Read more!

విశిష్టమైన రోజు రాఖీపూర్ణిమ, హైగ్రీవ జయంతి

 

విశిష్టమైన రోజు రాఖీపూర్ణిమ, హైగ్రీవ జయంతి

 

 

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఉపనయనం అయిన ప్రతి వారు ఈ రోజు “యజ్ఞోపవీతం పరమం పవిత్రం” అంటూ, కొత్త జందెమును ధరించి పాత దానిని తీసివేస్తారు. ఆ సంవత్సరమే ఉపనయనం అయిన నూతన వటువునకు ఈ రోజు ‘ముంజ విడుపు’ లేదా ‘ఉపాకర్మ’ కార్యక్రమం నిర్వహిస్తారు.

 

 

సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయతా అనుబంధం పెంచేది ఈనాటి రాఖీ పండుగే. సోదరీమణులు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి, నొసట కుంకుమ దిద్ది, హారతినిచ్చి, వారి కుడి చేతికి రక్ష కడతారు. సోదరులు అక్షతలు వేసి తమ సోదరిని ఆశీర్వదించి ఆమెకు కానుకలు సమర్పిస్తారు. సోదరి తన సోదరునకు భోజన పిండివంటలు పెట్టి తృప్తి పరుస్తుంది. సోదరుడు తన సోదరిని, ఆమె సౌమంగళ్యాన్ని కాపాడటం కర్తవ్యంగా భావించాలి. పరస్పరం రక్షణకు ప్రతిన పూనే సమైక్య భావ నిలయమే ఈ పండుగ.
ఈ రక్షను మిత్రులు కూడా పరస్పరం కట్టుకొనవచ్చును. రక్ష కట్టుకునేటప్పుడు
              “యేన బద్ధో బలీ రాజా – దానవేంద్రో మహాబలః
              తేనత్వాం అభి బధ్నామి – రక్షే మాచల మాచల”
అని చదవాలి.
దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది

 

 

ఉపవీతుల యజ్ఞోపవీతాలు దారపు పోగులే. అనుపవీతుల రక్షలూ దారపు పోగులే. స్త్రీల వ్రత తోరాలూ దారపు పోగులే. మంగళ సూత్రాలూ దారపు పోగులే. ఇలా హిందువు ఎంతటి వాడైనా ధర్మం కోసం దారపు పోగుకి కూడా జీవితాంతం కట్టుబడి ఉంటాడనే ఉదాత్త భావం ఈ పర్వ దినాల్లో ఇమిడి ఉంది.

 

 

భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.

 

 

పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది.

రాఖీ పౌర్ణమి ''బలేవా''

 

 

 

రాఖీ పౌర్ణమిని ''బలేవా'' అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి. దీని వెనుక ఉన్న కథ చూద్దాం. బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెల పోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి, రాఖీ బంధన్ రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. బలి, భ్రాతృ ప్రేమతో ''ఏం కావాలమ్మా'' అని అభిమానంగా అడిగాడు. లక్ష్మి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. బలి మనసు ఆర్ద్రమైంది. సర్వం త్యాగం చేసి, లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసికెళ్ళమన్నాడు.

ద్రౌపదీ శ్రీకృష్ణుల సోదర ప్రేమ

 

 

మహాభారతం ప్రకారం ద్రౌపదికి, వస్త్రాపహరణం సమయంలో, మహా రాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపద రాజు కానీ, ఉద్దండులయిన ఐదుగురు భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా, నిస్సహాయంగా శ్రీకృష్ణుని ప్రార్ధించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి, అవమానం నుండి తప్పించాడు. ఇది రాఖీ బంధనాన్ని సూచిస్తుంది.

రాణీ కర్ణావతి, హుమాయూన్ చక్రవర్తుల కథ

 

 

 

ఇంకో కథనాన్ని అనుసరించి, 1535లో రాణీ కర్ణావతి భర్త చనిపోయాడు. దాంతో గుజరాత్ సుల్తాన్ బహద్దూర్ షా, చిత్తూరుపై కన్నేశాడు. ఏ క్షణాన అయినా సుల్తాన్ దండెత్తిరావచ్చని గూఢచారుల ద్వారా విన్న రాణీ కర్ణావతి భయపడింది. బాగా ఆలోచించి, తనను కాపాడేవాడు మొఘల్ సామ్రాజ్యాధిపతి హుమాయూన్ చక్రవర్తే అని నమ్మింది. వెంటనే హుమాయూన్ చక్రవర్తికి రాఖీ పంపింది. ఆ రాఖీ హుమాయూన్ మానసును గెలిచింది. కానీ అప్పటికే గుజరాత్ సుల్తాన్ చిత్తూరు కోతపై దాడి చేశాడు. హుమాయూన్ కు విషయం అర్ధం అయ్యేసరికి పరిస్థితి విషమించింది. రాణీ కర్ణావతితో సహా 13 వేలమంది స్త్రీలను సుల్తాన్ చేర పట్టాడు. హుమాయూన్ చిత్తూరు చేరేసరికి మహిళలందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుమాయూన్ చక్రవర్తి, గుజరాత్ సుల్తాన్ను ఓడించి, చిత్తూరు రాజ్యాన్ని రాణీ కర్ణావతి కొడుక్కు ఇప్పించాడు. హుమాయూన్ కు మాత్రం ఆమె పంపిన రాఖీ తీపి గుర్తుగా మిగిలిపోయింది.

హైగ్రీవ జయంతి

 

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫిటికాకృతిం  |
ఆధార సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||
వ్యాఖ్యా ముద్రం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే
బిభద్బిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మం
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగదీశః ||

 

 

శ్రీ మహావిష్ణువు అవతారములలో 24 అవతారములు ముఖ్యమైనవి. ఈ అవతారములలోకెల్లా ముఖ్యాతిముఖ్యమైన, ఆద్యావతరమైన అవతారమే "హయగ్రీవావతారము''. ఈ అవతారము విశ్వవిరాట్ స్వరూపుని (శ్రీమన్నారాయణుని) ఉచ్వాసావతారమే అని, ఇది సృష్టి ఆరంభమునకు పూర్వమే జరిగినదని పెద్దలు చెబుతారు. శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి కర్ణములు (చెవులు) నుండి మధుకైరభులు అనే రాక్షసులు అవతరించి, తమ జన్మ కారకులెవరో తెలియక మూల ప్రకృతియైన  ఆది పరాశక్తిని గూర్చి తపస్సు చేసి, జగన్మాత వలన తమ జన్మ రహస్యం తెలుసుకొని, ఎవరిచే కూడా మరణం జరగనట్లుగా వరం ప్రసాదించమని కోరారు. జగన్మాత అలా జరగదని చెప్పి, విచిత్ర దివ్య వైష్ణవ తేజో విశేషంతో తప్ప, ఇతరుల వలన మృత్యుభయం లేదని దేవి ద్వారా వరం పొందారు.

 

 

వరగర్వితులై అజేయులుగా ఉన్న మధుకైరభులు బ్రహ్మ వద్దనుండి వేదములను అపహరించి, బ్రహ్మాండమంతా జలమయం గావించి, పాతాళమున దాక్కున్నారు. మధ్య మధ్య బ్రహ్మను యుద్ధానికి కవ్విస్తూ బాధించేవారు. బ్రహ్మ వారితో యుద్ధము చేయలేక, వారు పెట్టే బాధలు సహించలేక, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. నారాయణుడు బ్రహ్మ ప్రార్థన విని, తన దివ్యదృష్టితో సర్వం తెలుసుకొని, “ఐదు రోజులలో ఆ దైత్యులను సంహరించి, వేదాలను తెచ్చి నీకు అప్పగిస్తాను. వేదములు అందిన తరువాత సృష్టిని ప్రారంభించు, అంతవరకూ నన్ను ఆరాధించు'' అని విష్ణువు, బ్రహ్మను ఓదార్చి పంపించాడు.

 

 

వెంటనే శ్రీమన్నారాయణుని ఉచ్చ్వాస విశ్వాసముల నుండి శుద్ధస్ఫటిక సంకాశమైన శంఖ, చక్ర, గదా, అక్షరమాల పుస్తక శ్రీ ముద్రాది సంశోభితుడైన ఆశ్వముఖదారి అయినటువంటి "హయగ్రీవ స్వామి'' అవతారం చంద్రమండలం మధ్య నుండి అవతరించి, అసురులను హతమార్చి, వేదాలను, వేదవిద్యలను ఉద్ధరించి బ్రహ్మకు అప్పగించాడు. వేదాధిపత్యమును హ్రహ్మకు, సకలవిద్యాధిపత్యమును సరస్వతీదేవికి అప్పగించాడు. అప్పటినుండి బ్రహ్మ వేద ప్రతిపాదకంబైన సృష్టికి కర్తయై, వేదములకు అధినాయకుడయ్యాడు. సరస్వతి సకల విద్యాధిపత్యంబు వహించి, విద్యాప్రదాయినిగా ప్రసిద్ధిగాంచిందని మన పురాణాలు తెలుపుతున్నాయి.
ఈ హయగ్రీవ జయంతి రోజు విద్యార్థులు ఈ స్వామిని పూచిస్తే మంచి విద్యావంతులు కాగలరు.