Read more!

సత్య సాయి బాబా కోసం కన్నీటి ధారలు

 

సత్య సాయి బాబా సమాధి చెందారనే వార్త భక్తుల పాలిట అశనిపాతం అయింది. కొద్దిరోజులుగా సత్య సాయి బాబా ఆరోగ్య పరిస్థితి బొత్తిగా క్షీణించిందని, వెంటిలేటర్ సాయంతో జీవిస్తున్నారని తెలిసినప్పటికీ బాబా ఆ అనారోగ్యం నుండి బయటబడతారని భక్తులు ప్రగాఢంగా విశ్వాసించారు. సత్య సాయి బాబా తిరిగి యధాస్థితికి వస్తారని, రావాలని ఎవరికి వారే ఎడతెరపి లేకుండా ప్రార్థనలు చేశారు.

సత్య సాయి బాబా ఆరోగ్యం మెరుగుపడుతుందని భక్తులు నమ్మడానికి మరో కారణం ఆయన తాను 96 సంవత్సరాలు జీవిస్తానని చెప్పిఉండటం. కానీ, సత్య సాయి బాబా వాక్కు ఎందుకో ఈ విషయంలో సత్యం కాలేదు. దాంతో భక్తులకు ఈ దుర్వార్త పిడుగుపాటు అయింది. జీర్ణించుకోలేక గుండెలు అవిసిపోయేలా రోదిస్తున్నారు. సామాన్యులు, అసామాన్యులు అనే తేడా లేకుండా సత్య సాయి బాబా కోసం ఎక్కడెక్కడి నుండో భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. పుట్టపర్తిలో ఇసుక వేస్తే రాలనట్టుగా ఉంది జన సందోహం. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, క్రీడాకారులు తదితర సెలెబ్రిటీలు, వివిధ దేశాల నుండి ఫారినర్లు - ఇలా లక్షలాదిమంది సత్య సాయి భక్తులు పుట్టపర్తి చేరుకుంటున్నారు.

పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు, రైళ్ల సదుపాయం ఏర్పాటు చేశారు. భక్తుల రోదనతో పుట్టపర్తి శోకసముద్రాన్ని తలపిస్తోంది. సత్య సాయి బాబా పార్ధివ శరీరాన్ని భక్తుల దర్శనార్థం పుట్టపర్తి ప్రశాంత నిలయం ఆశ్రమంలో సెంట్రల్ హాల్లో ఉంచారు. ఇకపై పూర్వపు సత్య సాయి బాబాను చూడలేము, ఆయన ప్రవచనాలు వినలేము అని భక్తులు తల్లడిల్లుతున్నారు. విపరీతమైన రద్దీని, ఇబ్బందులను లక్ష్య పెట్టకుండా సత్య సాయి బాబా పార్ధివ శరీరాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. సత్య సాయి బాబా ఈ అవతారాన్ని చాలించిన తర్వాత ప్రేమ సాయి పేరుతో మళ్ళీ అవతరిస్తానని చెప్పిన మాట భక్తులను కొంతవరకూ ఊరడిస్తోంది.

 

 

 

More Related to Satya Saibaba