Read more!

జ్ఞానం కలగాలంటే దీన్ని తొలగించుకోవాలి!!

 

జ్ఞానం కలగాలంటే దీన్ని తొలగించుకోవాలి!! 

 

【ధూమేనావ్రియతే వహ్నిర్యథా దర్శో మలేనచ యథోల్బేనావృతో గర్భస్తధా తేనేడమావృతమ్ః||

పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మానిచేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్టు. ఈ కామము దాని వలసపుట్టే క్రోధము, మనలో ఉన్న ఆత్మజ్ఞానమును కప్పి ఉంచుతుంది】

ప్రతి జీవిలో ఆత్మ జ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి ప్రాపంచిక విషయములతో చేరితే జీవాత్మ, పరమాత్మ వైపు తిరిగితే తన స్వస్వరూపము అయిన ఆత్మ స్వరూపము. ఈ జీవాత్మకు కామము, క్రోధము ఒక పొరవలె ఏర్పడి కప్పి ఉంచుతాయి. 

ఎలాగంటే….

 అద్ధం ఉంది దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనపడదు. ఆ మురికిని తుడిచి వేస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది. అలాగే నిప్పు ఉంది, పొగ రావడం మొదలయితే అగ్ని కనిపించదు. ఊదితే మండుతుంది అప్పుడు పొగ ఉండదు. ఈ కామము క్రోధము అనే పొరలు మనకు మనం సృష్టించుకున్నవేకానీ ఎక్కడి నుండి రావు. ఈ కామము క్రోధము అనే పొగ, మురికి పోగానే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తుడవడమే సత్సాంగత్యము, నిష్కామ కర్మ భావన లేకుండా కర్మలు ఆచరించడం. 

జ్ఞానము సంపాదించడం, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం. దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగి పోతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. పొగతో కప్పబడి నప్పుడు అగ్నికి గానీ, మురికితో కప్పబడినప్పుడు అద్దానికి కానీ, మాచితో కప్పబడినప్పుడు శిశువుకు గానీ ఎటువంటి హానీ జరగదు. అవి తమ తమ స్వస్వరూపాలతోనే ఉంటాయి. కేవలం పొగ, మురికి మాత్రమే వాటిని కప్పి ఉంచుతుంది. ఆ మురికి తీసేస్తే వాటి నిజమైన స్వరూపాలు ప్రకటితమౌతాయి. దీని వలన మనకు తేలిందేమిటంటే మనం ఆనంద స్వరూపులము. మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడు మనతోనే ఉంటుంది. కాని మనం కామము, కోరికలు, అవి తీరకపోతే కోపము అనే వాటితో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము. అవి తీసేస్తే మరలా ఆనంద స్వరూపులము అవుతాము. 

మనం అందరం శివస్వరూపులము శివ అంటే ఆనందము. అంటే మనం అందరం ఆనంద స్వరూపులము. అని తెలుసుకుంటే మనకు మనం మసి పూసుకోము. చాలా మంది నా జీవితం ఇంతే నేనింతే నాకు సుఖం లేదు ఈ జీవితానికి సుఖం లేదు అని అనుకుంటూ తమలో తాము బాధపడుతుంటారు. అది తప్పు, అందరూ ఆనంద స్వరూపులే, మనం ఆ ఆనందాన్ని చేచేతులా నాశనం చేసుకొని ఏడుస్తున్నాము అంతే. కాబట్టి ఆ పొగను మురికిని తొలగిస్తే నిత్యం ఆనందంగా ఉంటాము.

పోనీ ఇదేమన్నా కష్టమా అంటే అదీ లేదు. కాస్త విసిరితే పొగపోయి మంట వస్తుంది. కాస్త నీటిలో తడిపి తుడిస్తే అద్దం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. వైద్యులు మావి తొలగించి శిశువును బయటకు తీస్తారు. ఇవన్నీ దైవయత్నాలు కాదు, పురుష ప్రయత్నాలు, ఈ కామము క్రోధమును తొలగించుకోడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి కానీ నా ఖర్మ ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు. సోమరితనం పనికి రాదు. కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామ క్రోధములను జాయించడం అంత కష్టమేమీ కాదు అని భగవానుడు మనకు భరోసా ఇస్తున్నాడు.

కామము మానవునిలో ఉన్న ఆలోచనా శక్తిని, వివేచనా శక్తిని తగ్గిస్తుంది, అంధకారంలో పడేస్తుంది. అందుకే కామాంధుడు అని కూడా మనం అంటూ ఉంటాము. కామంతో కళ్లు మూసుకుపోయినవాడు. ఇక్కడ కామము అంటే కేవలం స్త్రీవాంఛ అనే అర్థంలో వాడినా, కామము అంటే కోరిక అని అర్ధం చేసుకోవాలి. కామము అంటే మనలో ఉన్న తీరని కోరికలు అని అర్థం.

ఈ శ్లోకంలో అగ్ని, అద్దము, శిశువు అనే మూడు ఉదాహరణలు చెప్పాడు పరమాత్మ, ఈ మూడు ఉదాహరణలు కూడా చాలా ముఖ్యమైనవి. అగ్నినుండి పొగ వస్తుంటే, ఊదితే పొగ పోయి అగ్ని మండుతుంది. అలాగే కొన్ని కోరికలు ఉఫ్మని ఊదితే చాలు ఎగిరిపోతాయి. ఎక్కువ శ్రమపడనక్కరలేదు. కాని మరి కొన్ని కోరికలు ఉంటాయి. చాలా బలంగా ఉంటాయి. అవి అద్దానికి పట్టిన మురికిలాంటివి. అద్దానికి పట్టిన మురికిని బట్టతీసుకొని నీటిలో తడిపి అద్దం మీద రుద్దాలి. అప్పటికీ పోకపోతే డిటర్జెంట్ తో క్లీన్ చేయాలి. అంటే కొంత శ్రమతో కూడిన పని. అలాగే మరి కొన్ని కోరికలు చాలా బలంగా ఉండి, ఎప్పటికీ తీరవు. ఎంతో శ్రమపడితేనే గానీ ఆ కోరికల ప్రభావం నుండి బయట పడలేము. ఆ కోరికల ప్రభావంనుండి బయట పడటానికి కొంత కాలము వేచి ఉండాలి. ఓపికగా ఉండాలి. ఎలాగంటే శిశువుకు కప్పిన మాయను వెంటనే తీసివేయలేము. తొమ్మిది నెలలు నిండి శిశువు బయటకు వస్తేనే గానీ, ఆ మాయను తీసివేయలేము. అలాగే కొన్ని కోరికలు. కాలక్రమేణా పోవలసిందేకానీ, మన ప్రయత్నం వలన పోవు, కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పిఉంచిన ఈ కామాన్ని ముందు తొలగించుకోవాలి.

◆ వెంకటేష్ పువ్వాడ