళ్ళాలో, లేక దైవ చింతనలో కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఆకాశానికి చేరుకోవాలో తేల్చుకోవాలి. మనం చేర్కొవాల్సింది దేవుడి సన్నిధినే అని గుర్తుంచుకోవాలి.

 

దైనందిన జీవితంలో అనేక బరువులు, బాధ్యతలు ఉంటాయి. ఎన్నోమోహాలు, వ్యామోహాలు, ప్రభావాలు, ప్రలోభాలు ఉంటాయి. అవి భగవత్ ధ్యానానికి అడ్డు కాకుండా చూసుకోవాలి. అవే ముఖ్యం అనుకుని, వాటికి లొంగిపోతే ఇక పాతాళానికి జారిపోవడం ఖాయం.

 

ఆత్నజ్ఞానం కలిగించి, ఉత్తమ మార్గాలను అందుకునే శక్తిని, యుక్తిని ఇచ్చేది సాయి స్మరణ. సాయిబాబాను విశ్వసించి, ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తూ ముందుకు సాగితే ఇహలోకంలో జీవితం సాఫీగా సాగిపోతుంది. పరలోకంలోనూ ముక్తి దొరుకుతుంది.

 

సాయిబాబా మనం కోరుకున్నది అన్నిసార్లూ ఇవ్వకపోవచ్చు. మనం అడిగినదానికంటే, మనకు ఏది మంచిదో దాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని అవగాహన చేసుకోకుండా, బాబాను ప్రార్ధించినా లాభం లేదు, కోరుకున్నది దొరకలేదు అని అసంతృప్తి చెందడం తెలివైన పని కాదు.

 

భస్మాసురుడు లాంటి రాక్షసులు అనేకమంది కఠోర తపస్సు చేసి గొప్ప వరాలను పొందారు. భోళా శంకరుడు ముందువెనుకలు ఆలోచించకుండా వారికి ఆ వరాలు ప్రసాదించడం, ఆనక ఆ వరాలు దేవతలకే హాని చేయడం మనం పురాణ కధల్లో చదివాం. అలా చెడు పరిణామాలు సంభవించే అవకాశం ఉందని మాత్రమే కాదు, కొన్నిసార్లు మనం కోరుకున్నవి న్యాయమైన కోరికలు కాకపోవచ్చు.

 

గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో కర్మ రూపంలో ఎదురౌతాయి. ఆయా ఫలితాలను బట్టి పిల్లలు పుట్టకపోవడం, తీవ్ర అనారోగ్యం కలగడం, లేదా ఇంకా అనేక రూపాల్లో మనకు దుర్భర కష్టనష్టాలు అనుభవమౌతాయి. వాటిని నివారించమని సాయిబాబాను కోరుకోవడం న్యాయం కాదు. ఒకరకంగా దురాశ అనిపించుకుంటుంది.

 

అందుకే సాయిబాబా మహా మహిమాన్వితుడు అయినప్పటికీ, తాను తీర్చగలిగిన కోరికలను కూడా కొన్నిసార్లు తీర్చాడు. పూర్వ కర్మల రీత్యా వచ్చే దుఃఖాలను ఈ జన్మలో అనుభవించమని, వాటిని మరుజన్మకు మోసుకువెళ్తే పాపం పెరిగినట్లు మరింత దుఃఖభాజనమౌతుందని చెప్తాడు బాబా.

 

Shirdi Saibaba, Shirdi Sai speeches, Shirdi Saibaba words, Shirdi Saibaba Prayer, Shirdi Sainatha