పూరీ క్షేత్రం గురించి అతిపెద్ద రహస్యం.. బ్రహ్మ పదార్థాన్ని కాపాడుతున్నది  ఎవరంటే..!

 

పూరీ క్షేత్రం గురించి అతిపెద్ద రహస్యం.. బ్రహ్మ పదార్థాన్ని కాపాడుతున్నది ఎవరంటే..!



పూరీ క్షేత్రంలో విగ్రహాలలో బ్రహ్మ పదార్థాన్ని అధిక ఆశాఢ అమావాస్య రాత్రి 12 గంటల సమయంలో మారుస్తారు.  ఈ సమయంలో పూరీ నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.  గుడిలో దీపాలు కూడా ఆర్పేస్తారు. జగన్నాథుడి విగ్రహంలో "బ్రహ్మ కవాటం" అనే చిన్న గది ఉంటుంది. పాత విగ్రహం నుంచి కొత్తదానిలో బ్రహ్మ పదార్థం మార్చబడుతుంది. కళ్ళతో చూడకుండా, చేతితో స్పర్శించకుండా ఉండే విధంగా గుడ్డలు, వస్త్రాలు వేస్తారు. బ్రహ్మ పదార్థం మార్చిన తర్వాత గది బయటకు వచ్చి గదిని మూసి గంట మోగించి ప్రక్రియ పూర్తైనట్టు అందరికీ తెలుపుతారు. దీని తరువాతే మళ్లీ విద్యుత్ సరఫరా జరుగుతుంది.  అయితే  ఈ బ్రహ్మపదార్థం ఏమిటి? ఇది నాశనం కాకుండా దీన్ని రక్షిస్తున్నది ఎవరు? ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త,  ఎన్నో దైవ సంబంధిత సందేహాలకు వివరణ ఇస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు పాటు పడుతున్న నండూరి శ్రీనివాస్ గారు ఆధారాలు, విశ్లేషణలతో ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆలయంలో బ్రహ్మపదార్థాన్ని మార్చే కార్యక్రమంలో పాల్గొనే ఒక పూజారి చెప్పిన విషయం.. "తన శక్తిని తొమ్మిది మార్గాలలో రక్షించుకుంటాడు. అదే బ్రహ్మ పదార్థం" ఈ వాక్యం ఆధారంగా చేసిన పరిశోధనలు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చాయని నండూరి శ్రీనివాస్ గారు అంటారు.

దేవాలయం మ్యాపుల ఆధారంగా చేసిన వీరి పరిశోధనలో తేలిన విషయం.. స్వామి వారి గర్బగృహంలో ఉన్న బ్రహ్మ పదార్థం ఒక అద్భుతమైన, దివ్యమైన నారసింహ శాలగ్రామట. ఈ నరసింహ శాలగ్రామాన్ని నరసింహ స్వామి  తొమ్మిది మార్గాల ద్వారా అంటే నవ నరసింహ  స్వరూపాలుగా రహస్యంగా కాపాడుతున్నారని చెబుతున్నారు.

బ్రహ్మ పదార్థంతో పాటు నాలుగు యంత్రాలు కూడా ఉన్నాయట.  జగన్నాథుడిలో గోపాల యంత్రం,  సుభద్రాదేవిలో భువనేశ్వరి యంత్రం, బలరామునిలో శివ యంత్రం,  సుదర్శనునిలో నరసింహ యంత్రం ఉన్నాయట.  ఇవి నలుగురు వ్యక్తులు చేయాల్సిన పని కావడంతో బ్రహ్మపదార్థం మార్చే ప్రక్రియలో నలుగురు పూజారులు గర్భగుడిలోకి వెళతారట.

మ్యాప్  ల ఆధారంగా గుడిలో మూడవ నెంబర్ వద్ద ఒక చిన్న గదిలో నరసింహ స్వామి ఉన్నారట. ఇక్కడ స్వామి 22చేతులు కలిగి ఉంటాడట. ఇది తొలి నరసింహ స్వరూపం.

ఆలయంలో అభయముద్రలో,  వరదముద్రలో హిరణ్యకశిపుడిని సంహరిస్తూ ఒక నరసింహ స్వామి ఉంటారు. ఆయన అభయ నరసింహ స్వామి. ఈయన రెండో స్వరూపం.

ఇక్కడ ఒక మెట్ల ద్వారం మూసివేయబడింది.  ఈ మెట్ల క్రింద చిన్న నరసింహ విగ్రహం ఉంటుంది.  స్వామి ఒడిలో లక్ష్మిదేవి ఉంటారు.  ఇది చాలామందికి తెలియదట.  ఇది మూడవ స్వరూపం.

ఆలయ దక్షిణ ద్వారం వైపు వెళితే అక్కడ ఎడమవైపు గోడ చుట్టూ సింహాచల నరసింహ స్వామి ఉంటారు.  ఇది నాలుగవ స్వరూపం.

మ్యాపులో 23వ స్థానం వద్ద పురాణ నరసింహ విగ్రహం ఉంటుంది.  నాలుగు చేతులతో హిరణ్యకశిపుడిని సంహరిస్తూ ఉంటుంది.  ఇది అయిదవ స్వరూపం.

మ్యాపులో 31వ స్థానం వద్ద ఆది నరసింహ స్వరూపం ఉంటుంది. ముక్తి మండపం వద్ద పెద్ద ఆలయంలో చిన్న నరసింహ విగ్రహమే ఆది నరసింహ విగ్రహం. ఇది ఆలయంల మొదటి స్వరూపంగా పరిగణించబడుతుంది. ఇది ఆరవ స్వరూపం.

మ్యాపులో 40 వ స్థానం వద్ద గుప్త నరసింహ స్వరూపం ఉంటుంది.  ఈ ద్వారం ఎప్పుడూ మూసివుండి, 7 అడుగుల ఎత్తులో గ్రిల్ ఉంటుంది.  టార్చ్ వెలుతురుతో దర్శించవచ్చు.  ఇది ఏడవ స్వరూపం.

మ్యాపులో 43వ స్థానంలో ప్రధాన ఆలయం వెనుక రెండో అంతస్తులో నిషా నరసింహ విగ్రహం ఉంటుంది. ఇది 10 అడుగుల ఎత్తు ఉంటుంది.  పూరీ ఖజానాను కాపాడేది ఈ స్వరూపమే అంటారు.  ఇది ఎనిమిదవ స్వరూపం.

మ్యాపులో 44వ స్థానంలో భువనేశ్వరి ఆలయంలో సరస్వతి దేవి విగ్రహానికి పక్కన నరసింహ స్వామి ధ్యానం చేస్తున్నట్టు  ఉంటాడు.  ఈయన  యోగ నరసింహ స్వామి.  ఇది తొమ్మిదవ స్వరూపం.

ఇలా నవ నరసింహులు పూరీ క్షేత్రాన్ని,  బ్రహ్మ పదార్థానికి రక్షణ కవచంలా ఉన్నారట.


                                *రూపశ్రీ.