Read more!

వైభవ గోదావరి – 3 శ్రీరాముడు నివసించిన నాసిక్

 

 

వైభవ గోదావరి – 3


శ్రీరాముడు నివసించిన నాసిక్

ఇవాళ నాసిక్ గురించి చెబుతానన్నానుకదా.  నాసిక్ యుగయుగాల చరిత్రకల ప్రదేశం.  శ్రీరామచంద్రుడు వనవాసం సమయంలో అగస్త్య మహర్షి సూచన ప్రకారం ఇక్కడ పంచవటిలో కొంతకాలం సీతా, లక్ష్మణ సమేతంగా గడిపాడని, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోసింది ఇక్కడేనని, అందుకే ఈ ప్రదేశానికి నాసిక్ అనే పేరు అనీ చెబుతారు.  గోదావరి ప్రవాహం ఉధృతంగా సాగే ఈ ప్రదేశంలో చిన్నా, పెద్దా లెక్కలేనన్ని ఆలయాలు వున్నాయి.  వాటిలో కొన్నిటి గురించి చెప్పేముందు ఇక్కడ గోదావరి గురించి.......

పవిత్ర గోదావరి గురించి అనేక విషయాలు ఈ పుష్కరాల సందర్భంగా మనం తెలుసుకుంటూనే వున్నాము.  ప్రస్తుతం నేను చూసిన గోదావరి గురించి చెబుతాను.  నాసిక్ దగ్గర గోదావరి గలగల ప్రవహిస్తుంది. రామ కుండ్ దగ్గర స్నానానికి వీలుగా వుంటుంది.  గట్టుమీద గోదావరికి ఆలయం.  ఇక్కడ సాయంకాలాలు నదీ హారతి ఇస్తారు. నదీ స్నానాసక్తి వున్నవారు ఇక్కడ స్నానం చెయ్యచ్చు.. నదీ స్నానం చేసిన భక్తులు నదికి పూజచేసి, దీపాలు వదులుతారు.   గోదావరీ ప్రవాహం ఈ ప్రాంతాల్లోనే మొదలుగనుక నీరు మిగతా చోటుకన్నా కొంత పరిశుభ్రంగా వుంటుందిగానీ, భక్తులు సమర్పించే పూజా ద్రవ్యాలు,, దీపాల దొప్పలు వగైరాలు నీటిలో తేలుతూ వుంటాయి.

మొదటిసారి వెళ్ళినప్పుడు స్నానం చెయ్యటానికి సాహసించలేదు.  కాళ్ళు కడుగుకున్నాను.  ఆశ్చర్యం.  నా కాలిమీద అంతకు ముందు సన్న పొక్కుల్లా వచ్చి, దురదతో వాటిని గోకటంవలన నల్ల మచ్చలాగా ఏర్పడింది.  కొన్ని నిముషాలు ఆ గోదావరి నీటిలో వున్నాక తర్వాత ఎప్పుడో చూసుకుంటే ఆ నలుపు పూర్తిగాపోయి కాలు మామూలుగా అయింది.  ఇలా జరగవచ్చు అనే ఆలోచనకూడా నాకు లేదు. పెద్దలు చెబుతూ వుంటారుకదా.  ప్రవహించే నది నీటికి ఔషధ గుణాలుంటాయి, ఆ నీరు అనేక పర్వతాలు, అరణ్యాలలో వుండే ఔషధ మొక్కలను ఒరుసుకుంటూ పారుతుందిగనుక వాటి ఔషధ గుణాలు నీటికీ వస్తాయని.  నదీ స్నాన మహత్యం ఆ రోజు తెలుసుకున్నాను కానీ, అలాంటి ఫలితాలు పొందాలంటే నదులను పరిశుభ్రంగా వుంచుకోవాలి. 

ప్రవహించే నీటికి అంత మహత్యం వున్నదిగనుకే మన పూర్వీకులు తీర్ధ స్నానాలు, నదీ స్నానాలకి అంత విలువ ఇచ్చారు.  కానీ నాగరికత పెరిగిపోయి, ఆలోచన లేకుండా, మనకున్న వనరులను మనం నాశనం చేసుకుంటున్నాము.  ఇలాంటి సందర్భాలలోనైనా, మన సంస్కృతీ సంప్రదాయాల విలువలు తెలుసుకుని,  నదీ స్నానాలవల్ల మన పూర్వులు చెప్పిన సత్ఫలితాలు పొందాలంటే దానికి మనవంతు కృషికూడా అవసరం.  నదీ పరీవాహక ప్రదేశాలను శుభ్రంగా వుంచుకోవాలి.

ఇవాళ టీవీలో చూశాము.  తొక్కిసలాటలో 27మంది చనిపోయారని.  టీ.వీ. చూసేవారు గమనించే వుంటారు. అంత జనంలో వెళ్ళేదోవలేక ఆడవారు, వయసులో పెద్దవారుకూడా గోడలు ఎక్కుతున్నారు.  మన ఆడవారి వస్త్రధారణ గోడలు ఎక్కటానికి ఎంత అడ్డుగా వుంటుందో మనకి తెలియదా!?   అసలు అంత సాహసం చెయ్యవలసిన అవసరం ఏమిటి??  పుష్కర నదిలో మూడు మునకలు వేసినంతమాత్రాన ఎన్నో జన్మల పాపాలన్నీ కడుక్కుపోతాయని మీడియా ద్వారా ప్రచారంవలనా?  లేక  విస్తృతమైన ఏర్పాట్లు చేశాము రారండి అనే ఆహ్వానాలవలనా??   వాళ్ళంతా ఎవరి పని వారు చేశారు.  మరి మన పని మనం చేయాలిగా.  రద్దీ ఎక్కువగా వుండే ప్రదేశాలకి, తొక్కిసలాట జరిగే చోటికి దూరంగా వుండండి.   పుష్కరస్నానం మంచిదేగానీ తొక్కిసలాటలు తంటాలు తెస్తాయి.  నీరు తక్కువగా వున్న చోట స్నానం ఈ రద్దీలో ఆరోగ్యానికి మంచిదికాదు.  ఎంత నిబధ్ధతగల ప్రభుత్వమైనా వారి పరిమితులు వారికుంటాయి.  కనుక మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి.


సరే. అసలు విషయానికి వస్తే పుష్కరాల విషయంలో మనకీ ఉత్తరాదివారికీ కొంచెం తేడాలు వున్నాయి.  మనం పుష్కరాల సందర్భంగా నదీ పరీవాహక ప్రదేశంలో ఎక్కడైనా స్నానం చెయ్యచ్చు అని చెబుతారు.  కానీ మనకి  బృహస్పతి ఏడాదికో రాశి చొప్పున 12 రాశులలో ప్రవేశించినప్పుడు 12 నదులకు పుష్కరాలొస్తాయి.  వారికి బృహస్పతి, సూర్యుడు గమనాలబట్టి కేవలం నాలుగు ప్రదేశాలలో మాత్రమే వచ్చే ఈ పండుగని వారు కుంభమేలా అంటారు.  ఇంక ఆ నాలుగు ప్రదేశాలూ హరిద్వార్, ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్ లు.  ఈ నాలుగు చోట్లా కుంభమేలాలు విడివిడిగా వస్తాయి.  రాక్షసులు దేవతలవద్దనుంచి అమృతం అపహరించిన సందర్భంలో అమృతం నాలుగు చోట్ల చిందిందిట.  ఆ ప్రదేశాలే పైన చెప్పిన ప్రదేశాలు.  అక్కడ మాత్రమే కుంభమేలాలు జరుగుతాయి.  ప్రస్తుతం మనకి పుష్కరాలు ప్రారంభమయినప్పుడే నాసిక్ లో కుంభమేలా ప్రారంభమయింది.  ఆదీ 12 రోజులు జరుగుతుంది.

నాసిక్ లో అనేక ఆలయాలున్నాయన్నానుకదా. సాక్షాత్తూ శ్రీరామచంద్రులవారే కొంతకాలం నివాసమున్న పవిత్ర స్ధలం కదండీ. స్కాంద పురాణానుసారం  కశ్యప మహర్షి  ఆదేశానుసారం శ్రీ రాముడు తన తండ్రి దశరధుని శ్రాధ్దకర్మని నాసిక్ లోని గోదావరి ఒడ్డున నిర్వహించాడు.  గోదావరి తనకి చాలా ప్రీతి పాత్రమయినదని శ్రీరామచంద్రుడు చెప్పాడుట.  సీతమ్మ గోదావరిని పూజించిందట.

గోదావరి ఆలయం  
గోదావరి నది ఒడ్డునే గోదావరీ మాత ఆలయం వున్నది.  ఈ ఆలయం కుంభమేలా సందర్భంగా ఏడాదిమొత్తం తెరచి వుంటుంది.  మిగతా సమయాలలో కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే తెరుస్తారు.


అర్ధనారీశ్వర ఆలయం
ఇది రామతీర్ధ్ దగ్గరే రోడ్డు పక్కగా వుండే బుల్లి ఆలయం.  మనంత ఎత్తుకూడా వుండదు.  ఆటోవాళ్ళు, టాక్సీవాళ్ళు మాత్రం అదో పెద్ద ఆలయంలాగా చూపించే ఆలయాల లిస్టులో దానిని చేరుస్తారు.  అర్ధనారీశ్వరస్వామి ఫోటో మీకోసం.
కపాలేశ్వర మందిరం
ఇది కూడా రామ తీర్ధం, లేదా రామ కుండ్ దగ్గరే వున్న మందిరం.  ఈ ఈశ్వర మందిరం చేరుకోవటానికి కొన్ని మెట్లు ఎక్కాలి.  ఈ మందిరంలో విశేషం ఏమిటంటే సాధారణంగా శివాలయాలలో శివుడి ఎదురుగా వుండే నంది ఇక్కడ వుండదు.  దీనికి కారణం ఇక్కడ శంకరుడు నందిని తన గురువుగా భావించాడని చెప్తారు. 
శ్రీ కాలారామ్ మందిరం
నాసిక్ లో పంచవటీ క్షేత్రంలో వున్న అద్భుత మందిరం ఇది.  శ్రీరామచంద్రుడు తన వనవాస కాలంలో నివసించిన ప్రదేశంలోనే ఈ మందిర నిర్మాణం జరిగిందంటారు.  ప్రాచీన మందిరం అత్యంత జీర్ణావస్త చెందగా శ్రీమతి గోపికాబాయి పేష్వా ప్రభుత్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ ఓడోకర్ అనే ఆయన దీనిని పునరుధ్ధరించటమేకాక, ఇప్పుడున్న విశాలమైన మందిరాన్ని నిర్మించాడు. దీని నిర్మాణానికి  క్రీ.శ. 1788 నుండి క్రీ.శ. 1790 వరకు అంటే 12 సం. లు పట్టింది.  ఆ రోజుల్లోనే 23 లక్షల రూపాయలు ఖర్చయింది.

ఈ మందిరమంతా నల్లరాళ్ళతో నిర్మించారు.  ఈ మందిరానికి మూడు గుమ్మటాలున్నాయి.  మూడవ గుమ్మటం కింద గర్భాలయంలో సీతా, రామ లక్ష్మణ నల్లరాతి విగ్రహాలున్నాయి.  పై గుమ్మటం పైన వున్న కలశం 5 అడుగుల ఎత్తుతో, 6 అడుగుల గుండ్రని పరిమాణంతో బంగారంతో తయారు చేయబడింది. 
(ఇంకొక ముఖ్య విశేషం..ఈ ఆలయం ఎదురుగా బండి మీద పానీ పూరీ బాగుంటుంది.)

గోరారామ్ మందిర్
పంచవటిలోనే గోరారాం మందిరం వున్నది.  ఇక్కడి శ్రీరాములవారి విగ్రహాలు పాలరాతివి.  ఇక్కడ ఇంకా గణేష్, హనుమ, గోదావరీమాత వగైరా దేవతా విగ్రహాలున్నాయి. 
సీతా గుహ
దీనికి కొంచెం దూరంలోనే ఒక ఇల్లు. దానిలో సన్నని మెట్ల మార్గం నుంచి కిందకి వెళ్తే సీతాదేవి గుహ.  శ్రీరాముడు వనవాసమప్పుడు సీతాదేవిని ఇక్కడే వుంచాడంటారు.
పంచవటి
సీతా గుహ వున్న ప్రాంతమే.  ఇదివరకు ఇక్కడ ఐదు పెద్ద వృక్షాలు వుండేవిగనుక ఆ పేరు.  ప్రస్తుతం అవి లేకపోయినా వేరే చెట్లున్నాయి.
మ్యూజియం
సీతా గుహ ఎదురుగా రామాయణంలోని కొన్ని ఘట్టాలాధారంగా బొమ్మలతో ఒక మ్యూజియం వున్నది.  ఆసక్తి వున్నవారు దానిని దర్శించవచ్చు.  ప్రవేశ రుసుము అతి స్వల్పము.
ఇవేకాక ఇక్కడ చిన్నా, పెద్దా, పాత, కొత్తా ఆలయాలు అనేకం వున్నాయి.  ఆసక్తి వున్నవారు ఓపికగా కనుక్కుని చూడవచ్చు.

గోదావరీ స్నానము, పైన చెప్పిన ఆలయాల సందర్శన ఒక రోజులో అవుతుంది. స్వంత వాహనమైతే వీటితోబాటు 28 కి.మీ. ల దూరంలో వున్న త్రయంబకేశ్వరం కూడా దర్శించవచ్చు.  అయితే నాసిక్ కి మన వాహనంలో వెళ్ళినా పైన ఆలయాలు తిరగటానికి మన కార్లకి పర్మిషన్ లేదు.  అక్కడి ఆటోలను ఆశ్రయించాల్సిందే. 

రేపు మహారాష్ట్రలోని పైధాన్, నాందేడ్ లు చూద్దాము.

- పి.యస్.యమ్.లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)



 

 

 

 

 

 

 Godavari Pushkaralu...

History of Indian Festival Pushkaram