Read more!

ప్రాణులన్నీ భగవత్ స్వరూపాలే !

 

ప్రాణులన్నీ భగవత్ స్వరూపాలే !

బాబా సర్వవ్యాపకత్వం గురించి లీలల్లో తెలుసుకున్నాం. అలాంటిదే ఈ లీల కూడా! లక్ష్మీభాయిషిండే ధనవంతురాలు, సుగుణవతి. చాలా చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. అప్పట్నుంచి మసీదే ఆమె నివాసమైంది. రేయింబవళ్లు బాబా సేవలోనే నిమగ్నమై ఉండేది. రాత్రి వేళల్లో సాధారణంగా మసీదులోకి రావటానికి మహిళలకు అనుమతి ఉండేది కాదు. పురుషుల్లో కూడా మహల్సాపతి, తాత్య తప్ప మరెవరికీ రాత్రిళ్లు మసీదు మెట్లెక్కేందుకు అనుమతి లేదు. లక్ష్మీబాయి షిండే కూడా రాత్రి వేళల్లో మసీదులో వీరితోపాటు బాబాతో కూర్చునేది.

ఒకనాటి సాయంకాలం బాబా తాత్యతో మసీదులో కూర్చుని కబుర్లు చెబుతుండగా, లక్ష్మిబాయిషిండే వచ్చింది. "అమ్మా! నాకు చాలా ఆకలిగా ఉంది" అన్నారు బాబా. "కొద్దిసేపు ఓపిక పట్టు బాబా! రొట్టె, కూర చేసుకుని తీసుకువస్తాను" అని లక్ష్మీబాయి ఆ రెండింటినీ తయారు చేసుకువచ్చి బాబా ముందు పెట్టింది. బాబా వాటిని తీసుకుని అక్కడే ఉన్న ఓ కుక్కకు వేశారు. లక్ష్మీబాయి మనసు చివుక్కుమంది. "అదేమిటి బాబా? ఎంతో ఆకలితో ఉన్నావని ఆత్రుతతో నీ కోసం వాటిని తయారుచేసుకుని తీసుకొస్తే వాటిని కుక్కకి వేశావు" అని లక్ష్మీబాయి నొచ్చుకుంది.

"ఎందుకమ్మా విచారిస్తావు? కుక్క ఆకలి తీర్చటం నా ఆకలి తీర్చటం వంటిదే. కుక్కకు కూడా ఆత్మ ఉంది. ప్రాణులు వేరు కావచ్చు అందరి ఆకలి ఒక్కటే. కొందరు మాట్లాడగలరు. కొందరు మాట్లాడలేరు. మరి వారి ఆకలి తీరేది ఎలా? ఒక్క విషయం గుర్తుంచుకో. ఆకలి ఉన్న ఎవరి కడుపు నింపినా నా కడుపు నింపినట్టే. దీనినే గొప్ప నీతిగా గ్రహించు" అని చెప్పారు బాబా.

గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బాబా చిన్న విషయం ద్వారా ఆవిష్కరించారు. బాబా లక్ష్మీబాయి రుణాన్ని ఉంచుకోలేదు. తాను మహా సమాధి చెందేముందు ఆమెను పిలిచారు. తన కఫనీలో చేయిపెట్టి మొదట అయిదు రూపాయలు, తరువాత నాలుగు రూపాయలు మొత్తం తొమ్మిది రూపాయలు తీసి ఆమెకిచ్చారు. తొమ్మిది సంఖ్య నవవిధ భక్తులకు సంకేతం. వాటిని బోధించటానికే బాబా అలా చేశారు. భాగవతంలోని ఏకాదశ స్కంధం, పదవ అధ్యాయం ఆరవ శ్లోకంలో పూర్వార్థంలో అయిదు, ఉత్తరార్థంలో నాలుగు విధముల భక్తుల గురించి వివరించి ఉన్నాయి. బాబా కూడా అదే రీతిన మొదట అయిదు రూపాయలు, తరువాత నాలుగు రూపాయలు ఇచ్చి లక్ష్మీబాయికి నవవిధ భక్తులను ఉపదేశించారు.

నిజానికి బాబా ఇచ్చిన తొమ్మిది రూపాయలకు ఎన్నో రెట్లు విలువైన డబ్బును లక్ష్మీబాయి షిర్డీ సంస్థాన్ నిమిత్తం ఖర్చు చేసింది. కానీ, ఆమె ఎంత ధనవంతురాలైనప్పటికీ బాబా ఇచ్చిన తొమ్మిది రూపాయలకు మరేవీ సాటి రావు అని భావించేది.