Read more!

మంచి ప్రయత్నాలకు అండగా నిలిచే బాబా!

 

మంచి ప్రయత్నాలకు అండగా నిలిచే బాబా!

మంచికోసం మనిషి నిరంతరం ప్రయత్నం చేయాలి. మనసు మాయల ఫకీరు. కొద్దిసేపు ఆశల పల్లకిలో ఊరేగిస్తుంది. మరికొద్దిసేపు ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంది. అదే సమయంలో పాతాళానికి దిగజార్చే సందేహాలను, అపోహలను కలిగిస్తుంది. నిలకడలేని తనం దాని లక్షణం. ఇలాంటి మనసును అదుపులో పెట్టుకోవటానికి మనిషి ఏదో పని చేయటం ద్వారా దారి మళ్లించాలి. పనిలో, దాని తాలూకు ప్రయత్నాల్లో మునగాలి. మనసులో మంచి ఆలోచనలు కలగటం కోసం, ఆ ఆలోచనలు సాఫల్యం కావటం కోసం చేసే ఎలాంటి ప్రయత్నానికైనా భగవంతుడు మనకు అండగా నిలుస్తాడు.

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పార్థునికి చెప్పింది కూడా ఇదే. "అర్జునా! మనసు నిలకడ లేనిది. దానిని నిశ్చలం చేసుకోవటం ద్వారా ప్రతిమనిషి తనను తానే ఉద్దరించుకోవాలి. తనను తానే సంస్కరించుకోవాలి. అంతేతప్ప మనసు చెప్పినట్టల్లా తలాడించి తనను తాను అధోగతి పాలు చేసుకోకూడదు." షిర్డీ సాయిబాబా కూడా తన భక్తులకు ఇదే విషయాన్ని బోధిస్తున్నారు.

రోహిల్లా అజానుబాహుడు. అతను షిర్డీలో ఉండేవాడు. అతనికి మనసు నిలకడ ఉండేది కాదు. ఏవేవో ఆలోచనలు కలిగి మనిషి కదిలిపోతుండేవాడు. అతను చదువుకున్న వాడు కాదు. మనసును అదుపులో పెట్టుకోవటానికి ఏం చేయాలో తెలియదు. అతనికి తెలిసిన ఏకైక మంత్రం దైవనామ స్మరణ. తనలో చెడ్డ ఆలోచనలు కలగకుండా ఉండేందుకు రోహిల్లా రాత్రీ పగలు తేడా లేకుండా నిరంతరం "అల్లా హా అక్బర్ " అని గట్టిగా అరుస్తుండేవాడు. ఆ స్మరణ ద్వారా మనసులో చెడ్డ ఆలోచనలకు చోటుకలగదు అనేది అతని భావం.

రోహిల్లా అలా అరుస్తుంటే ఆంబోతు రంకెలు వేసినట్టుండేది. పనీపాటు చేసుకుని హాయిగా నిద్రపోతున్న షిర్డీవాసులు ఈ రంకెలతో ఉలిక్కిపడి లేచేవారు. రోజూ ఇదో తంతుగా మారిపోవటంతో భరించలేక సాయినాథుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. "ఎవరు పనులు వారు చేసుకోండి. రోహిల్లా జోలికి వెళ్లకండి" అని బాబా గట్టిగా చెప్పటంతో వారు విస్తుపోయారు.

"రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య ఉంది. ఆమె పరమ గయ్యాళి. అతని మనసును కుదురుగా ఉండనీయట్లేదు. ఆ దౌర్భాగ్యం నుంచి బయటపడేందుకే రోహిల్లా భగవన్నామస్మరణ అలా గట్టిగా చేస్తున్నాడు" అని షిర్డీవాసులకు బాబా సర్దిచెప్పారు.

నిజానికి రోహిల్లాకు పెళ్లి కాలేదు. కానీ బాబా ఇక్కడ భార్య అన్నది అతని మనసులోని దుర్భుద్ధిని ఉద్దేశించి, అతని మనసులో చెడ్డ ఆలోచనలు లేస్తున్నాయి. వాటిని అణచుకోవటానికే రహిల్లా భగవంతుని నామాన్ని గట్టిగా స్మరిస్తున్నాడు. బాబా అతని ప్రయత్నాన్ని గ్రహించారు. కాబట్టే షిర్డీవాసులు అతని పై ఫిర్యాదు చేసినా బాబా వారిపైనే తిరిగి కేకలు వేశారు. మంచి కోసం చేసే ప్రయత్నాన్ని ఏదోవిధంగా ప్రోత్సహించాలనేది బాబా అభిమతం. కొన్నాళ్లకు నిరంతర భగవన్నామ స్మరణ ద్వారా రోహిల్లా మనసు కుదుటపడింది.

సాయిబాబా ప్రత్యేకత ఏమిటంటే ఏ విషయమైనా భక్తుల మనసులో సూటిగా నాటుకుపోయేలా నిదర్శనాలు చూపేవారు. చిన్న చిన్న ఉపదేశాలు, సన్నివేశాల ద్వారా ఎవరో ఒకర్ని నిదర్శనంగా చూపి మిగతా వారి కళ్ళు తెరిపించే వారు. మంచితనాన్ని, మంచి ప్రయత్నాలను ఎలా ప్రోత్సహించాలో కళ్లకు కట్టినట్టు చూపేందుకు బాబా రోహిల్లాను నిదర్శనంగా చూపారు.