సిల్లీ ఫెలో - 86

 

 

సిల్లీఫెలో - 86

- మల్లిక్

 

అదేసమయంలో సీత చేతులు బుచ్చిబాబుని బలంగా వెనక్కి తోశాయ్... ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఆ కళ్ళలో భావం బుచ్చిబాబుకి అర్థం కాలేదు కానీ బుచ్చిబాబు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

బాధవల్లా? కాదు!

ఉక్రోషంవల్లా? కానేకాదు.

విరహాన్ని తట్టుకోలేక ఆ కన్నీళ్ళు.

"ప్లీజ్ నన్ను కాదనకు!" అతని గొంతులో జీర!

సీత బుచ్చిబాబు గుండెల్లో తలదాచుకుంది.

బుచ్చిబాబు మళ్ళీ చనువు తీసుకున్నాడు.

సీత బుచ్చిబాబుకి లొంగిపోయింది.

ఆమె అతనికి లొంగిపోవడానికి ఇష్టపడింది కనుకనే అతనికి లొంగిపోయింది.

పూర్తిగా....

బుచ్చిబాబు హడావిడిగా బూట్లు వేస్కుని ఆఫీసుకి బయలుదేరాడు.

"మరి నేను వెళ్లిరానా?" అంటూ సీతని దగ్గరకు తీసుకుని బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు బుచ్చిబాబు.

"ఊ" అంది సీత.

"ఊ అనగానే సరిపోదు. నువ్వుకూడా నా బుగ్గమీద ముద్దుపెట్టాలి మరి!" మారాం చేస్తూ అన్నాడు బుచ్చిబాబు.

రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో బుచ్చిబాబుకి చాలా కాన్ఫిడెన్స్. ధైర్యం వచ్చేసాయి. తన జీవితం సెటిలైపోయినట్టే అనిపించింది అతనికి.

అతని మొహంలో విజయగర్వం తొణికిసలాడుతూ వుంది.

సీత బుచ్చిబాబు బుగ్గమీద ముద్దుపెట్టుకుంది.

"థాంక్యూ!" అంటూ గుమ్మంవైపు అడుగులు వేసాడు బుచ్చిబాబు.

"బుచ్చీ!" వెనుకనుండీ సీత పిలిచింది.

బుచ్చిబాబు వెనక్కి తిరిగి చూశాడు.

"సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేస్తావుగా?" అడిగింది.

బుచ్చిబాబుకి ఎంతో సంబరం అయిపోయింది.

"అబ్బో... అబ్బో.. అప్పుడే ఎంత కన్సర్న్ చూపిస్తోందో!" అనుకున్నాడు.

"ఓ అలాగే...." అన్నాడు.

నిజానికి రాత్రి జరిగిన దానికి ఎంతో ప్రేమ మైకం కమ్మేసి విరహంతో వేగలేక బుచ్చిబాబును త్వరగా రమ్మని అడగడంలేదు సీత. ఒక్కర్తే ఇంట్లో వుండి బోర్ కొడుతూ త్వరగా రమ్మని అంది. నిజానికి ఉద్యోగం చేసే ఆడవాళ్ళు సెలవు పెట్టి ఇంట్లో కూర్చోలేరు. అదీ సీతలా మరీ లాంగ్ లీవ్ పెట్టి ఇంట్లో కూర్చోవాలంటే ఎవరివల్ల కాదు.

"బుచ్చీ..."

వీధి తలుపులు వేసుకుని బయటికి వెళ్ళబోతున్న బుచ్చిబాబుని మళ్ళీ పిలిచింది సీత.

"మళ్ళీ ఏంటి" అనడిగాడు బుచ్చిబాబు.

"మీ ఆఫీసులో నా గురించి చెప్పావా అసలు."

బుచ్చిబాబు ఆశ్చర్యంగా సీతవంక చూసాడు. "ఇప్పుడు హఠాత్తుగా ఆ విషయం ఎందుకడుగుతున్నావు?"