Read more!

రామ రావణ యుద్ధ సమయంలో కలిగిన మార్పులేమిటి?

 

రామ రావణ  యుద్ధ సమయంలో కలిగిన మార్పులేమిటి?

లంకలో ప్రజలు అలా మాట్లాడుకుంటూ ఉంటే, యుద్దభూమిలో రాముడు బాగా అలసిపోయి "ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడం" అని ఆలోచనలో పడిపోయాడు, ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైన వారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితోపాటుగా వారి మధ్యలో నుండి గబగబా అగస్త్య మహర్షి రాముడి దగ్గరకు వచ్చాడు. ఆయన రాముడితో  "రామ! రామ! ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను. దీనిని నువ్వు స్వీకరించు. ఇది కాని నువ్వు పొందావ, ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ పరమమంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కాని, అరణ్యంలో ఉన్నప్పుడు కాని చదువుకో, నీకు రక్ష చేస్తుంది" అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.

అగస్త్యుడు ఆదిత్య హృదయం ఉపదేశిస్తున్నంత సేపు రాముడు ఎంతో శ్రద్ధగా విన్నాడు. ఆ తరువాత అగస్త్యుడు అన్నాడు "ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, నువ్వు నీ సర్వ శత్రువులని జయిస్తావు, నీ శత్రువులని దునుమాడేస్తావు, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి రావణుడు నీ చేతిలో హతం అవుతాడు" అన్నాడు.

రాముడు ఆ ఆదిత్య హృదయాన్ని భక్తిగా మూడు సార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు.

ఆ తరువాత రావణుడు నల్లటి గుర్రాలు కట్టి ఉన్న తన రథం మీద యుద్ధ భూమికి తీవ్రమైన వేగంతో వచ్చాడు.

అప్పుడు రాముడు "మాతలి! ప్రతిద్వంది వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండు, ఎంత మాత్రం పొరబడకు. రథాన్ని కుడి చేతి వైపుకి తీసుకువెళ్ళు. నేను నీకు చెప్పాను అని మరోలా అనుకోకు, నువ్వు ఇంద్రుడికి సారధ్యం చేస్తున్నవాడివి, నీకు అన్నీ తెలుసు. కాని నీ మనస్సులో  ధైర్యం ఉండడం కోసమని ఈ మాట చెప్పాను. వేరొకలా భావించకు” అన్నాడు. మాతలి రాముడు చెప్పినట్టు చేసాడు.

యుద్ధ భూమిలో ఒకరికి ఎదురుగా ఒకరి రథాలని నిలబెట్టారు. ఆకాశంలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు అందరూ నిలబడి "రాముడు ఈ యుద్ధంలో గెలవాలి, రావణ సంహారం చెయ్యాలి" అని స్వస్తి వాచకం చేస్తున్నారు.

రావణుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడుతున్న సమయంలో ఆకాశం నుండి రక్త వర్షం కురిసింది, అదే సమయంలో మండలాకారంలో గాలులు తిరిగాయి. ఆకాశంలో గ్రద్దలు తిరుగుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలాయి, నిష్కారణంగా అక్కడున్న భూమి కదిలింది, ఆకాశంలో మేఘాలు లేకుండానే రాక్షస సైన్యం వైపు పిడుగులు పడ్డాయి, ఆకాశం నుండి ఒక తోకచుక్క రావణుడి రథం మీద పడింది. రాక్షసులు తమ ఆయుధములను ప్రయోగిద్దామని చేతులు పైకి ఎత్తుతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నట్టు చేతులు ఆగిపోయాయి, లంకా పట్టణం అంతా కాలిపోతున్నట్టు ఎర్రటి కాంతిని పొందింది. ఇళ్ళల్లో ఉన్న గోరువంకల మీద రాబందులు వచ్చి దాడి చేశాయి, సూర్యమండలం నుండి ఎర్రటి, తెల్లటి, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన కిరణాలు రావణుడి మీద పడ్డాయి, నిష్కారణంగా గుర్రాలు ఏడిచాయి, నక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి. క్రూరమైన మృగాలు రావణుడి ముఖాన్ని చూస్తూ పెద్దగా అరిచాయి. ఇలా రామ, రావణ యుద్దానికి ముందు మార్పులు సంభవించాయి.

                                       ◆నిశ్శబ్ద.