Read more!

పూరీ జగన్నాధ స్వామి రధయాత్ర

 

పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర

 

 


 

పూరీ జగన్నాథుడు :-


కొలచిన వారికి కొంగుబంగారమైన నిలచిన పూరీ జగన్నాథుని పేరు వినగానే అంగరంగ వైభవంగా జరిగే రథయాత్ర గుర్తుకొస్తుంది.. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ రథయాత్రలో పాల్గొని తరిస్తారు. మధ్యయుగ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే వుంది. దేశంలోని ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటిగా భక్తులు విశ్వసించే ఈ ఆలయం వాస్తవ సంప్రదాయానికి ప్రతీక. సోదరుడు బలభద్రుడు. సోదరి సుభద్రాదేవి సమేతంగా స్వామివారు వేంచేసిన ఈ జగన్నాథక్షేత్రం గురించి పురాణాల్లో కూడా ప్రస్తావనలు వున్నాయి. జీవితంలో ఒక్కసారైనా సరే పూరీలో జరిగే ఈ రథయాత్రలో పాల్గొని తరించాలని భక్తకోటి తహతహ లాడుతుంది. ప్రతి ఏటా లక్షలమంది స్వామివారిని దర్శించుకుని ముక్తిని పొందుతున్నారు. మిగతా దేవాలయాలతో పోలిస్తే ఈ దేవాలయానికి ఎంతో ఖ్యాతి వుంది. ప్రజల్లో ఆధునిక ధోరణులు ఎంతగా మారినా ఆధ్యాత్మిక చెక్కు చెదరడం లేదనడానికి ఏ ఏడాదికాడాది పూరీ జగన్నాథ రథయాత్రలో పాల్గొంటున్న జనాన్ని చూస్తే అర్థం అవుతుంది.
  

 

ఆలయ చరిత్ర :- 

12వ శతాబ్దంలో అప్పటి కళింగ రాజు అనంత వర్మన్ చోడరంగ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడనీ, అయితే అది ఆ తర్వాత ఆఫ్గన్ల దండయాత్రల్లో ధ్వంసం కావడంతో ఆయన మనువడు అనంగ భీమదేవుడు దీనిని పునర్నిర్మించి విగ్రహాలను పునఃప్రతిష్టించి ప్రస్తుతం వున్న ఆకారానికి తీసుకొచ్చాడనీ ఈ ఆలయం తన ప్రత్యేకతను చాటుకుంటూనే వుంది.

 


 

 

 

స్థల పురాణం :- 

 స్థలపురాణం ప్రకారం కొన్నివేల ఏళ్లక్రితం ఇంద్రద్యుమ్న మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు.కృష్ణుడి అవతారమైన జగన్నాథుడు ఒక అత్తి చెట్టు కింద ఇంద్రనీలం రూపంలో మిలా మిలా మెరుస్తూ ధర్మరాజుకి కనబడ్డాడు. ధర్మరాజు విలువైన ఆ రాయిని ఎవరికంటా పడకుండా నేలమాళిగలో నిక్షిప్తం చేశాడు. ఇంద్రద్యుమ్నుడు దానిని సొంతం చేసుకోవాలని అది ఎక్కడుందో కనిపెట్టలేక భూమంతా తవ్వాడు. అయినా ఫలితం లేకపోవడంతో నిరాశ పడ్డాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడికి కలలో విష్ణువు కనిపించి పూరి సముద్ర తీరానికి వెళితే అక్కడ ఒక కొయ్యదుంగ కొట్టుకు వస్తుందనీ, దానిని దారు శిల్పంగా చెక్కించమనీ ఆజ్ఞాపించాడు. రాజు అక్కడకు వెళ్ళగానే నిజంగానే నీతి అలలపై తేలియాడుతూ వస్తున్న ఒక కొయ్యదుంగ కనబడింది. అదే సమయంలో విష్ణువు, విశ్వకర్మ వృద్ధశిస్పకారుల వేషంలో అక్కడకు వచ్చి దానిని విగ్రహాలుగా చేక్కేపని తామే చేస్తామని, అయితే అంతా పూర్తయ్యేవరకూ వాటివంక చూడకూడదని, ఒకవేళ ఎవరైనా విగ్రహాలు చెక్కడం చూస్తే తాము పనిని అర్థంతరంగా విరమించుకుని వెళ్ళిపోతామని హెచ్చరించారు.

 

ఇంద్రద్యుమ్నుడు అందుకు ఒప్పుకున్నాడు, అయితే కొన్నాళ్ళు గడిచాక భార్య గుండిచాదేవి ప్రోద్ బ్లంతో విగ్రహాలెంత వరకు అయ్యాయో తెలుసుకుందామనీ ఇంద్రద్యుమ్నుడు వాటిని చెక్కే చోటికి వెళ్ళి చూడగా, శిల్పులు కాస్తా మాయమై సగం మాత్రమే చెక్కి వున్న విగ్రహాలు కన్పించాయి. తన వేగిరపాటుకు ఎంతగానో బాధపడతాడు ఇంద్రద్యుమ్నుడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై, అతణ్ణి ఓదార్చి  వాటిని అలాగే ప్రతిష్టింప చేశారు. నాటినుచి అవి అలాగే పూజలందుకుంటున్నాయి. అందుకే ఇప్పటికీ కృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలకు చేతులుండవు. కానీ ముల్లోకములనూ వీక్షించడానికా అన్నట్లు మాత్రం చారడేసి కన్నులుంటాయి. జగన్నాథుడి ఆలయానికి సంబంధించి మరో కథ కూడా వ్యాప్తిలో వుంది. జగన్నాథుడు సవరల దేవుడనీ, నీలమ్దవుడనే పేరుతో  గిరుజనుల నుంచి పూజలందుకున్నాడనీ స్థలపురాణం చెబుతోంది. అయితే జగన్నాథుడు అందరి దేవుడుగా ప్రసిద్ధి పొందాడు.అందుకే మనం సర్వం జగన్నాథం అంటాం.

జగన్నాథ పురి  :-


జగన్నాథుడు వెలసిన ప్రదేశం కాబట్టి ఇది జగన్నాథ పురిగా వాసికెక్కింది. కాలక్రమేణా జగన్నాథ పురి కాసా పూరి జగన్నాథుడయ్యాడు. పూరీ జగన్నాథ క్షేత్రమయ్యింది. 


రథ యాత్ర :-


కన్నుల పండువగా జరిగే ఈ రథయాత్ర ఆషాడశుక్ల విదియ నాడు ప్రారంభమవుతుంది. అంటే సాధారణంగా జూన్, జూలై నెలల్లో జరుగుతుంది.అందుకు సన్నాహాలు అరవై రోజుల ముందు నుంచే అంటే వైశాఖ బహుళ విదియనాటి నుంచే ఆరంభమవుతాయి.


అబ్బురపరిచే ఆలయం :-


 ప్రభుత్వం ఈ ఆలయాన్ని ప్రాచీన ఆలయంగా గుర్తించింది. 1070ఎకరాల వైశాల్యంతో, 214 అడుగుల ఎత్తుతో జగన్నాథుని ఆలయం చూపరులకు కనువిందు చేస్తుంది. మధ్యలో ప్రధాన ఆలయం, చుట్టూ ఇతర దేవతల ఆలయాలు, పాకశాల, ప్రసాద విక్రయశాల, వీటన్నింటినీ కలుపుతూ శంఖాకారంలో క్షేత్రం వుంటుంది. అందుకే ఈ క్షేత్రానికి శంఖ క్షేత్రమని పేరు. ఆలయ ప్రాకారాన్ని 'మేఘనాథ ప్రాకారం' అంటారు. ప్రహారీకి నాలుగు వైపులా నాలుగు ముఖద్వారాలుంటాయి. గర్భాలయం విశాలంగా ఉంటుంది. నాలుగు అడుగుల ఎత్తున ఉన్న రత్న వేదిక ఇక్కడ కనువిందు చేస్తుంది. నీలమాధవ, లక్ష్మీ సరస్వతుల చిన్న చిన్న విగ్రహాలున్నాయి. సింహద్వారం ఎదుట ఏకశిలా నిర్మితమైన అరుణ స్తంభం వుంటుంది. గోపురం ఆగ్రభాగాన నీల చక్రం వుంటుంది. దానిపై సదా పతాకం ఎగురుతుంటుంది. మహాద్వారానికి ఎడమ పక్క వంటిల్లు కనిపిస్తుంది. వేల సంవత్సరాలకు పూర్వమే అబ్బురపరిచే చిత్రకళ మనవారి సొంతం అని ఈ ఆలయాన్ని చూస్తే తెలుస్తుంది.



ఏటా ఓ కొత్త రథం :-


జగన్నాథ రథయాత్ర ఆరంభం కావడానికి రెండు మాసాల ముందు అంటే వైశాఖ బహుళ విదియనాడు పూరీ రాజు ఆదేశాల మేరకు రథ నిర్మాణానికి కావలసిన వృక్షాల సేకరణ మొదలవుతుంది. పూజారుల సాయంతో ప్రత్యేక లక్షణాలు కలిగిన వృక్షాలను గుర్తించి తగిన శాంతులు చేసిన ఎదుట వాటిని అవసరమైన పరిమాణాల్లో 1072 భాగాలుగా నరికి పూరీకి తరలిస్తారు. ఒక ప్రధాన పూజారి, తొమ్మిది మంది శిష్యుల ఆధ్వర్యంలో పనిచేసే 125 మంది పనివారు మూడు జట్లుగా పడిపోయి అక్షయ తృతీయ నాడు రథాన నిర్మాణానికి అంకురార్పణ చేస్తారు. బలభద్రుడు, సుభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథుడు ముగ్గురికీ మూడు రథాలు తయారు చేస్తారు. అద్భుతమైన శిల్ప చాతుర్యం వుట్టిపడే ఈ రథాలకు మెట్లను తాటిపట్టాలతో అమరుస్తారు. ఆ రథచక్రాల పరిమాణం, పట్టు కలిపి రథాన్ని కదిపే జనశక్తి యిందులో ధ్వనిస్తాయి. 'వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాలోస్తున్నాయ్...' అంటూ శ్రీ శ్రీ అన్న మాటలు మనకు గుర్తుకు వస్తాయి.


భక్త జనసందోహం :-


కన్నుల పండువగా జరిగే ఈ రథయాత్రలో దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు పాల్గొంటారు. ఈ రథయాత్రలో కులమతాలకు తావులేదు. రథానికున్న తాళ్లను పట్టుకుని లాగడంతో రథయాత్ర ఆరంభమవుతుంది. జయజయ ధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. ముచ్చటగా మూడంటే మూడు కిలోమీటర్లు దూరంలో వున్న గుండిచాదేవి ఆలయానికి ఈ విగ్రహాలు చేరుకోవడానికి పన్నెండు గంటలు పడుతుంది. జగన్నాథునికి రథయాత్రలో భగవంతుడికి ఏమైనా లోటుపాట్లు జరిగితే  ఎంతగా ప్రయత్నించినా రథం అంగుళం కూడా ముందుకు సాగదు. రథం ఆగిపోయినప్పుడు భక్తులంతా తాము ఏదైనా అపచారం చేసినట్లయితే క్షమించవలసిందిగా వేడుకుంటూ కొబ్బరికాయలు కొడితేనే రథం కదులుతుంది.

 

స్వామివారి ప్రసాదం అమృతతుల్యం :-


ఎంతో శ్రద్దతో తయారుచేసే స్వామివారి ప్రసాదాన్ని భక్తులు ఎంతో భక్తిప్రపత్తులతో స్వీకరిస్తారు. పూరీలో స్వామివారికి నివేదించే అన్నాన్ని 'మహా ప్రసాదం' అని పిలుస్తారు. రథయాత్ర నాడు జగన్నాథుడు ఏదో ఒక రూపంలో స్వయంగా తనకు నివేదించిన ప్రసాదాన్ని ఆరగిస్తారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కుండమీద కుండపెట్టి ఇక్కడ ప్రసాదాలు వండుతారు. ఒకసారి వాడిన కుండను మరోసారి వాడరు. ఆలయ ప్రాంగణంలోనే ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ పాకశాలలో పదివేలమందికి వండి వడ్డించే సౌకర్యం వుంది. పర్వదినాల్లో అయితే రోజుకు పాతికవేల మందికి ఈ మహాప్రసాదాన్ని అందిస్తారు. ఉదయం ఐదు గంటల నుంచి అర్థరాత్రి వరకూ ఆలయాన్ని భక్తుల సదర్శనార్థం తెరిచి ఉంచుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అరగంట పాటు ఆలయాన్ని మూసివేస్తారు.


దర్శనీయ స్థలాలు:- పూరీకి సమీపంలో ఉన్న కోణార్క్ సూర్యదేవాలయంతో పాటు ఓడిస్సాలో ఎక్కడ చూసినా చారిత్రిక ప్రాధాన్యత ఉన్న ఎన్నో ఆలయాలు మనకు దర్శనం ఇస్తాయి. జగన్నాథ ఆలయం సమీపంలో కాశీ విశ్వనాథ, బాలముకుంద, సిద్ధి వినాయక, లక్ష్మీదేవి, సూర్యభగవానుడు, శ్రీ ముక్త నరసింబక్షేత్ర పాలక, విమలాదేవి శక్తి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఆ జగన్నాటక సూత్రధారి లీలల గురించి ఎంత చెప్పినా, ఎంత రాసినా తక్కువే. ఆయన సంపూర్ణ దర్శనం సకలపాపాలను హరించి ముక్తిని ప్రసాదిస్తుంది.