Read more!

వివాహం తరువాత అమ్మాయిల కోసం ఏడు సూత్రాలు!

 

వివాహం తరువాత అమ్మాయిల కోసం ఏడు సూత్రాలు!

భారతీయ వ్యవస్థలో పెళ్లి అనేది చాలా అపురూపమైన వేడుక. విభిన్న దృవాల్లాంటి మనుషులు ఒకేచోట కలిసి జీవించడానికి బీజం వేసేది ఇదే. ఒకప్పుడు నెలరోజుల ముందే పెళ్లి ఇళ్ళు కళకళలాడేవి, ఆ తరువాత అది తగ్గింది వారం రోజుల పెళ్లికి వచ్చింది. ఆ తరువాత అదీ తగ్గి మూడురోజుల పెళ్లిగా స్థిరపడింది. ఉద్యోగాల పేరుతో పెళ్లి జంట దూరందూరంగా ఉండటం, చేసే ఉద్యోగాలు ప్రయివేటు సంస్థలవి కావడం వల్ల సమయం చాలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

అయితే నేటికాలం కాబోయే భార్యాభర్తలు పెళ్లి ఫిక్స్ అయింది మొదలు దొరికే ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ షాపింగ్ ల కోసం, ఫంక్షన్ హాల్స్ కోసం, ఫోటో షూట్స్ కోసం, చాలా హంగామానే చేస్తున్నారు. వీళ్ళ వాలకం చూసి ఇక వీళ్ళ దాంపత్యం వందేళ్లు అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆ పెళ్లి, బంధువులు, హంగామా అంతా అయిపోయిన తరువాత కొత్త జంట కలసి జీవించడంతోనే నిజమైన కొత్త ప్రయాణం  మొదలవుతుంది. ఇంకా చెప్పాలంటే కొత్త ఇంట్లో కొత్త వ్యక్తుల మధ్య ఉండాల్సింది ఆడపిల్లలే. 

ఏడు అడుగులతో ఒక వ్యక్తికి భార్యగా మారి, ఆ జీవితాన్ని కూడా సంతోషంగా గడపడానికి అమ్మాయిలకు ఏడు సూత్రాలు ఇక్కడున్నాయి.

అంగీకారం!!

పెళ్లి అయిపోయిన తరువాత ప్రతిదీ ఆక్సిప్ట్ చేయడం తెలుసుకోవాలి. ఎందుకంటే తన విషయాలను తను ఎలాగైనా డీల్ చేసుకోవచ్చు కానీ ఒక కొత్త సర్కిల్ లోకి వచ్చి జీవితాంతం అక్కడే ఉండాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్నిటినీ ఆక్సిప్ట్ చేయాలి. ఇతరులు, పరిస్థితులు, ఇతర వ్యవహారాలు నచ్చలేదని వాటిని ఆపేయడం అంటూ జరగదు. ఎందుకంటే ఇతరులు వారి పనులను తమకోసం ఆపుకోరు అనే నిజాన్ని గ్రహించాలి.

గౌరవించాలి!!

చిన్నప్పటి నుండి ఎదుటివారిని గౌరవించాలి అనే మాటను వింటూనే ఉన్నాం దాన్ని పాటిస్తూనే ఉన్నాం. అయితే ఆ పరిస్థితులు వేరు ఈ పరిస్థితులు వేరు. అందరినీ గౌరవిస్తూ ఉంటే వారు కూడా తిరిగి గౌరవాన్ని ఇస్తారు అనే విషయాన్ని మరచిపోకూడదు. అంటే ఇక్కడ ప్రవర్తన ఎలా ఉంటుందో దానికి తగిన గౌరవం లభిస్తుంది. కొత్త మనుషుల మధ్య కొన్ని విషయాలు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చని విషయాలను అవమానంగా మాట్లాడకుండా గౌరవంగా వివరించి చెప్పుకోవాలి. అదే అనుకువ అనే పేరుతో కూడా పిలవబడుతుంది.

అభిమానం!!

కొత్త ఇంట్లో కొత్త మనుషుల మధ్య ఉన్నపుడు వారికోసం చేసుకునే సర్దుబాట్లు, వారికిచ్చే గౌరవం మొదలైనవి వారి నుండి ప్రేమను తీసుకువస్తాయి. ఆ ప్రేమను మనసు తెరచి స్వీకరించడం నేర్చుకోవాలి. నేను ఇక్కడ అతడికి భార్యను మిగిలినవారితో నాకేంటట అని అనుకుని నిర్లక్ష్య ధోరణి కలిగి ఉంటే అభిమానం కనుమరుగవుతుంది.

సౌకర్యవంతంగా ఉండటం!!

కొత్తచోటు కాబట్టి వాతావరణం దగ్గర నుండి భోజనం, నిద్ర వంటి విషయాల్లో కూడా ఎన్నో తేడాలు ఉంటాయి. అయితే వాటివల్ల ఇబ్బంది పడిపోవద్దు. అవన్నీ అలవాటు పడటానికి సమయం పడుతుందని అందరితో మనసువిప్పి చెప్పాలి. ఆ తరువాత మెల్లిగా మీకు సరిపడే వాతావరణం సృష్టించుకోవాలి. అయితే అది మిగిలిన వారికి ఇబ్బంది కలిగించకూడదని గుర్తుపెట్టుకోండి.

పుట్టింటి వైపు చూడద్దు!!

చాలామంది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు చిన్న సమస్య వచ్చినా పేరెంట్స్ కు కాల్ చేసి భోరున ఏడుస్తూ సమస్య చెబుతారు, లేదంటే పుట్టింటికి వెళతారు. అది జరిగితే అత్తింట్లో మీ స్థానం విలువ తగ్గే అవకాశాలు ఉంటాయి. సమస్య ఏదైనా సరే దాన్ని ఎలా పరిష్కరించవచ్చో ఆలోచించాలి. దాన్ని అత్తింటి వారితోనే చర్చించాలి. 

తొందర వద్దు!!

వివాహబందంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, కొత్త ప్రాంతాలకు అలవాటు పడటానికి సమయం పడుతుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మెల్లిగా వాటిని ఓన్ చేసుకోవాలి. అంతేకానీ నాలుగు రోజులు ఉండి నాకు ఇక్కడ బాలేదు, నచ్చలేదు అనడం. ఇక్కడి వాళ్ళు వేరుగా ఉన్నారు, వీళ్ళ ప్రవర్తన బాలేదు అనడం సమంజసం కాదు.

ఆర్థిక దారి వదిలేయొద్దు!!

చాలామంది పెళ్లి అవ్వగానే ఉద్యోగాలు వదిలేస్తారు, కొందరు అత్తింటి వారి డిమాండ్స్ కోసం ఉద్యోగాలు వదిలేస్తారు. మరికొందరు పెళ్లయ్యాక సంపాదన గోల ఎందుకు భర్త ఉన్నాడు, ఆయన సంపాదనా ఎక్కువుందిలే అనుకుని వదిలేస్తారు. కానీ ఆడవాళ్లు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోల్పోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చిన్న చిన్న వాటికి కూడా భర్త దగ్గర చెయ్యి చాపడం మొదట్లో బాగున్నా తరువాత చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కనీసం ఇంట్లో ఉంటూనే సంపాదించడం అయినా ముఖ్యం. ఈ కాలంలో ఆడవాళ్లు యూట్యూబ్ నుండి, ఆన్లైన్ బిజినెస్ ల ద్వారా, ఇంట్లో ఉంటూనే పని చేయడానికి ఒప్పుకునే సంస్థల సహకారంతో బానే సంపాదిస్తున్నారు. కాబట్టి సంపాదన వదిలిపెట్టద్దు.

ఇలా అమ్మాయిలు ఇవన్నీ పాటిస్తే వివాహం తరువాత వారి జీవితం సంతోషంగా ఉంటుంది.

                                     ◆నిశ్శబ్ద.