Read more!

వైభవ గోదావరి – 4 పైధాన్, నాందేడ్

 

 

వైభవ గోదావరి – 4


పైధాన్, నాందేడ్

ఇవాళ మహారాష్ట్రలోని పైధాన్ గురించి ముందుగా చెప్తాను.  ఔరంగాబాద్ జిల్లాలో, ఔరంగాబాద్ కు 56 కి.మీ.ల దూరంలో వున్నది పైధాన్.  పైధాన్ అనగానే మహిళలంతా ఈ పేరెక్కడో విన్నట్లు వుందే అనుకుంటున్నారు కదూ.  మీరు తప్పక వినే వుంటారు.  ఎందుకంటే ప్రఖ్యాతి చెందిన పైధాన్ సిల్క్ చీరెల గురించి మీకు తెలియకుండా వుంటుందామరి!!?  అవేనండీ... అతి సున్నితమైన సిల్క్ దారంతో, వెండి, బంగారం జరీ అంచులతో, చేతి మగ్గాలమీద నేసే చీరెలు. పుష్కరాలకి అక్కడికే వెళ్తే పోలా అనుకుంటున్నారా!  మరే! మనం పుణ్యం సంపాదించుకోవచ్చు, మనవారి పురుషార్ధాన్నీ ఖర్చు చేయవచ్చు.  సరే.  వెళ్ళే ముందు ఆ ప్రదేశాన్ని గురించి కొంచెం తెలుసుకోండి.  (మగవారికి హామీ!!!!   చీరెల షాపుల అడ్రసులు నేను ఇవ్వను.)

పైధాన్ పూర్వం శాతవాహనుల రాజధాని.  దీని పూర్వ నామధేయం ప్రతిష్టానపురం.  అంతేకాదు.  ఇది ప్రసిధ్ధి చెందిన జైన తీర్ధస్ధలం.  ఇక్కడ భగవాన్ మునిసువ్రతనాధ్ ఆలయం వున్నది.  ఇందులోని విగ్రహం అనేక వేల సంవత్సరాల క్రితం ఇసకతో తయారు చేయబడినది.  ఇది రాతి విగ్రహాల తయారీ కాలానికి ముందుదంటారు.  ఈ విగ్రహాన్ని సీతా, రామ, లక్ష్మణులు పూజించారని నమ్మతారు.  నిర్మలమైన మనసుతో ఈ భగవంతుణ్ణి ప్రార్ధిస్తే కోరిన కోరికలు తీరుతాయంటారు.

పురాణగాధల ప్రకారం ఇళ మహారాజు బాహ్లిక దేశాన్ని పాలిస్తూ వుండేవాడు.  ఆయన ఒకసారి వేటాడుతూ శివుడి అరణ్యంలోకి వెళ్ళి శివుడి ఆగ్రహానికి గురవుతాడు.  ఆ సమయంలో పరమ శివుడు ఆయనని స్త్రీ రూపాన్ని పొందమని శపిస్తాడు.  ఇళ మహారాజు పార్వతీ దేవిని ప్రార్ధిస్తే ఆవిడ కరుణించి ఒక నెల స్త్రీగా, ఒక నెల పురుషుడిగా వుండే వరమిస్తుంది.  అయితే స్త్రీగా మారినప్పుడు ఆయనకి అంతకు ముందు విషయాలు గుర్తుండవు.  స్త్రీగా వున్న సమయంలో ఆయన నవగ్రహాలలో ఒకరైన బుధుణ్ణి వివాహం చేసుకుంటాడు.  వారికి పురూరవుడనే పుత్రుడు కలుగుతాడు.  ఇళ మహారాజు శాపం గురించి తెలిసిన బుధుడు అశ్వమేధ యాగం చేసి, శివుణ్ణి మెప్పించి, ఆయనకిశాప విమోచనం కావిస్తాడు.

శాప విముక్తుడయిన ఇళ మహారాజు బాహ్లిక దేశాన్ని వదిలి ప్రతిష్టానపురం నిర్మించి అనేక సంవత్సరాలు రాజ్యం చేశాడు.  చాలాకాలం ఈ రాజ్యం సర్వతోముఖాభివృధ్ధి చెంది ఉన్నత స్ధాయిలో వున్నది.
గోదావరి ఒడ్డున వున్న ఈ అతి పురాతనమైన ప్రదేశంలో హిందూ, బౌధ్ధ, జైన మతాలు ఉజ్వలంగా వెలిగాయి.  ఏకనాధ్, జ్ఞానేశ్వర్, నివృత్తినాధ్ మొదలగు అనేక మహా పురుషులు భక్తి మార్గాన్ని ప్రబోధించారు.  ఈ ప్రదేశం ప్రాముఖ్యతని గుర్తించిన మరాఠా రాజులు దీనిని దర్శించి, అభివృధ్దికి కృషి చేశారు.  ఛత్రపతి శివాజీ ఇక్కడి పండితుణ్ణి తమ రాజ గురువుగా నియమించుకుని గౌరవించారు.   ఈ ఆచారం ఆయన తర్వాత కూడా కొంతకాలం కొనసాగింది.


నాందేడ్


చారిత్రక ప్రసిధ్ధిగల పురాతన నగరం నాందేడ్.  నంద రాజులు, మౌర్యులు (అశోకుడు) పరిపాలించిన ప్రదేశం.  ఇక్కడ గోదావరీ తటంలో పరమ శివుడి వాహనమైన నంది తపస్సు చేశాడు.  ఆ నంది తటమే కాలక్రమేణా నాందేడ్ అయింది.  నాందేడ్ జిల్లాలోని వసిమ్ లో కనుగొనబడిన రాగి రేకు శాసనం ద్వారా ఈ ప్రదేశానికి పూర్వ నామధేయం నందితటం అని తెలిసింది.  క్రీ.శ. 1948 దాకా నైజాం రాష్ట్రంలో వున్న నాందేడ్ భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన సమయంలో మహారాష్ట్రలో కలిసింది. ప్రస్తుతం నాందేడ్ అనగానే గుర్తొచ్చేది గురుద్వారా.  సిక్కులకు అత్యంత పవిత్రమైన ఐదు క్షేత్రాలలో ఇది ఒకటి.  ఇక్కడ సిక్కుల పుణ్య క్షేత్రం హజూర్ సాహిబ్ వున్నది.  సిక్కు మతస్తుల 10 వ గురువైన గురు గోబింద సింగ్ ఇక్కడే స్ధిర పడ్డారు.  ఆయన తానే సిక్కుల చివరి గురువునని, సిక్కులకు గురువుల అవసరం లేదని, వారు గ్రంధ సాహిబ్ నే తమ గురువుగా భావించాలని చెప్పారు.  ఈ గ్రంధంలో సిక్కుల జీవన విధానం ఎలా వుండలనేది సూచించారు.

నాందేడ్ కి సిక్కుల మొదటి, ఆఖరు గురువులతో సంబంధ వున్నది.  వారి మొదటి గురువైన గురు నానక్ దేవ్ నాందేడ్ ద్వారా దక్షిణ ప్రాంతాలకి, శ్రీలంకకు ప్రయాణం చేశారు.  చివరి గురువైన గురుగోబింద సింగ్ తన జీవితంలో ఆఖరి రోజులు ఇక్కడ గడిపి, ఇక్కడే చివరి శ్వాస విడిచారు.  ఆయన అవశేషాలు కొన్ని ఇక్కడ భద్రపరచబడ్డాయి.  ఇక్కడ నిర్మింపబడిన గురుద్వారా మహారాజా రంజిత్ సింగ్ పర్యవేక్షణలో నిర్మింపబడింది.

నాందేడ్ రైల్వే స్టేషన్ కి 4 కి.మీ. ల దూరంలే నాందేడ్ కోట వున్నది.  దీనికి మూడు వైపులా గోదావరి వుంటుంది.

రేపటినుంచి తెలుగు రాష్ట్రాలలో గోదావరీ తట ఆలయాలు చూద్దాము.  ముందుగా తెలంగాణా రాష్ట్రంలోని అతి పురాతన క్షేత్రం, చదువుల తల్లి సరస్వతీదేవి కొలువైన బాసర.

- పి.యస్.యమ్.లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)