Read more!

Sankasti Chaturthi / Sankastahara Chathurthi

 

సంకష్టహర చతుర్ధి ఉపవాసంతో స్వర్గలోక పయనం 

Sankastahara Chaturthi

భాద్రపద శుద్ధ చవితి వినాయకచవితి. నిజానికి వినాయకునికి ప్రతి నెలా చవితి రోజు మహా ఇష్టమైన రోజని చెప్తారు పెద్దలు. అందుకే ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి నాడు ఉపవాసం ఉంటారు కొందరు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధిని ''సంకటహర చతుర్థి'' లేదా ''సంకష్టహర చతుర్ధి'' అంటారు. ''సంకష్టహర చతుర్ధి'' గనుక మంగళవారం నాడు వస్తే ''అంగారకి చతుర్ధి'' అంటారు.

పూర్వం భ్రుశుండి అనే మహర్షి ఉండేవాడు. ఆయన వినాయకుని భక్తుల్లో అగ్రగణ్యుడు. తాము కూడా ఆదర్శంగా మారాలని ఎందరో భ్రుశుండిని చూసేందుకు వెళ్ళేవారు. భ్రుశుండి మహర్షి ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే ''సంకష్టహర చతుర్థి'' లేదా ''సంకష్ట చతుర్ధి''నాడు వినాయకుని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండేవాడట. ఇలా ''సంకష్ట చతుర్ధి'' నాడు చేసే పూజ, ఉపవాసాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత పుణ్యం వస్తుందో తెలిపే కథ చూడండి...

ఒకసారి దేవలోక అధిపతి ఇంద్రుడు, భ్రుశుండిని దర్శించుకుని పుష్పక విమానంలో తిరిగి వెళ్తున్నాడు. ఆ దివ్య విమాన కాంతులు ధగధగాయమానంగా ఉన్నాయి. ఆ ఊళ్ళో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్ర విమానాన్ని ఆశ్చర్యంగా చూశాడు.

దేవేంద్రుని విమానం కిందికి దిగివచ్చింది. ఆ ధ్వనికి అందరూ విడ్డూరంగా చూశారు. ఇంద్రుడు వెనుతిరిగి వచ్చిన కారణం ఏమిటని అడిగారు.

''ఇక్కడ ఎవరో చాలా పాపాలు చేసిన వ్యక్తి దృష్టి దీనిపై పడింది.. అందుకే విమానం కిందికి వచ్చింది'' అన్నాడు.

''మరి, ఇప్పుడు పైకి ఎలా లేస్తుంది.. తిరిగి వెళ్ళడం ఎలా దేవా?''అనడిగారు అంతే ఆశ్చర్యంగా.

''ఇంద్రుడు చిరునవ్వు నవ్వుతూ ''ఈరోజు పంచమి.. నిన్న చతుర్ధి నాడు మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నారేమో చూడండి.. ఒకవేళ అలా ఎవరైనా నిన్నటి రోజు ఉపవాసం ఉండి ఉంటే, వారి దివ్య దృష్టి ఈ విమానం మీద ప్రసరిస్తే, ఇది తిరిగి బయల్దేరుతుంది...'' అన్నాడు.

వాళ్ళు ఊరంతా విచారించారు. కానీ, ఒక్కరు కూడా ముందురోజు ఉపవాసం లేరని తేలింది.

దేవేంద్రుడు బాధపడుతూ ఉండగా, వినాయకుని భటులు ఒక చనిపోయిన స్త్రీని తీసికెళ్తూ కనిపించారు.

ఇంద్రుడు చూసి, ''అదేంటి, అన్ని పాపాలు చేసిన స్త్రీని యమదూతలు కాకుండా మీరెందుకు తీసికెళ్తున్నారు" అనడిగాడు.

''నిజమే.. ఆమె ఉత్తమురాలేం కాదు. కానీ నిన్న అనుకోకుండా రోజంతా నిద్ర పోవడంవల్ల ఆమె భుజించలేదు. రోజంతా ఉపవాసం చేసి, ఈరోజు ఉదయం లేచిన తర్వాతే తింది. అలా ఆమెకి తెలీకుండానే నిన్న చతుర్ధినాడు ఉపవాసం ఉంది. అందువల్ల ఆమెని మేం తీసుకువెళ్తున్నాం'' అని చెప్పారు.

అంతా విన్న తర్వాత ఇంద్రుడు ''సరే, ఆమె పుణ్యాన్ని కాస్త ఇటు ప్రసరింపచేయండి..'' అన్నాడు.

''క్షమించండి, అలా కుదరదు స్వామీ'' అంటూ వారు వెళ్ళిపోయారు.

అయితే, ఆమె మీది నుండి వచ్చిన గాలితో విమానం బయల్దేరింది. చతుర్ధి నాటి ఉపవాసం చేసిన మహిమ అలాంటిది.

Sankastahara Chathurthi, Sankasti Chaturthi 2011, Sankasti Chaturthi and fast, Sankastahara Chaturthi and puja, Sankastahara Chaturthi on Tuesday, Angaraki chaturthi