Read more!

శ్రీ కాళహస్తి (Sri Kalahasti)

 

శ్రీ కాళహస్తి

(Sri Kalahasti)

 

శ్రీ కాళహస్తి దేవాలయం దక్షిణ కైలాసంగా పేరుపొందింది. ఒకప్పుడు, తిరుమలకంటే ప్రఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తి దేవాలయం తిరుపతికి సమీపంలోనే ఉంది. ఇక్కడ మహాశివుడు వాయులింగంగా ఉద్భవించాడు.

శ్రీకాళహస్తి క్షేత్రం గురించిన గాధ ఇలా వుంది. లింగాకారంలో ఇక్కడ వెలసిన పరమేశ్వరుడిని ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు అర్చిస్తుండేవి. సాలెపురుగు శివునిపై భక్తితో నిత్యం గూడు అల్లేది. సర్పం మణులతో, ఏనుగు బిల్వపత్రాలతో అర్చించేవి. సాలె పురుగు భక్తిని పరీక్షించగోరిన పరమేశ్వరుడు, అది అల్లిన అందమైన గూటిని అగ్నికీలలతో దగ్ధం చేయగా, తిరిగి గూడు అల్లేది. చివరికి విసిగి అగ్నితో పోరాటానికి పూనుకుని ప్రాణత్యాగం చేసింది. పరమేశ్వరుడు ఆ సాలెపురుగుకు మోక్షం ప్రసాదించాడు.

ఇక పాము నిత్యం మణులతో శివుడిని పూజిస్తుండగా, ఏనుగు వచ్చి ఆ మణులు తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిల్వ పత్రాదులతో పూజించేది. మర్నాడు వచ్చిన సర్పానికి మణులకు బదులు బిల్వపత్రాలు కనిపించేవి. ఆ పాము పత్రాలు తొలగించి నిత్యం మణులతో పూజించేది. ప్రతిరోజూ మణులు తొలగించి ఉండడంతో ఆగ్రహించిన పాము దీనికి కారకులెవరో తెలుసుకోగోరి ఒకరోజు ఉదయం పొంచి ఉండగా, ఏనుగు వచ్చి ఆ మణులు తొలగించి పత్రాలతో అర్చిస్తున్న సమయంలో పత్రాలనుంచి తొండం ద్వారా ఏనుగు కుంభస్థలాన్ని చేరి పీడించింది. సర్పం పెట్టిన బాధకు తాళలేని ఏనుగు కొండకు కుంభస్థలాన్ని మోదుకుని మరణించింది.

కుంభస్థలంలో ఉన్న సర్పరాజం కూడా అసువులు బాసింది.

ఏనుగు, సర్పం తన మీద చూపిన భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు వాటికీ ముక్తి ప్రసాదించాడు. అంతే కాకుండా సాలీడు, పాము, ఏనుగుల పేరు మీదుగా ఈ క్షేత్రం ప్రాచుర్యం పొందగలదని వరమిచ్చాడు. ఆ వరం ప్రకారం శ్రీ (సాలె) కాళ (పాము) హస్తి (ఏనుగు) అని ఈ క్షేత్రానికి పేరొచ్చింది.

అయితే సాలెపురుగు, ఏనుగు శాపవశాన భూలోకంలో ఆ రూపంలో జన్మించి, శివుని అర్చించి శివసాయుజ్యం పొంది శాపం ముక్తి పొందాయనే గాథ వుంది.

పరమేశ్వరుడిక్కడ కృతయుగంలో వాయురూపంలో, త్రేతాయుగంలో స్వర్ణరూపంలో. ద్వాపరయుగంలో రజత రూపంలో కలియుగంలో శ్వేతశిలారూపంలో కొలువైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలయం గురించి మహాభక్తుడైన భక్త కన్నప్ప గురించి మరో గాథ వుంది.

పూర్వం తిన్నడనే కిరాతకుడుండేవాడు. అతడు మహా శివభక్తుడు. నిత్యం శివుని పూజించేవాడు. పరమేశ్వరుడు అతని భక్తిని పరీక్షిచతలచాడు. ఒకనాడు తిన్నడు శివుని సేవించడానికి వచ్చు సమయమున శివుని లింగమునకు రెండు కళ్ళు ఏర్పడి, ఒక కన్ను నుంచి రక్తం స్రవించసాగింది. మూఢభక్తితో తిన్నడు తనకంటిని బాణంతో పెకలించి శివుని లింగానికి అమర్చాడు. ఇంతలో రెండవకంటినికూడా పరమేశ్వరుడికి అర్పించదలచాడు. దీనితో ప్రసన్నుడైన శివుడు తిన్నడికి ప్రత్యక్షమై అతడికి ముక్తిని ప్రసాదించాడు. తిన్నడు శివుని అర్చించిన ప్రదేశమని స్థానికుల కథనం. ఇక్కడ పార్వతీమాత జ్ఞాన ప్రసూనాంబగా వెలసి భక్తుల పూజలందుకుంటున్నది. జ్ఞాన ప్రసూనాంబ మహా మహిమాన్వితమైనది.