Read more!

అంగధుడితో రాముడి రాయబారం!

 

అంగధుడితో రాముడి రాయబారం!

రావణుడి తాత మాల్యవంతుడు రావణుడితో "దేవతలు ధర్మం వైపు ఉంటారు, యుద్ధంలో విజయం కూడా ధర్మం వైపు ఉంటుంది. రాముడికి సీతమ్మను అప్పగించి యుద్ధం మానుకో" అని చెప్పాడు.

 అప్పుడు రావణుడు "చేతిలో పద్మములేని లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న సీతని నేను వదులుతానా?? రాముడు గొప్పవాడే కావచ్చు కాని నేను కూడా సురాసురులని ఓడించాను. అందరూ నాకు నీతులు చెబుతున్నారు కాని నన్ను ప్రోత్సహించే వాడు కనపడడం లేదు. మీరందరూ బుద్ధిహీనులు, తాత! నువ్వే కాదు, ఒకవేళ బాణం పెట్టి నా శరీరాన్ని రెండుగా చీల్చినా, కత్తి పెట్టి నా శరీరాన్ని రెండుగా నరికేసినా ఆ రెండు ముక్కలు మాత్రం ముందుకి వంగవు, వెనక్కే పడిపోతాయి. ఒకరిమాట వినడం నాకు చేతకాదు. ఇది నా స్వభావం" అని చెప్పాడు.

అటుపక్క రాముడు లంకా పట్టణాన్ని చూద్దామని సువేల పర్వతము ఎక్కాడు. అప్పుడే ఎదురుగా ఉన్న అంతఃపురంలోకి రావణుడు విశేషమైన మాలలు, వస్త్రాలు వేసుకుని బయటకి వచ్చాడు. అలా వస్తున్న రావణుడిని చూసిన సుగ్రీవుడికి  ఆగ్రహిహం పెరిగిపోయింది.  ఒక్క దూకు దూకి రావణుడి మీద పడ్డాడు. ఇద్దరూ పోడుచుకున్నారు. కొట్టుకున్నారు, రక్తాలు కారేటట్టు గుద్దుకున్నారు. ఇంతలో రావణుడు మాయలు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. "వీడు మాయా యుద్ధం చేస్తున్నాడు, ఇలాంటి మాయలు చేసేవాడితో నిజాయితీగా యుద్ధం చేయలేము. ఇప్పుడు ఇక్కడే ఉండటం మంచిది కాదు" అని సుగ్రీవుడు ఎగిరి మళ్ళి రాముడి పక్కకి వచ్చేశాడు. 

అప్పుడు రాముడన్నాడు "సుగ్రీవ! ఇలా నువ్వు వెళ్ళిపోయావే, నీకు ఏదన్నా అయితే నాకు సీత ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు, భరతుడు ఎందుకు, శత్రుఘ్నుడు ఎందుకు. నేను మనస్సులో ఏమనుకున్నానో తెలుసా, ఒకవేళ రావణుడి చేతిలో నీకు జరగరానిది జరిగితే, ఈ రావణుడిని ఇక్కడే చంపేసి, విభీషణుడికి పట్టాభిషేకం చేసేసి, లక్ష్మణుడిని వెనక్కి పంపి భరతుడిని రాజ్యం ఏలుకోమని చెప్పి, నేను కూడా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకున్నాను. నువ్వు లేకుండా నేను ఒక్కడిని మాత్రం వెనెక్కి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చెయ్యకు" అన్నాడు. 

రాముడి మాటను గౌరవిస్తూ సుగ్రీవుడు మౌనంగా తల వంచుకున్నాడు.

తరువాత అంగదుడిని పిలిచి రావణుడి దగ్గరికి రాయబారానికి పంపారు. రాముడు అంగదుడితో "నువ్వు ఎందరో మహర్షులని బాధలు పెట్టావు, ఎందరో స్త్రీలని అపహరించావు. నువ్వు చేసిన పాపాలకి దండన విధించడానికి, నా భార్యను కూడా అపహరించావు కాబట్టి నీలో చాలా తప్పు ఉంది. అందుకని నిన్ను నేను సంహరించవచ్చు ఆ కారణంతోనే ఇవ్వాళ లంకా పట్టణానికి వచ్చాను. ఏ దేవర్షులని, రాజులని నిష్కారణంగా వధించి పంపించావో ఆ మార్గంలోనే నిన్ను పంపిస్తాను. అంతఃపురం విడిచి బయటకి రా" అని రావణుడికి చెప్పమన్నాడు.

అంగదుడు వెంటనే వెళ్ళి రావణుడితో ఈ మాటలు చెప్పాడు. ఆ మాటలు విన్న రావణుడు ఆగ్రహించి తన సైనికులతో అంగదుడిని పట్టుకోమని చెప్పాడు. ఆ సైనికులు అంగదుడిని పట్టుకోగా, అంగదుడు ఆ సైనికులతో సహా పైకి ఎగిరి ఒళ్ళు దులుపుకున్నాడు. అప్పుడా సైనికులందరూ కింద పడిపోయారు. అంగదుడు వెళ్ళిపోతూ రావణుడి అంతఃపుర ప్రాసాదాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకి ఆ ప్రాసాదం ఊగి కదిలిపోయింది.

                                    ◆నిశ్శబ్ద.