సిల్లీ ఫెలో - 28

 

 

సిల్లీఫెలో - 28

- మల్లిక్

 

"ఆగు!" అని హాస్టల్ వార్డెన్ నాగరత్న గొంతు వినిపించింది.

సీత వెనక్కి తిరిగి చూసింది.

"ఎవరా అబ్బాయ్?" అడిగింది నాగరత్న కొప్పు తుడుముకుంటూ.

"అబ్బాయా? ఏ అబ్బాయ్?" ఆశ్చర్యంగా అడిగింది సీత.

"నటించకు. ఇప్పుడు హాస్టల్ దగ్గర దించి వేళ్ళాడే... ఆ అబ్బాయ్" కొప్పు నిమురుకుంది నాగరత్న.

"అబ్బాయా? ఇంకా నయం పిల్లోడు, చంటోడు అనలేదు"

"అబ్బా! భాధగా కొప్పుమీద గుద్దుకుంది నాగరత్న. "మరి అబ్బాయి కాక మరేం అనాలి?"  అడిగింది రేగిన కొప్పును సవరించుకుంటూ.

"ఎవరతను? అని అడగాలి" చెప్పి సీరియస్ గా తన గదిలోకి వెళ్ళి తలుపెస్కుంది సీత.

"ఓ అలాగా" అంటూ వెనక్కి తిరిగి రెండడుగులు ముందుకేసి అంతలోనే నాలుక కర్చుకోని 'వామ్మోవ్... అసలు సంగతి మర్చిపోయా...' అని కొప్పుమీద గుద్దుకుని వెనక్కి వచ్చి సీత గది తలుపులు దబ దబా బాదింది.

సీత తలుపులు తీసి నాగరత్న వంక ప్రశ్నార్ధకంగా చూసింది.

"ఎవరాయన?" అడిగింది నాగరత్న కొప్పు నిమురుకుంటూ.

"ఎవరాయన కాదు... అతనేమైన మధ్య వయస్కుడా, ముసలివాడా? ఎవరతను? అనాలి" వార్డెన్ ని సరిదిద్దింది సీత.

"హబ్బా" బాధగా అరచి మళ్ళి కొప్పుమీద గుద్దుకుంది నాగరత్న.

"సరే చెప్పు! ఎవరతను?" అడిగింది నాగరత్న.

"చెప్పక తప్పదా?" అడిగింది సీత.

"చెప్పి తీరాలి. ఇది హాస్టల్ అనుకున్నావా? మీ ఇల్లను కున్నవా? బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగి  నీ ఇష్టమొచ్చిన టైమ్ కి రావడానికి?" కోపంగా కొప్పుని పిసుకుతూ అంది నాగరత్న.

"అతను నా బాయ్ ఫ్రెండ్ కాదు. బుచ్సిబాబని నాక్కాబోయే భర్త. మా పెళ్ళికి బట్టల షాపింగ్ చేస్కున్నాం. చాలా?" అని అడిగింది సీత.

అది విని నలబై ఏళ్ళు దాటినా పెళ్ళి చేసుకోకుండా కన్నేగా మిగిలిపోయిన నాగరత్న కొప్పుమీద పిడిగుద్దులు గుద్దుకుంటూ బాధగా అరిచింది.

"హబ్ బ్ బ్బా!..."

*            *                *

బుచ్చిబాబు సీరియస్ గా పని చేస్కుంటుంటే సదాశివం పిలిచాడు.

బుచ్చిబాబు నీకు మద్రాస్ నుండి ఫోన్ కాల్"

తనకి మద్రాస్ నుండి ఫోన్ చేసే వాళ్ళు ఎవరై ఉంటారబ్బా? అని ఆలోచిస్తూ రిసీవర్ అందుకొని "హలో బుచ్చిబాబు హియర్" అన్నాడు.

"హల్లో బుష్షీ... హౌడు యూడు? అంది అవతలి కంఠం
 సంతోషంగా అరుస్తూ.

"బుష్షీనా? ఇక్కడెవరూ ఆ పేరుగలవారు లేరండి" అయోమంగా అన్నాడు బుచ్చిబాబు.

"టేల్సులేవోయ్... బుష్షీబాబువి...అవినా?" పశ్నించింది ఆ కంఠం.

"ఓ... ఆ... ఆ... అవును. మీరు?"

"నేనేరా షుండర్ ! స్టేట్స్ నుంచి ఈరోజే మడ్రాష్ వష్హాన్. రేపు మార్నింగ్ ఫ్లయిట్ కి హైడ్రాబాద్ వష్టాన్నా... ఏర్ పోర్ట్ కి వస్టావు కదూ?" అడిగింది అవతలికంఠం.

"ఓ సుందర్... నువ్వా" ఆనందంతో కేకేశాడు బుచ్చిబాబు.