కురుమూర్తి స్వామి ఆలయం
కురుమూర్తి స్వామి ఆలయం
మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు ప్రజల ఇలవేల్పు దైవంగా కురుమూర్తిస్వామిని ఇష్టదైవంగా ప్రజలు కొలుస్తారు.రాష్ట్రంలోని అతి పురాతన దేవాలయాలలో శ్రీ కురుమూర్తిక్షేత్రం ఒకటి. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం కొండగుహలలో కొలవుదీరిన స్వామికి ఏడెనిమిది వందల సంవత్సరాలనుండి ముక్కర వంశరాజులు అర్చించి, పూజించి తరించారు. నిత్యాదూప, దీప నైవ్యేదాలు సమకూర్చి ఏడుకొండలలో కొలవైన కురుమూర్తి శ్రీనివాసుని సాక్ష్కాత్తు తిరుమల వెంకటేశ్వరుడు క్షేత్రం. ఈ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలక మండలి, అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
పేదల తిరుపతిగా కురుమూర్తి
పేదల తిరుపతిగా పాలమూరుజిల్లాలో కురుమూర్తి స్వామి మొక్కులందుకుంటున్నారు. పాలమూరు జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య వెలసిన స్వయంబువంపై లక్ష్మి సమేతంగా వెలిశారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది. రాజుల పాలనలో ఆలయాన్ని అబివృద్దిలోకి వచ్చింది. తిరుపతి కురుమతిగా పేరొందుతూ పేదల తిరుపతిగా తెలంగాణ తిరుపతిగా స్వామి మొక్కులందుకుంటున్నారు. తిరుపతికి ఒకే దేవుడని ఆ వెంకటేశ్వరుడే నేడు కురుమూర్తిలో వెలిశాడని ఆలయ చరిత్ర చెబుతుంది. తిరుపతిలో వెంకటేశ్వరస్వామి ఏడు కొండల మధ్య వెలిస్తే ఇక్కడ కూడా ఏడు కొండల మధ్య స్వామి కొలువయ్యారు. పూర్వం కురుమూర్తికి కురుపతి అనే పేరు కూడా ఉన్నట్లు ఆలయ చరిత్ర బట్టి తెలుస్తోంది. తిరుపతి క్షేత్రం పర్వతపుత్రుడై ఆనందగిరిపై శ్రీనివాసుడు వెలియగా, ఇక్కడ కురుమూర్తి పర్వతమున అనంతగిరిలోని ఒక భాగమేనని అక్కడ వెలిసిన స్వామివారే ఇక్కడ వెలిశాడని ఈ క్షేత్ర స్థలపురాణాలను బట్టి తెలుస్తోంది. స్వామి వారి మూర్తి విగ్రహంలో కూడా తిరుపతి వెంకటేశ్వరస్వామిని పోలిన భంగిమలు ఉన్నాయి. తిరుమల ఎక్కేటప్పుడు మొదట శ్రీపాదాలు ఉన్నట్లే కురుమతిలో కూడా శ్రీ స్వామి కొండపైకి ఎక్కేటప్పుడు పాదాలు ఉన్నాయి.
తిరుపతి వైష్ణవులే మూలస్తంబాలైన అళ్వారాదుల విగ్రహాలు ఉన్నాయి. వైష్ణవ సాంప్రదాయంలో ఇక్కడ కూడా అళ్వారాదుల శరీర భంగిమలు ఉన్నాయి. ఆలయాన్ని అబివృద్దిలోకి తెచ్చిన సంస్ధానాదీశులే. స్వామి వారి ఆలయాన్ని ముక్కరవంశస్ధులే నేటికి ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. దేవాదాయశాఖ ఆధీనంలోకి ఆలయం వెళ్ళినా వారు నేటికి ఆలయ అభివృద్ధిపై సమీక్షలు చేస్తున్నారు. ముక్కరవంశ రాజులు చేయించిన స్వామి ఆభరణాలే స్వామివారికి బ్రహ్మోత్సవాల సమయంలో అలంకరిస్తారు. స్వామి వారి ఆలయంలో 1350 ప్రాంతంలో నిర్మాణం జరిగినట్లు ఆధారాల బట్టి తెలుస్తోంది. శ్రీరాంభూపాల్ పూర్వమే ఆలయం నిర్మించినట్లు తెలుస్తోంది. నేటికి ముక్కరవంశంలోని శ్రీరాం భూపాల్ ఆలయ అభివృద్దిపై సమీక్ష చేస్తూ ఆలయ అభివృద్దికి పాటుపడుతున్నారు. ఆదివారం స్వామి వారి ఉద్దాలను వడ్డేమాన్ గ్రామం నుంచి స్వామి వారి ఉద్దాలను కురుమూర్తి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువస్తారు. ప్రత్యేకించి ఆవుచర్మంతో తయారు చేసిన స్వామివారి పాదాలను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఈ కురుమూర్తి జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది.
స్థల పురాణం
కుబేరుడి అప్పు తీర్చలేక పద్మావతి సమేతంగా తిరుమల వీడి కృష్ణాతీరం చేరిన శ్రీ వేంకటేశ్వరుడు నదిలో సేద తీరిన అనంతరం పాదాలు కంది పోకుండా కృష్ణమ్మ పాదుకలు బహుకరించిందని, ఈ పాదుకలనే ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని చరిత్రాత్మక కథనం ప్రచారంలో ఉంది. నాడు శ్రీ వేంకటేశ్వరుడు సతీసమేతంగా కృష్ణానదిలో స్నానమాడిన ప్రదేశం నేడు ఆత్మకూరు ప్రదేశంలొ గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందింది.
బ్రహ్మోత్సవాలు
స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జర్గుతాయి. వీటిలో ఉద్దాల ఉత్సవం అంటే పాదుకలను తయారు చేయడం ప్రధాన ఘట్టం. రాయలసీమ నుంచి తెచ్చిన ఆవుచర్మంతో వడ్డేమాన్ గ్రామంలో చర్మకారులు వారంరోజులు శ్రమించి పాదుకలను తయారుచేస్తారు. ఉత్సవం రోజున పాదుకలను ఆంజనేయస్వామి ఆలయం దగ్గర పూజిస్తారు. కొండ దిగువన పాదుకలకు స్వాగతం పలికి కాంచనగుహలోని కురుమూర్తి సన్నిధికి చేర్చి ఆ తర్వాత ఉద్దాల మండపంలో అలంకరిస్తారు. మండపంలో ఉంచిన పాదుకలతో తల, వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. కేవలం ఈ ఉద్దాల ఉత్సవం రోజు లక్షల మంది హాజరవుతారని ఇందుకు గాను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ బందోస్తు నిర్వహిస్తారు.
కురుముర్తికి తిరుపతికి పోలికలు
తిరుపతి లాగేనే ఇక్కడా విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు.
తిరుపతి లాగానే ఇక్కడ కూడా ఏడు కొండల మద్య వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు.
తిరుపతిలాగానే ఇక్కడా స్వామి నిలుచున్న భంగిమలో ఉన్నాడు.
తిరుమలకు మెట్లపై వెళ్ళేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి.
కురుమూర్తి దర్శనానికి వెళ్తున్నప్పుడు మోకాళ్ళ గుండు ఉంది.
శేషశైలంలో స్వామి వారికి అలిపిరి మండపంలాగే ఇక్కడ ఉద్దాల మండపం ఉంది.
జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరవచ్చు. కురుమూర్తి రైల్వేస్టేషన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. 7వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న కొత్తకోట నుంచి కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.