సిల్లీ ఫెలో - 91

 

 

సిల్లీఫెలో - 91

- మల్లిక్

 



"క్లోజ్ అంటే మరీ క్లోజ్ కాదు. ఏదో చదువుకునేటప్పుడు..." అన్నాడు బుచ్చిబాబు.

"నీ ఫ్రెండ్ ని అంటున్నానని ఏమీ అనుకోకు. అతని చూపులూ, వాలకం నాకు నచ్చలేదు. పొద్దున్న అతను వచ్చిన పది నిముషాలకే బ్రతికిపోయాను."

తాను లేడని తెలిసే మోహన్ వచ్చాడని సీతకి బుచ్చిబాబు చెప్పలేదు.

అతను అలా రావడం బుచ్చిబాబుకి ఇంకా పజిల్డ్ గానే వుంది. అతని ప్రవర్తన గురించి తను ఓ కన్ క్లూజన్ కి రాకుండా సీతకి చెప్పడం బుచ్చిబాబుకి ఇష్టంలేదు.


*              *              *

"ఒసేవ్ వెంకటీ..." పిలిచాడు మినిస్టర్ మిన్నారావు.

"ఏటీ?" లోపలి నుండి హాల్లోకి వస్తూ అడిగింది వెంకటలక్ష్మి.

"ఈయాల ఏం వండుతున్నావ్?" మిన్నారావు అడిగాడు.

"కోడికూర ఏపుడు సేసి చారెడ్తున్నా!"

"సీ.... దీనెమ్మ! ఈ కోళ్ళూ, పందులూ తిని తెగ ఇసుగొచ్చేసిందే! ఓ పని సెయ్యి"

"ఏటి?"

"ఈయాల ఉప్పుసేపల ఏపుడు సేసి పప్పుచారు కాయి. అదిరిపోద్ది" కులాసాగా కాళ్ళూపుతూ అన్నాడు  మినిస్టర్ మిన్నారావ్.

వెంకటలక్ష్మి కిసకిసా నవ్వేసింది.

"ఓ.... అట్టాగేలే.... అయినా ఈయల తీరుబడిగా కూక్కున్నావేటి?

ఓపెనింగ్సూ గట్రా ఏమీ లేవా?"

"ఇప్పటిదాకా అయితే లేవే... ఎవడయినా వస్తాడేమో అని సూస్తన్నా!"

వెంకటలక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది.

మినిస్టర్ మిన్నారావ్ ఓ పావుగంటసేపు న్యూస్ పేపర్ అటుఇటూ తిప్పాడు.

ఇంతలో పనివాడు లోపలికి వచ్చి "సార్... మీకోసం ఎవరో వచ్చారు" అని చెప్పాడు.

"ఓపెనింగ్స్ కోసమే వచ్చుంటారు. నాకు తెలుసు ఎవరో ఒకరు వస్తారని. తొరగా లోపలికి పంపించు" సంబరంగా అన్నాడు మినిసర్ మిన్నారావ్.

పనివాడు బయటికి వెళ్ళి ఓ వ్యక్తిని లోపలికి పంపించాడు.

అయన ఎవరో కాదు.

నటరాజన్.

బుచ్చిబాబు పనిచేసే ఆఫీసు హైదరాబాద్ లోని హెడ్డాఫీసు సీనియర్ ఎగ్జిక్యూటివ్!

"వణక్కం" అన్నాడు నటరాజన్ మినిస్టర్ మిన్నారావు వంక చూసి చేతులు జోడిస్తూ.

"గిణక్కం! హిహిహి.... ఇది మా బాస! కూకో సామీ కూకో! సూత్తే పెద్దమడిసిలా వున్నావు" అన్నాడు మిన్నారావు.

"నాను ఏం పెద్ద మడిసి... తమరుదా దొడ్డమనిషి!" అంటూ అతని ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు నటరాజన్.

"సరే... తమరెవరు? ఏం పనిమీదొచ్చారు? ఏమైనా ఓపెనింగ్సా? సంబరంగా అడిగాడు మినిస్టర్ మిన్నారావ్.

"నాన్ దా నటరాజన్"

తన పేరు చెప్పుకుని తను ఎక్కడ పనిచేసేది చెప్పాడు నటరాజన్.