Read more!

Telugu New Year Ugadi

 

నందన ఉగాదికి వందనాలు

Telugu New Year Ugadi

 

తెలుగువారి నూతన సంవత్సరం నందన నామ ఉగాది పర్వదినం పరవళ్ళు తొక్కుతూ వచ్చింది. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతున్నాయి. మల్లెలు, మావిడిపిందెలు అంతకంటే ఉత్సాహంగా రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. మావిచిగురు, వేపపూత, మల్లెల గుబాళింపులు.. కోయిల కుహూరావం, పంచాంగ శ్రవణం.. ప్రతిదీ ఉగాదికి సంకేతమే. కొత్త సంవత్సర వేడుకల్లో భాగాలే.

నందన నామ సంవత్సర వైభోగమంతా వాకిళ్ళలో తీర్చిదిద్దిన రంగవల్లికల్లో దర్శనమిస్తుంది. మావిడాకుల తోరణాల్లో ఒదిగి చూస్తుంది. పంచాంగ శ్రవణంలో ప్రతిధ్వనిస్తుంది. పిండివంటల్లో ప్రతిఫలిస్తుంది. ఉగాది పచ్చడి ఊరిస్తూ జీవన పరమార్థం బోధిస్తుంది.

ఇంగ్లిష్ వాళ్ళకి న్యూ ఇయర్ ఎలాగో మనకు ఉగాది అలాగ. అసలు ఉగాది అంటే ఏమిటో తెలుసా? ఉగాది అనే పదం ''యుగాది'' నుండి పుట్టుకొచ్చింది. "ఉగ'' అంటే నక్షత్ర గమనం. ''ఆది'' అంటే మొదలు. మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అన్నమాట. ''యుగము'' అంటే జంట అని అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనముల కలయికే సంవత్సరం. అలా యుగానికి ఆది 'యుగాది' లేదా 'ఉగాది' అయింది.

మనం ఇప్పుడున్నది కలియుగంలో. అసలు కలియుగం అంటే తెలుసా.. శ్రీకృష్ణుడు ఈ జగత్తును విడిచి వెళ్ళినప్పుడే కలియుగం ప్రారంభమైంది అంటూ ''యస్మిన్ కృష్ణో దివం వ్యాతః తస్మాత్ ఏవ ప్రతిపన్నం'' అంటూ వేదవ్యాసుడు వర్ణించాడు. ఆ ప్రకారం క్రీస్తుకుపూర్వం 3102 ఫిబ్రవరి 17/18 అర్ధరాత్రినాడు కలియుగం ప్రారంభమైంది.

ఉగాది రోజున కనిపించే సందడి అంతాఇంతా కాదు. ఆడపిల్లలు రంగురంగుల పరికిణీలు, చీరలు ధరించి, కాళ్ళకు పసుపు, తలలో మల్లెలు పెట్టుకుని పదహారణాల ఆడపడుచుల్లా ముస్తాబౌతారు. ఉదయానే స్నానం చేసి ఉగాది పచ్చడి తయారుచేస్తారు. వేపపూత, మావిడి ముక్కలు, బెల్లం, ఉప్పు, మిరియాలు, చింతపండులను ఉపయోగించి తయారుచేసే ఉగాది పచ్చడిలో ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, వగరు - అనే షడ్రుచులు మిళితమై ఉంటాయి. కోపం, ద్వేషం, సంతోషం, దుఃఖం లాంటి భావోద్వేగాలకు సంకేతం ఈ షడ్రుచులు. జీవితంలో ఎప్పుడూ సుఖసంతోషాలే ఉండవని, మాధుర్యం మాత్రమే తొణికిసలాడదని, కష్టం, సుఖం కలగలిసి ఉంటాయని చెప్తుంది ఉగాది. దేనికీ పొంగిపోక, కుంగిపోక ప్రతిదాన్నీ సమదృష్టితో చూడాలని, అన్నిటికీ అతీతంగా ఉండాలనే సందేశాన్ని ప్రబోధిస్తుంది ఉగాది. ఉగాది పచ్చడిని దేవునికి నివేదించి, ఆనక ప్రసాదంగా తీసుకుంటారు. గారెలు, పాయసం, పులిహోర లాంటి ఇతర పిండివంటలనూ దేవునికి నైవేద్యంగా సమర్పించినప్పటికీ ఉగాది పచ్చడిదే అగ్రస్థానం. ఉగాది నూతన సంవత్సర వేడుకే కాదు, శోభాయమానమైన పర్వదినం. పల్లెల్లోనే గాక పట్టణాల్లోనూ తెలుగుతనం ఉట్టిపడుతుంటుంది..

ఉగాది అంటే కొత్త సంవత్సరం కనుక ఆరోజు మొదలు ఏడాది అంతా ఎలా ఉంటుందో తెలియజేసే పంచాంగ శ్రవణం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా.. అతివృష్టి, అనావృష్టి లాంటివి ఉన్నాయా.. తుఫానులు, భూకంపాలు లాంటి ప్రకృతి ప్రళయాలు ఏమైనా ఉన్నాయా.. దేశం సుభిక్షంగా ఉంటుందా లేదా తదితర అంశాలన్నీ పంచాంగంలో చోటుచేసుకుంటాయి. ఆయా రాశులకు గ్రహఫలాలను జ్యోతిష్య శాస్త్ర పండితులు క్షుణ్ణంగా వివరిస్తారు.

ఉగాది పండితులకే కాదు, కవీశ్వరులకూ ఇష్టమైన పండుగ. సాంస్కృతిక సంస్థలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కవి సమ్మేళనాలు నిర్వహిస్తాయి. మంచి కవిత్వం చెప్పి అలరించినవారిని సత్కరించి సన్మానిస్తాయి.

మనది చంద్రమాన కాలెండర్ కనుక ఉగాది ప్రతి సంవత్సరం ఒకే రోజున రాదు. శక కాలెండర్ చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఇంగ్లిష్ నెలలను అనుసరించి చూస్తే మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆంధ్రులకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కొంకణి వాళ్ళక్కూడా ఉగాది పర్వదినమే కొత్త సంవత్సరం.

మీ అందరికీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు!

 

Nandana Ugadi Wishes, Ugadi and hindu traditions, hindu festival ugadi, nandana ugadi celebrations, Nandana Ugadi Greetings