Read more!

నైమిశారణ్యం - 18

 

 

నైమిశారణ్యం - 18


ఊర్వసి

 

ఈమె ఒక అప్సరస. ఈమె పుట్టకముందు దేవలోకంలో రంభ, తిలోత్తమ, మేనక ఇత్యాది అప్సరసలు ఉండేవారు. ఆ కాలంలో నర,నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తున్నారు. వారి ఘోరతపస్సు చూసి, తన పదవికి ఎక్కడ భంగం వస్తుందో అని దేవేంద్రునకు భయం పట్టుకుంది. అందుకని, నర,నారాయణుల తపస్సును భగ్నం చేసిరమ్మని రంభ, మేనక, తిలోత్తమలతో పాటు మరికొందరు అప్సరసలను పంపాడు. రంభాది అప్సరసలు, బదరికావనం చేరి, తమ నృత్య, గాన, విలాసాలతో నర,నరాయణుల తపస్సును భగ్నం చెయ్యడానికి తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించి విఫలులయ్యారు. వారి దీనావస్థ చూసి, నరనారాయణులకు జాలి కలిగి..కన్నులు తెరిచి, ఆ అప్సరసలను దగ్గరకు రమ్మని పిలిచారు. రంభాది అప్సరసలు భయం భయంగా వారి దగ్గరకు వచ్చారు.

నర,నారాయణులు వారిని చూసి ‘భయపడకండి. మిమ్ములను శపించము. మా తపస్సు భంగం చేయమని ఆ దేవేంద్రుడు మిమ్ములను పంపాడు కాబోలు. ఈపాటి సౌందర్యానికే భ్రమసేవారం కాదు.’ అని పలికి, నారాయణుడు  తన కుడి తొడమీద అరచేత్తో చరచాడు. ఆ శబ్దం నుంచి ఒక అద్భుత సౌందర్యవతి పుట్టింది. ఊర్వసి అందం చూసి రంభాది అప్సరసలు ఆశ్చర్యపోయారు. ‘ఊరువు’ అంటే తొడ... ‘అసి’ అంటే పుట్టింది కనుక..ఆమెకు ‘ఊర్వసి’ అని పేరుపెట్టి, ఆమెను రంభాది అప్సరసలకు అప్పగిస్తూ ‘ఈ సుందరిని మేమే దేవేంద్రునకు బహూకరించామని  చెప్పండి’ అని పలికి...ఊర్వసిని వారికి అప్పగించి, తిరిగి తపస్సులోకి వెళ్ళిపోయారు నర,నారాయణులు. ఆ విధంగా నారాయణుని కుమార్తె అయిన ఊర్వసి అప్సరసల్లో స్థానం సంపాదించుకుంది. ఒకసారి దేవలోకానికి వెడుతున్న ఊర్వసిని మార్గమధ్యంలో చూసారు..మిత్రా,(సూర్యుడు) వరుణులు. ఊర్వసి అందం చూడగానే మిత్రునకు చిత్తభ్రమ కలిగి, వీర్యపతనం అయింది. ఊర్వసి ఆ వీర్యాన్ని ఒక కుండలో భద్రపరిచింది. అయితే.. మిత్రునికి తెలియకుండా...వరుణుడు కూడా, ఊర్వసి అందానికి చలించడంతో అతనికి కూడా వీర్యపతనం జరిగింది. ఊర్వసి ఆ వీర్యాన్ని కూడా కుండలో భద్రపరచింది. అలా మిత్రా, వరుణులకు పుట్టినవారే వసిష్ఠుడు, అగస్యుడు. కుండలనుంచి ఉద్భవించారు కనుక వారు కుంభసంభవులయ్యారు.

ఈ సంగతి తెలిసి మిత్రుడు కోపించి ఊర్వసితో ‘ ముందు నన్ను కామించి, తర్వాత వరుణుని కామించిన నేరానికి భూలోకంలోని పురూరవ చక్రవర్తికి భార్యవు కమ్ము’ అని శపించాడు. ఒకసారి పురూరవుడు, ఊర్వసిని చూడడం తటస్థించింది. కనులు మిరుమిట్లుగొలిపే ఆమె సౌందర్యం అతనిని మోహపరవశుని చేయగా..అతను ఊర్వసిని సమీపించి, తనను వివాహం చేసుకొమ్మని అర్థించాడు. ఊర్వసికి మిత్రుని శాపం గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆమె పురూరవునితో ‘మీరు నా జింకపిల్లలను కంటికి రెప్పలా కాపాడాలి, దిగంబరంగా ఎప్పుడూ నా కంటబడకూడదు. ఇందుకు మీకు ఇష్టమైతే, మీతో వివాహం నాకు సమ్మతమే’ అంది. పురూరవుడు సమ్మతించాడు. వారి వివాహం జరిగింది. ఊర్వసీ, పురూరవుల శృంగారయాత్ర ఆనందపు అలలమీద రసరమ్యంగా సాగుతోంది. అయితే...ఊర్వసి లేని లోటు దేవేంద్రునకు బాగా తెలిసింది. అమరావతిలో తిరిగి అందాలు విరబూయాలంటే...ఊర్వసి తిరిగి స్వర్గానికి రావాలి. ఇదే మాట ఊర్వసిని కలిసి చెప్పాడు దేవేంద్రుడు. ఊర్వసి... తనకు, పురూరవునకు ఉన్న వివాహ ఒప్పందం గురించి దేవేంద్రునకు చెప్పింది. ఒకనాటి రాత్రి.. ఊర్వసి, పురూరవుడు ఏకశయ్యాగతులై ఉండగా.. దేవేంద్రునిచేత నియమితుడైన ఒక గంధర్వుడు అదృశ్యరూపంలో వచ్చి, ఊర్వసి జింకపిల్లలను అపహరించాడు.

అది తెలిసి ఊర్వసి పురూరవుని నిందించగా... అతడు ఆమెను ఓదార్చి.. తనున్న స్థితిని మరచి శయ్య దిగాడు. అదే సమయంలో, అతని దిగంబరత్వం ఊర్వసికి కనబడేలా దేవేంద్రుడు మెరుపులు సృష్టించాడు. ఆ మెరుపుల వెలుగులో ఊర్వసి.. పురూరవుని దిగంబరంగా చూసింది. ‘మీరు, మన వివాహపు ఒప్పందాలను కాపాడలేకపోయారు. నేను స్వర్గానికి వెళ్లిపోతున్నాను’ అని పలికి, పురూరవుడు ఎంతగా బ్రతిమాలుతున్నా వినకుండా స్వర్గానికి వెళ్లిపోయింది ఊర్వసి. ఊర్వసీ వియోగంతో పురూరవుడు పిచ్చివాడు అయ్యాడనే చెప్పాలి. ఆ రోజులలో దేవ దానవుల యుద్ధాలలో దేవేంద్రునకు సహాయంగా పురూరవుడు వెళ్లడం జరిగింది. అందుకు సంతసించిన దేవేంద్రుడు, పురూరవుని కోరిక మేరకు తిరిగి ఊర్వసిని అతనికి అప్పగించాడు. వారిరువురి శృంగార తపోమయ జీవితానికి సాక్ష్యాలుగా జన్మించిన వారే.. ధీమంతుడు, ఆయువు, శతాయువు, దృఢాయువు. అర్జునుని బృహన్నలవు కమ్మని శపించినది... ఈ ఊర్వసే.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం