సిల్లీ ఫెలో - 104

 

 

సిల్లీఫెలో - 104

- మల్లిక్

'అసలు వీటి గురించి నేనెందుకు మర్చిపోయాను? ఇవన్నీ కనబడకుండా జాగ్రత్తగా ఓ చోట సర్ది తలుపులు తలుపులు తీసివుండాల్సింది!" మనసులో అనుకొని నొసలు మీద అరచేత్తో ఠప ఠపా కొట్టుకున్నాడు.

"యెందుకలా కొట్టుకున్నావ్?" బుచ్చిబాబు వంక అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు పర్వతాలరావు.

"అంటే వీటి గురించి కూడా చెప్పడం మర్చిపోయాను కదా అనీ..." గుటకలు మింగాడు బుచ్చిబాబు.

"వీటి గురించి కూడా ఓ వెధవ కథ వుందా? ఏంటది?"

"అవి కూడా నావేనన్నమాట!" అన్నాడు బుచ్చిబాబు నీరసంగా.

"హమ్మో... హమ్మో... మా అబ్బాయ్ వెర్రాడై పోయాడు దేవుడోయ్" పార్వతమ్మ గుండెలు బాదుకుంది.

"ఒరేయ్ దగుల్బాజీ వెధవా... విషయమేంటో వివరంగా చెప్పు... నీకు చీరలతో అనవసరం ఏముంది?"

"అంటే నేను రాత్రి పూట చీరకట్టుకుని నేలమీద ఓ నెలరోజులు పడుకుంటే నన్ను అదృష్టం వరిస్తుందని ఓ సిద్ధాంతి చెప్పాడు అందుకని..."

"కెవ్ వ్ వ్..." గుండెల మీద చెయ్యేసుకుని అరిచింది పార్వతి.

"మేమిక్కడ ఉన్నన్ని రోజులూ నువ్వు చీర కట్టుకుని ఆ అవతారంతో నాక్కనిపించావో పీక పుసుకుతా... కొన్ని రోజులు ఆ సిద్ధాంతిని మరిచిపో..."

"అలాగే నాన్నా!" బుద్ధిగా తల ఊపాడు బుచ్చిబాబు.

"ఇంకా అదృష్టం నీ నెత్తిన తన్నడానికి శవపూజలు కూడా చెయ్యాలని మీ సిద్ధాంతి వెధవ చెప్పలేదా?.... అడిగాడు పర్వతాలరావు.

"ఏమో... ఇంకా చెప్పలేదు మరి... " నసిగాడు బుచ్చిబాబు.

"అయితే ఆ సిద్ధాంతి వెధవ చెప్తే శవపూజలు కూడా చెయ్యడానికి రెడీ అన్నమాట" నొసలుకొట్టుకున్నాడు పర్వతాలరావు.

"కెవ్ వ్ వ్!" మళ్ళీ అరిచింది పార్వతమ్మ.