సిల్లీ ఫెలో - 36

 

 

సిల్లీఫెలో - 36

- మల్లిక్

 

"హబ్బ.. ఎంత బాగుందో!! చాలా చక్కగా ప్రింట్ చేసాడు కదూ?"

"మనం రేపటినుండే పెళ్ళి కార్డులు పంచాలి... లేకపొతే టైమ్ సరిపోదు."

"అక్కర్లేదు" మెల్లగా అన్నాడు బుచ్చిబాబు.

"ఏం?"

"సీత చేతిలోంచి బ్యాగ్ అందుకుని లేచి నిలబడ్డాడు అతను.

"ఈ పెళ్ళి జరగదు"

సీత కూడా లేచి నిలబడింది.

"మా నాయనే! ఏం జోక్ చేస్తున్నావా?" నవ్వుతూ అడిగింది సీత.

బుచ్చిబాబు నవ్వలేదు. అతని మొహం సీరియస్ గా వుంది.

"జోక్ కాదు..." నిజమే చెప్తున్నా!" బుచ్చిబాబు బ్యాగ్ లోని వెడ్డింగ్ కార్డులు మొత్తం తీసాడు.

"ఈ పెళ్ళి జరగదు" చేతిలోని వెడ్డింగ్ కార్డ్స్ మొత్తం గాల్లోకి విసిరాడు.

సీత కెవ్వున అరిచింది.

కార్డులన్నీ గాలిలో ఎగిరి హుస్సేన్ సాగర్ నీటిలో పడి అలలమీద తేలసాగాయి.

ఊహించని ఈ సంఘటనకి సీత మెదడు మొద్దుబారిపోయింది.

ఆమె కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయ్.

రాత్రి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో.. సీత బోర్లా పడుకుని వుంది. ఆమె రూం మేట్ రాధ చదువుతున్న నవలని ప్రక్కనపెట్టి సీత వంక చూసింది.

ఆమెలో కదలిక లేదు. బోర్లా పడుకుని మొహం అటుతిప్పి పడుకోవడం చేత ఆమె మొహం రాధకి కనిపించడం లేదు.

నిద్రపోతోందా?

భోజనం చెయ్యకుండా నిద్రపోవడం ఏంటీ?

"సీతా...." మెల్లగా పిలిచింది రాధ.

సీత ఉలకలేదు పలకలేదు.

"సీతా" సీత భుజం తడ్తూ ఈసారి కాస్త గట్టిగా పిలిచింది రాధ.

సీత "ఊ" అంది మెల్లగా.

"లే.... భోజనం చేద్దాం" అంది రాధ.

"నాకకలిగా లేదు.. నువ్వెళ్ళి భోజనం చెయ్యి"

సీత గొంతులో జీర.