సిల్లీ ఫెలో - 101

 

 

సిల్లీఫెలో - 101

- మల్లిక్

"అమ్మో ... ఆఫీసుకి టైమైపోయింది." కంగారుగా అన్నాడు మోహన్.

"భోంచేసేశారు. డ్రసెప్ కూడా అయిపోయారు. ఇంక షూస్ వేసుకుని బయలుదేరడమే! అయినా ఎందుకా కంగారు?" అడిగింది భార్య రామలక్ష్మి.

"సరే... సరే ఆ షూస్ ఇలా తొయ్."

రామలక్ష్మి సోఫాలో కూర్చున్న మోహన్ దగ్గరికి బూట్లు తన కాలితో తోసింది.

మోహన్ బూట్లు తొడుక్కుని లేచి నిలబడ్డాడు.

"వస్తానే రామూ..." అని వీధి గుమ్మంవైపు అడుగులు వేసాడు మోహన్.

సరిగ్గా అప్పుడే డోర్ బెల్ మోగింది.

"హు! సరిగ్గా ఆఫీసుకెళ్ళే సమయానికి ఎవరు వచ్చారు?" విసుక్కుంటూ తలుపు తీశాడు మోహన్.

ఎదురుగా సీత!

ఆమెని చూడగానే మోహన్ కి ఆనందం, ఆశ్చర్యం కలిగింది.

కానీ అంతలోనే సీత చేతిలోని సూట్ కేస్ చూడగానే మోహన్ కి చాలా అయోమయంగా అనిపించింది.

"మీ మీ మీరా? ఏంటది?" గుటకలు మింగుతూ అన్నాడు మోహన్.

"మీ ఇంట్లో ఉందామనీ" మెల్లగా అంది సీత.

మోహన్ అర్థంకానట్టు చూసాడు. రెండు క్షణాలు ఆగి ప్రశ్నించాడు.

"మీరూ, బుచ్చిబాబు గొడవ పడ్డారా?"

సీత తల అడ్డంగా ఊపింది.

"మరి ఈ సూట్ కేసు..." సందేహంగా ఆగాడు.

"బుచ్చిబాబు వచ్చి మీతో మాట్లాడతాడు."

మోహన్ కి ఈ వింత పరిస్థితి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. సీత అక్కడ వుండడం సంతోషకరమైన విషయమే... కానీ పెళ్ళానికి ఏం చెపుతాడు?

"ఏంటి?" మీకేమయినా అభ్యంతరమా?" సందేహంగా అడిగింది.

మోహన్ అలా ఆలోచిస్తూ నిలబడేసరికి ఆమెకి భయం వేసింది. ఇప్పుడు మోహన్ కుదరదని అంటే ఎక్కడికి వెళ్ళాలి?

ఆమె అడిగిన ప్రశ్నకి మోహన్ వెంటనే రియాక్ట్ అయ్యాడు.

"అబ్బే... అబ్బెబ్బే... ఇబ్బందేంలేదండీ. మీరు రావడం నాకెంతో సంతోషంగా వుంది. రండి రండి లోపలి రండి.

సీత చేతిలోని సూట్ కేస్ అందుకున్నాడు మోహన్.

సీత లోపలికి అడుగు పెట్టింది.

"ఎవరండీ వచ్చారు?" అంటూ రామలక్ష్మీ లోపలి గదిలోంచి బయటకి వచ్చింది.

"బుచ్చిబాబు అని మా ఆఫీసులో పని చేస్తున్నాడులే... అతని..."

మోహన్ చెబుతుండగా సీత మధ్యలో తుంచేస్తూ అంది.

"అంటే మా ఇంటికి చాలా మంది చుట్టాలొచ్చారండీ... అసలు కూర్చోవడానికి కూడా చోటు లేకపోతే బుచ్చిబాబు నన్నిక్కడికి పంపించాడు."

"మీరిలా లోపలికి రండి" రామలక్ష్మి మోహన్ ని పిలిచింది.

మోహన్ రామలక్ష్మి వెనకాలే లోపలకి వెళ్ళాడు.

"ఏంటండీ. వాళ్ళింట్లో చుట్టాలొస్తే పెళ్ళాన్ని ఇక్కడికి పంపించడం ఏంటండీ? చాలా విచిత్రంగా వుంది. ఎంతమంది చుట్టాలొచ్చినా సర్దుకుని వుంటారుగానీ మొగుడూ పెళ్ళాలు విడివిడిగా వుంటారాండీ?" అంది రామలక్ష్మి.

"అదే నాకు విచిత్రంగా వుంది" అన్నాడు మోహన్ ఆలోచనగా.