పౌర్ణమి వేళ అద్వితీయ శక్తి రహస్యం!!

 

పౌర్ణమి వేళ అద్వితీయ శక్తి రహస్యం!!

పౌర్ణమి అమావాస్య అనేవి ప్రతి నెలలో వస్తు ఉంటాయి. వీటిలో అమావాస్య గురించి పెద్దలు కాసింత నెగిటివ్ కోణంలో చెబితే పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కారణం లేకపోలేదు. చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో ప్రకంపనలు జరుగుతాయనేది ఇందులో ముఖ్య సారాంశం. 

ఇకపోతే అమ్మవారిని పూజించే వారికి, దేవి ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది. పౌర్ణమి రోజు అమ్మవారి ప్రభావం సాధారణ రోజులకంటే అధికంగా ఉంటుంది, ఆరోజున అమ్మవారిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితెగే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతారు. 

దేవిని పూజించేవారు సాధారణంగా లలితా సహస్ర పారాయణ, అమ్మవారి మంత్ర జపం, శ్లోక స్తుతి వంటివి చేస్తుంటారు.  సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం అని అందరికి తెలిసినదే. శ్రీచక్రంలో ఆ దేవీ శక్తిగా నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అలాంటి శక్తిని మన చుట్టూ చూసే అరుదైన భాగ్యం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది.

లలితా సహస్ర నామ పారాయణ మహిమ గూర్చి అందరికి తెలిసినదే. అయితే పౌర్ణమి రోజు వెన్నెల పారాయణ చేయడం వల్ల లలితాదేవి కృపకు పాత్రులు కావచ్చు.

వెన్నెల పారాయణ ఏమిటి?? 

పౌర్ణమి రోజు చంద్రుడి వెన్నెలలో కూర్చుని లలితా సహస్ర నామ పారాయణ చేయడం వల్ల అమోఘమైన పలితాన్ని చవి చూడవచ్చు. దీన్నే వెన్నెల పారాయణ అని కూడా అంటారు.

ఎలా చేయాలి??

సాయంత్రం సూర్యుడి వెలుగు కనుమరుగైపోయి, చీకట్లు అలుముకునే వేళ  వీలైన వాళ్ళు స్నానం చేసి, లేకపోతే శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కుని దేవుడి ముందు దీపం పెట్టాలి. తరువాత అప్పటికే చీకట్లు కొద్దిగా ఎక్కువై ఆకాశంలో చంద్రుడు మెల్లిగా పైకి వస్తూ ఉంటాడు. అప్పుడు లలితాసహస్ర నామాలు ఉన్న పుస్తకం, లేదా ఎవరి సౌకర్యార్థం వారు మొబైల్ లో కూడా చదవచ్చు కానీ మధ్యలో ఎలాంటి ఆటంకం కలగకుండా పుస్తకమే మంచిది. పుస్తకాన్ని తీసుకుని, ఒక గ్లాసులో, లేక గిన్నెలో కొన్ని పాలు, అందులో కాసింత పటికబెల్లం వేసి ఆరు బయట వెన్నెల పడుతున్న చోట కూర్చుని, అదే వెన్నెలలో పాల గిన్నె లేదా గ్లాసు ఉంచి లలిత సహస్ర నామాలు చదవాలి. ఇలా ఒకటి, మూడు, తొమ్మిది సార్లు వీలును బట్టి ఓపికను బట్టి చధవవచ్చు. చదువుతున్నంత సేపు వెన్నెల వెలుగులోనే ఉండాలి. ఏకాగ్రతగా చదవాలి. పాల గిన్నె లేదా పాల గ్లాసు వెన్నెలలో ఉంచాలి. ఆ పాల మీద వెన్నెల వెలుగు పడుతూ ఉండాలి. అలా పడితే పాలలో చంద్రుడి ప్రతిబింబం నిలిచినట్టే. 

ఫలితం ఏమిటి??

వెన్నెల పారాయణలో ప్రతి సారి లలిత సహస్ర నామాలు పూర్తవగానే అమ్మవారి స్వరూపమైన శ్రీచక్రం చదువుతున్న వారి చుట్టూ ఏర్పడుతుంది. ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు తప్ప దీన్ని గుర్తించలేరు. కానీ శ్రీచక్రం తాలూకూ వైబ్రేషన్ స్పష్టంగా ఆ మనిషి మీద పని చేస్తుంది. ఆ వైబ్రేషన్ ను వాళ్ళు ఆస్వాదించగలరు కూడా.

ఇక ఈ వెన్నెల పారాయణం వల్ల అనుకున్నవి నెరవేరుతాయని, మానసిక శారీరక ఆరోగ్యం చేకూరుతుందని, ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని. జీవితంలో చోటు చేసుకున్న కష్టాలకు పరిష్కారం లభిస్తుందని చెబుతారు. వెన్నెలలో లలిత సహస్ర పారాయణం ప్రతి సారి చేసేవారికి దాని తాలూకూ ఫలితం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కూడా.

కాబట్టి వెన్నెలలో అమ్మవారిని ప్రసన్నం చేసుకుని జీవితాల సమస్యల సుడిగుండం నుండి గట్టక్కడానికి ఈ వెన్నెల పారాయణ మంచి మార్గంగా చెప్పవచ్చు.

◆ వెంకటేష్ పువ్వాడ