గురుచరిత్రలో అద్బుతం.. ఈ కథను రోజూ చదివితే ఎలాంటి వ్యాధులు అయినా నయం కావాల్సిందే..!
గురుచరిత్రలో అద్బుతం.. ఈ కథను రోజూ చదివితే ఎలాంటి వ్యాధులు అయినా నయం కావాల్సిందే..!
త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు అని అంటారు. ఆ దత్తాత్రేయుడు కలియుగంలో తన భక్తులను అనుగ్రహించడానికి వివిధ అవతారాలు ఎత్తాడు. వీటిలో శ్రీపాద వల్లభులు ఒకరైతే, నృసింహ సరస్వతి స్వామి కూడా ప్రముఖమైనవారు. గురు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం చాలా మంది చేసే పని గురుచరిత్ర పారాయణ. గురుచరిత్ర చదివిన వారు ఆ గురువు అనుగ్రహం పొంది తీరతారు అని చెబుతారు. ఎందరో భక్తులు దత్తాత్రేయుని అనుగ్రహం పొంది తమ అనుభవాలు కూడా చెబుతూ ఉంటారు. అయితే దత్తాత్రేయ స్వరూపమైన నృసింహ సరస్వతి స్వామి చేసిన లీలలు అద్బుతమైనవి. గురుచరిత్రలో ఒక్కో అధ్యాయం ఒకో సమస్యకు దారి చూపిస్తుంది. ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడేవారు గురుచరిత్రలో నరహరి కథను వెంటే తప్పక అనారోగ్యాలు మాయమవుతాయని ఎంతోమంది తమ అనుభవం ద్వారా చెబుతున్నారు. అంతటి మహిమ కలిగిన నరహరి కథ ఏమిటో తెలుసుకుంటే..
నరహరి కథ..
నరహరి అనే భక్తుడికి కుష్ణు రోగం ఉంటుంది. అతను బ్రాహ్మణుడు అయినా అతనికి కుష్ణు రోగం రావడం వల్ల అతడిని ఎవరూ కనీసం బోజనానికి కూడా పిలిచేవారు కాదు. ఈ క్రమంలో అతను గంధర్వపురంలో నృసింహ సరస్వతి స్వామి గురించి తెలుసుకుని ఎంతో కష్టపడి గంధర్వపురానికి వెళతారు. అక్కడ నృసింహ సరస్వతి స్వామిని దర్శించుకుని.. స్వామి నాకు ఈ కుష్ణు రోగం వల్ల జీవితం అంతా నా కాళ్ల కింద మట్టిలాగా వ్యర్థం అయిపోయింది. ఈ కుష్ణు రోగం చూసి అందరూ నన్ను అసహ్యించుకుంటున్నారు, నాకు చచ్చిపోవాలని అనిపించేది. ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించాను, ఎన్నో వ్రతాలు చేశాను. కానీ నాకు ఈ వ్యాధి నయం కాలేదు.. దయచేసి మీరే నన్ను ఉద్దరించండి. నాకు మీరు కూడా నయం చేయకపోతే నేను ఇక్కడే మరణించాలని నిర్ణయించుకుని వచ్చాను అని ప్రార్థిస్తాడు.
నృసింహ సరస్వతి స్వామికి అతని మీద జాలి కలిగి. నాయనా.. ఇలాంటి వ్యాధులు గత జన్మ పాప కర్మల వల్లే వస్తాయి. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని.. పక్కనే ఒక వ్యక్తి కొన్ని కట్టిపుల్లలు తీసుకెళ్తుంటే అతన్ని పిలిచి అందులో నుండి ఒక మేడి చెట్టు పుల్ల తీసుకుని, ఆ పుల్లను నరహరికి ఇచ్చి , ఈ పుల్లను సంగమంలో ఒకచోట గొయ్యి తీసి పాతు.. రోజూ దీనికి నీళ్లు పోసి దీన్ని పూజించు. ఈ పుల్ల ఎప్పుడైతే చిగురిస్తుందో.. అప్పుడు నీ పాపాలు కరిగిపోయినట్టు.. నీ కుష్టురోగం అప్పుడే తగ్గుతుంది అని చెబుతాడు.
ఎండిపోయిన పుల్ల ఎక్కడైనా చిగురిస్తుందా అనే సందేహం పెట్టుకోకుండా నృసింహ సరస్వతి స్వామి చెప్పినట్టు నరహరి నంగమానికి వెళ్ళి అక్కడ ఒక గొయ్యి తీసి మేడి పుల్లను నాటాడు. రోజూ దానికి నీరు పోసి, పూజలు చేసేవాడు. అందరూ అతన్ని చూసి నవ్వేవారు. అతను మాత్రం ఎవరిని లెక్కపెట్టకుండా రోజూ ఎండిపోయిన మేడి పుల్లకు నీరు పోసి పూజచేసేవాడు. పైగా నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తూ దాన్ని పూజించేవాడు.
నృసింహ సరస్వతి స్వామి సంగమానికి వెళ్లి స్నానం చేసి వచ్చే ప్రతి సారి అతన్ని పరిశీలించేవాడు. అతను ఎంతో చిత్తశుద్దితో గురువు గారు చెప్పిన పనిని చేసేవారు. ఇదెలా ఉండగా ఒకరోజు నృసింహ సరస్వతి స్వామి దగ్గరికి కొందరు వ్యక్తులు వచ్చి స్వామి మీరు ఆ రోజు ఆ వ్యక్తికి ఒక మేడి పుల్లను ఇచ్చి దాన్ని పూజించమని చెప్పారు. దానికి నీరు పోయమన్నారు. అతను అది నిజమే అనుకుని నీరు పోస్తున్నాడు. పూజిస్తున్నాడు. మీరైనా అతని దగ్గరకు వెళ్లి ఆ పని ఆపమని చెప్పండి అని అన్నారు. అప్పుడు నృసింహ సరస్వతి స్వామి.. ఒరేయ్ పిచ్చోళ్లారా.. ఈ సృష్టిలో ఎవరు చెప్పిన మాట అయినా నెరవేరకుండా పోతుందేమో కానీ.. గురువు చెప్పిన మాట మాత్రం నెరవేరకుండా ఉండకపోవడం అంటూ జరగదు. అని చెప్పి.. ఆ తరువాత అనుష్టానం చేసుకోవడానికి నదీ సంగమం దగ్గరకు వెళ్లారు నృసింహ సరస్వతి స్వామి.
సంగమం దగ్గర తాను చెప్పినట్టే నరహరి మేడి పుల్లకు నీరు పోస్తూ, పూజలు చేయడం చూశాడు. దాంతో ఆయన ఎంతో సంతోషించారు. గురువు చెప్పిన మాట ఎలాంటిదైనా సరే.. దాని మీద నమ్మకం ఉంచి ఎవరైతే పాటిస్తారో.. అలాంటివారు తప్పకుండా గురువు అనుగ్రహం పొందగలుగుతారు. గురువు కూడా తాను చెప్పింది చేసే వారంటేనే సంతోషపడతాడు. వెంటనే ఆయన నరహరి పూజిస్తున్న మేడి చెట్టు దగ్గరకు వెళ్లి తన కమండలంలో నీరు తీసుకుని మేడి పుల్ల మీద చల్లాడు. అంతే ఆ మేడి పుల్ల కాస్తా చిగుర్లు వేసి చూస్తుండగానే మేడి వృక్షంగా మారింది. గురువు మీద ఉన్న అపారమైన నమ్మకం వల్ల నరహరి గురు కృపకు పాత్రుడయ్యాడు. మేడి పుల్ల ఎప్పుడైతే చిగురు వేసి వృక్షంగా మారిందో.. అప్పుడే నరహరి కుష్ణు వ్యాధి కూడా నయం అయిపోయింది. ఆ సంతోషంలో నరహరి నృసింహ సరస్వతి స్వామి మీద ఒక స్తుతికూడా చేశాడు.
పైన చెప్పుకున్న నరహరి కథను ప్రతి రోజూ పారాయణ చేస్తూ గురుదత్తాత్రేయుడికి పూజ చేస్తుంటే తప్పకుండా ఎలాంటి వ్యాధులు అయినా నయం అవుతాయి. కావాల్సిందల్లా కేవలం గురువు మీద నమ్మకం.
*రూపశ్రీ.