Read more!

పాపాల్ని అడిగి తీసుకునే పుణ్యమూర్తి బాబా!

 

పాపాల్ని అడిగి తీసుకునే పుణ్యమూర్తి బాబా !

బాబా సాక్షాత్తూ భగవంతుడు. మరి జీవితాంతం ఎందుకు భిక్షాటన చేశారు? కోరుకున్న మరుక్షణం పంచభక్ష పరమాన్నాలను తెచ్చిపెట్టగల భక్తులు పక్కనున్నా, వాటిని స్వయంగా పొందగల శక్తి ఉన్నా, బాబా ఎందుకు అందరి ఇళ్ల ఎదుట నిలబడి 'భిక్షాందేహీ' అన్నారు?

భిక్షాటన చేసి జీవించే హక్కు ఎవరికి ఉంది?
పంచసూనాలంటే ఏమిటి? వాటిని పోగొట్టుకునే మార్గమేది?
ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలే బాబా వైఖరిలో అంతరార్థాన్ని చెబుతాయి.

సంతానం, ధనం, కీర్తి పట్ల ఆపేక్ష లేని వారు భిక్షాటనంతో జీవించవచ్చునని శాస్త్రప్రమాణం. వీరు ఇంటి వద్ద వండుకుని తినలేరు. వీరికి ఇల్లు, వాకిలి, భార్యపిల్లలు లేరు  కాబట్టి వీరికి భోజనం పెట్టే బాధ్యత గృహస్తులపైనే ఉంది. బాబా గృహస్తుడు కాదు. వానప్రస్తుడూ కాదు. బాబా అస్థలిత బ్రహ్మచారి. బాల్యం నుంచే బాబా బ్రహ్మచర్యాన్ని అవలంభించారు. సకల జగత్తు బాబాకు పుట్టినిల్లు. ఈ జగత్తుకు బాబాయే కారణభూతుడు. బాబాయే ఆధారభూతుడు. బాబా పరబ్రహ్మ స్వరూపుడు. కాబట్టి బాబాకు భిక్షాటన చేసే హక్కు సంపూర్ణంగా ఉంది.

రెండవ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. భోజన పదార్థాలను తయారుచేసే క్రమంలో గృహస్తులు అయిదు పాపాలను చేస్తారు. వీటినే పంచసూనములు అంటారు. అవి
1. దంచుట లేదా రుబ్బుట,
2. విసరుట,
3. పాత్రలు తోముట,
4. ఇల్లు ఊడ్చటం, తుడుచుట,
5. పొయ్యి వెలిగించటం.

ఈ అయిదు పనులు చేసేటప్పుడు మనకు తెలిసో, తెలియకో అనేక క్రిమికీటకాలు మరణిస్తాయి. గృహస్తులు ఆ పాపం అనుభవించక తప్పదు. ఈ పాప పరిహారానికి శాస్త్రాలు ఆరు విశ్లేషణల్ని అందిస్తున్నాయి.అవి
1. బ్రహ్మ యజ్ఞం
2. వేదాధ్యయనం
3. పితృ యజ్ఞం 
4. దేవ యజ్ఞం
5. భూత యజ్ఞం
6. అతిథి యజ్ఞం

గృహస్తులు వీటిలో తమకు అనుకూలమైనది పాటించి పాప పరిహారులు కావచ్చు. మోక్షసాధనకు, ఆత్మసాక్షాత్కారానికి ఇవి తోడ్పడతాయి. వీటిలో అన్నిటి కంటే గొప్పది అతిథి యజ్ఞం. సమయానికి మనకు భోజనం లేకపోతే ఆకలితో విలవిల లాడిపోతాం. అదే ఆకలితో ఇంటికి వచ్చే అతిథి అభాగ్యులకు కాసింత భోజనం పెడితే ఎంతో పుణ్యం దక్కుతుంది.

బాబా ఇంటిటికీ వెళ్లి భిక్షాటన అడిగేది తాను కడుపు నింపుకునేందుకు కాదు. అలా భిక్షకు వెళ్లటం ద్వారా భక్తులకు వారి కర్మను గుర్తు చేసే వారన్నమాట. వారి పాపాల్ని అడిగి తీసుకునేవారన్న మాట. భగవంతుడే అడిగి మరీ పాపాలు తీసేసుకుని, కర్మల్ని ధ్వంసం చేశారంటే షిర్డీవాసులు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఎందుకంటే తమ ఇంటి గుమ్మం ఎదుటే ఇంత గొప్ప ప్రబోధాన్ని, కర్మధ్వంసాన్ని పొందిన వారు ఎంతో అదృష్టవంతులు కదా.