సిల్లీ ఫెలో - 48

 

 

సిల్లీఫెలో - 48

- మల్లిక్

 

"సన్నాసెదవా, తింగరెదవ, పనికిమాలిన యదవ." తిట్లు లంకించుకున్నాడు పర్వతాలరావు.

రాత్రి బుచ్చిబాబుకి నిద్రపట్టలేదు.

అతని బుర్రనిండా ఎన్నో ఆలోచనలు. అసలే ట్రాన్స్ ఫర్ ప్రాబ్లం ఒకటి తన బుర్రని తొలిచేస్తుంటే వీళ్ళు ఓ ప్రక్కన సంబంధాలు చూసి పెళ్ళికి బలవంతం చేసి చంపేసేలా వున్నారు.

ఇలాగయితే లాభం లేదు. తన ట్రాన్స్ ఫర్ విషయం త్వరగా తేల్చేసి విజయవాడ వెళ్ళి సీతతో కాపురం పెట్టెయ్యాలి."

కానీ ఎలా?

ఏకాంబరం కోపరేట్ చేయడు. పైగా అర్థంకాని బూతులు తిడతాడు.

మినిస్టర్ మిన్నారావు అసలే కుదరదని అన్నాడు.

మరి తన సమస్య తీరేదెలా? ఎవరు ట్రాన్స్ ఫర్ చేయిస్తారు... ఎవరు?

ఎవర? ?

ఎవరు? ?

హఠాత్తుగా అతని బుర్రలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

బ్లాక్ మెయిల్!

బ్లాక్ మెయిల్ !

అవును....

తన సమస్యకి పరిష్కారం !! అనుకున్నాడు బుచ్చిబాబు.

స్ పేపర్ చూస్తున్న మినిస్టర్ మిన్నారావ్ ఆనందంగా కేకపెట్టాడు.

"ఏమేవ్ ఇలారా!"

వెంకటలక్ష్మి ఆ అరుపుకి హడావిడిగా హాల్లోకి వచ్చింది.

"ఏమేవ్ ఏటీ.. నేనెవర్నేటి?" చిరాగ్గా మొహం పెట్టి అడిగింది వెంకటలక్ష్మి.

"ఎవరేంటి నీ బొంద... నువ్వు నా పెళ్లానివి అన్నాడు మిన్నారావ్."

"కాదు."

మిన్నారావ్ ఉలిక్కిపడి వెంకటలక్ష్మి వంక చూసాడు.

"ఏంటేవ్! కొంపదీసి నాకు విడాకులిచ్చేదామని అనుకుంటున్నావా ఏందీ?"

"సీ... అదేంకాదు! నేను మినిస్టర్ పెళ్ళాన్ని! అందుకే ఈ సుట్టుప్రక్కలోళ్ళు ఎంతో గౌరవం ఇస్తారు. అట్టాంటిది మీరు ఊర్కే ఒసేవ్, ఏమేవ్ అంటే బాగుంటదాంట!" సిగ్గుపడ్తూ అంది వెంకటలక్ష్మి.

మినిస్టర్ మిన్నారావ్ గుడగుడ నవ్వాడు.

"ఓసినీ... అదా నీ బాధా! అట్టాగేలే. ఇకముందు ఓ మినిస్టర్ పెళ్ళామా అని పిలుస్టాలే...." నవ్వుతుంటే నోటిలోంచి కార్తున చొంగ తుడుచుకుంటూ అన్నాడు.

"సాల్లే సంబడం... ఇంతకీ నన్నెందుకు పిలిశారో?"

"నిన్న అమీర్ పేట్ లో చికెన్ సెంటర్ ఓపెన్ చేసాకదా! ఇదిగో ఈ పేపర్లో నేను ఓపెనింగ్ చేసిన ఫోటో వేసారు, చూశావా?" న్యూస్ పేపర్ని భార్య మొహం ముందు పెట్టాడు.

"ఇదిగో ఆ వైపు ప్రధానమంత్రి ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన ఫోటో.... ఈ వైపు నేను చికెన్ సెంటర్ ఓపెన్ చేసిన ఫోటో...."

"అయితే మీరు పెదానమంత్రి అంతటోడు అయిపోయారన్న మాట!" బుగ్గలు నొక్కుకుంటూ అంది వెంకటలక్ష్మి.

"మరే" గర్వంగా అన్నాడు మిన్నారావ్.

"మీరు సికెన్ పీక తెగ్గోస్తూ ఓపెనింగ్ చేసినట్లు ఫోటో తీసారు గానీ... ఆళ్ళజిమ్మడ మీరు నవ్వుతున్నప్పుడు ఫోటో తియ్యొచ్చు కదా!"

"కెమెరా బటన్ నొక్కడానికి చూపుడేలు వుంటే చాలు ఫోటోలు తీసెయ్యొచ్చు అనుకుంటారు నాయాళ్ళు. నేను చికెన్ పీక కొయ్యడంలో వున్నా. అప్పుడు ఆ ఫోటో గ్రాఫర్ రెడీ అంటే నేను నవ్వి వుండేవాడిని కదా?' బాధపడుతూ అన్నాడు మినిస్టర్ మిన్నారావ్.

"సన్నాసెదవలు!" తిట్టింది వెంకటలక్ష్మి.

ఆ టైంలో హాల్లోకి ఎవరో వచ్చిన అలికిడి అయి ఇద్దరూ తలలు తిప్పి చూశారు.

బుచ్చిబాబు.

అతని చేతిలో మడిచిన న్యూస్ పేపర్లు!