Read more!

భీష్మ ఏకాదశి వైశిష్ట్యం!!

 

భీష్మ ఏకాదశి వైశిష్ట్యం!!

మహాభారతం ఒక గొప్ప గ్రంథం. అందులో ఎందరో ఉద్దండులు ఉంటారు. వారిలో కూడా ఎంతో గొప్పవారు ఉన్నారు. ముఖ్యంగా మహాభారతం మొత్తం వెతికితే ఒక గొప్ప యోధుడు మనకు కనబడతాడు. తనకు తాను మరణానికి ఆహ్వానం పలికి తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్నాడు. ఆయనే భీష్ముడు. తను పెళ్లి చేసుకోనని, తనకు వంశం ఉండదు కాబట్టి రాజ్యం తనకు సంక్రమించదు అని ప్రతిజ్ఞ చేసి తండ్రికి రెండవ పెళ్లి చేసిన ఘనుడు భీష్ముడు. ఆయన అలా భీష్మించడం వల్ల ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది. 

ధర్మంలోనూ, ధైర్య సాహసాలలోనూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఇలా అన్ని రకాలుగాకూడా భీష్ముడంతటి ఉత్తముడు మహాభారతం అంతా వెతికినా కనిపించడు. చివరివరకు కౌరవుల పక్షాన నిలబడతాననే మాట మీద కురుక్షేత్ర యుద్ధంలో కూడా కౌరవుల వైపు నిలబడిన ఈ యోధుడు తన మరణాన్ని తనే ఆహ్వానించి, దక్షిణాయణంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వరకు అంపశయ్య మీదనే గడుపుతాడు.  మాఘ మాసంలో ఏకాదశి నాడు ఈయన తన చివరి శ్వాస వదిలాడు. అయితే భీష్ముడు ఇలా అంపశయ్య మీద ఉన్నప్పుడు మాఘశుద్ధ అష్టమి నుండి ఏకాదశి రోజు వరకు అంటే భీష్ముడు మరణించేవరకు కూడా అసలు ఈయనలో ఎలాంటి భయమూ, పిరికితనం, బాధ వంటి ఛాయలు లేనే లేవు. 

ఈయన అపారమైన శాస్త్రవిజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకున్నాడు. భీష్మునిలోని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయనను ఎంతగానో ప్రశంసించాడు. ఫలితంగానే మహాభారతం అంత గమనిస్తే కృష్ణుడు భీష్ముడి ఎంతో ప్రాముఖ్యతను, మరెంతో గౌరవాన్ని ఇచ్చాడు. భీష్ముడు  అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తూ ధర్మదేవత కొడుకు అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు. 

వాటిలో వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు.  వీటన్నింటినీ కూడా భీష్ముడు తన జీవితకాలంలో తను స్వయంగా ఆచరించినవి కొన్నీ, తను శాస్త్రాలలో ఎంతో లోతుగా అధ్యయనం  చేసినవి కొన్నీ, విలువల ద్వారా తెలుసుకున్నవి కొన్ని ఇలా అన్నీ కూడా ధర్మరాజుకు ఎంతో వివరించి, కొన్నింటిని కథల రూపంలోనూ తెలియజేశాడు.

ఆ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూ ఉండేవారు. కృష్ణతత్వాన్నీ బాగా అర్థం చేసుకున్నవాడు కాబట్టే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు భీష్ముడు. రాజసూయయాగ సమయంలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలా అని సందేహం కలిగినప్పుడు అక్కడున్నవారిలో దీనికి అర్హుడు ఒక్క కృష్ణుడే అని నిర్ద్వంద్వంగా అందరికీ తెలియజేశాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరిగెత్తుకొస్తున్నా ఆయనను ఎదిరించక ఆయన చెతిలో మరణించే భాగ్యం కోసం ఎదురుచూశాడు భీష్ముడు.

విష్ణుసహస్ర నామాల అద్భుతం!!

అన్నిటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించినా వాటిలో ఎంతో గొప్పగా నిలిచిపోయినవి మాత్రం  విష్ణుసహస్రనామాలు. ప్రతి శుభకార్యంలోనూ, ప్రతి పూజ లోనూ, దేవుడిని స్తుతించే ఎన్నో సందర్భాలలో అందరూ తప్పకుండా విష్ణుసహస్రనామాలను చెబుతూనే ఉంటారు.

ముఖ్యంగా చనిపోయినవాళ్ళ కర్మలు, సంవత్సరీకాలు జరిగినపుడు ఆ కార్యక్రమ సమక్షంలో విష్ణుసహస్రనామాలు చెప్పడం ఒకపద్దతిగా వస్తోంది. ఈ విష్ణుసహస్ర నామాలు   ఈనాటికీ ప్రజల నాలుకల మీద నానుతూనే ఉన్నయి.

పితృ తర్పణాలు!!

భీష్మాష్టమి రోజున భీష్ముడిని తలచుకుంటూ ఆయనకు పితృతర్పణం వధులుతారు చాలామంది. కారణం ఆయన భీష్మపితామహుడిగా పేరొందాడు. ఆయనను అందరూ తండ్రిగా భావించి తర్పణాలు వదలడం వలన ఎన్నో పాపాలు నశిస్తాయని చెబుతారు. అంతేకాదు పిల్లలు లేని వారు ఇలా పిండప్రదానాలు జరిపిస్తే సంతానం కలుగుతుందని కూడా విశ్వాసం. ఆ గొప్ప వీరుడు తృప్తి చెంది అనుకున్నావు నెరవేరేలా కరుణిస్తాడని నమ్మకం.  విష్ణుసహస్రనామ పారాయణం, విష్ణుమూర్తి పూజ, దానాలు, జపాలు వంటివి చేస్తే ఎంతో మంచిది.

◆ వెంకటేష్ పువ్వాడ