Read more!

ధ్రువుడు ద్రువనక్షత్రంగా ఎలా మారాడు? (Dhruva and Dhruva Nakshatra)

 

ధ్రువుడు ద్రువనక్షత్రంగా ఎలా మారాడు?

(Dhruva and Dhruva Nakshatra)

 

ధ్రువుని తండ్రి ఉత్తాన మహారాజు. తల్లి సునీతి. ధ్రువుని తండ్రికి మరో భార్య కూడా ఉంది.అలా ద్రువునికి ఉత్తముడు అనే మారుటి తమ్ముడు ఉన్నాడు.

 

రాజుకు చిన్న భార్య మీదే ప్రేమ. అది అలుసుగా తీసుకుని రెండో భార్య సునీతిని, ఆమె కొడుకుని ఎప్పుడూ ఏదో నెపాన అవమానిస్తూ ఉండేది. ముఖ్యంగా పెద్ద కొడుకు కనుక ద్రువునికి మహారాజు రాజ్యాభిషేకం చేస్తాడేమోనని లోలోపల భయపడుతూ ఉండేది. వాళ్ళను దూరంగా ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నించేది. రాజు కూడా మొదటి భార్య, ఆమెకు పుట్టిన కొడుకు పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించేవాడు.

 

సునీతికి ఎంత బాధగా, అవమానకరంగా ఉన్నా సర్దుకుపోయేది. కానీ పసివాడైన ధ్రువుని మనసు అనేకసార్లు గాయపడేది. ఒక్కోసారి చాలా దుఃఖించేవాడు.

 

ఒక సందర్భంలో తండ్రి ఉత్తముని ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తున్నాడు. ఆ సన్నివేశం ద్రువునికి మహా పరవశం కలిగించింది. తనను కూడా తండ్రి అలా గారాబం చేయాలనే కోరిక కలిగింది. అది చాలా సహజమైన కోరిక. చాలా చిన్న కోరిక. తండ్రి దగ్గరికి వెళ్ళి, తనను కూడా మరో తోడమీద కూర్చోబెట్టుకోమని ఆశగా చేతులు చాచాడు.

 

రాజు ధ్రువుని ఉనికిని కూడా పట్టించుకోనట్లు చిన్న కొడుకుతో మురిపాలు సాగిస్తున్నాడు. అక్కడే ఉన్న అతని చిన్న భార్య "మేమున్న చోటుకు రావొద్దని నీకు చెప్పాను కదా.. నా మాట లక్ష్యం లేదా? ఎందుకొచ్చావు? నిన్ను ముద్దు చేయాలా? ఉత్తముడితో సమానం అనుకుంటున్నావా ఏం? నువ్వేమైనా నా కొడుకువా? నాకు గనుక పుట్టి ఉంటే అలాగే ప్రేమగా, లాలనగా చూసేవాళ్ళం.. ఫో.. వెళ్ళు, ఇక్కణ్ణుంచి తక్షణం వెళ్ళు.. మీ అమ్మలా పూజలూ పునస్కారాలూ చేసుకుంటూ కాలక్షేపం చెయ్యి.. ఎప్పటికైనా దేవుడు కరుణిస్తే తండ్రి ఒడిలో ఆడుకుందువుగాని.. వెళ్ళు.. మళ్ళీ ఇటువైపు రాకు..'' అంటూ చీత్కరించింది.

 

ధ్రువునికి చాలా బాధేసింది. ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. జరిగిన సంగతి చెప్పాడు. సునీతి ఎంత మంచిదో అంత నెమ్మదస్తురాలు. ఆమెకి రాజును గానీ, అతని రెండో భార్యను గానీ ఎదిరించి పోరాడే శక్తి లేదు. ''ఇదంతా విధి లిఖితం బాబూ..నువ్వు బాధపడకు.. దేవుణ్ణి ప్రార్ధించడం ఒక్కటే మనం చేయాల్సింది.. అందులోనే మనకు సుఖం శాంతి లభిస్తాయి. విష్ణుమూర్తిని ఆరాధించు బాబూ.. ఇతర విషయాలన్నీ మర్చిపోయి, దేవుడి నామాన్నే స్మరిస్తూ ఉండు..'' అని కొడుక్కు నచ్చచెప్పింది.

 

తల్లి మాటలు ధ్రువునిమీద బాగానే పనిచేశాయి. అయితే తల్లి ఆశించినట్లు అక్కడే కూర్చుని ప్రార్ధన చేయలేదు. ఏకంగా అడివికి వెళ్ళాడు. మహా మహా రుషుల్లా ఏకాగ్ర దీక్షతో తపస్సు చేశాడు. ఆరేళ్ళ పసివాడు అంత ఘోర తపస్సు చేయడం అంతకు ముందెన్నడూ లేదు. అది చూసిన మహర్షులు, దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. ఆనందించారు. ఆపైన ఆశీర్వదించారు.

 

ధ్రువుని తపస్సు ఫలించింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ''నీ అపూర్వ దీక్షకు సంతోషించాను.. ఏం కావాలో కోరుకో బాలకా'' అన్నాడు.

 

ఇప్పుడు ధ్రువుడికి తండ్రి ప్రేమ చాలా అల్ప విషయంగా కనిపించింది. ''దేవా, నా భక్తిని శాశ్వతం చెయ్యి.. నేను నీ భక్తుడిగా నిలిచిపోవాలి'' అన్నాడు. విష్ణుమూర్తి నవ్వుతూ తల పంకించి, తథాస్తు అని అంతర్ధానమయ్యాడు.

 

ధ్రువుడు రాజభవనానికి తిరిగివచ్చాడు. అప్పటివరకూ కొడుకు యోగక్షేమాలు తెలీక బాధపడుతున్న సునీతి ధృవుని చూసి అనిర్వచనీయమైన అనుభూతికి లోనయింది. జరిగిన సంగతి విని మరీ సంతోషించింది. విష్ణుమూర్తి అనుగ్రహంతో రాజు, అతని రెండో భార్యల్లో ఊహించని మార్పు వచ్చింది. అనంతర కాలంలో వారే పట్టుబట్టి ధ్రువుని రాజును చేశారు.

 

విష్ణుమూర్తి వరం ప్రభావంతో ధ్రువుడు మరణానంతరం ధ్రువనక్షత్రంగా మారాడు. ఆకాశంలో ఇప్పటికీ ధ్రువనక్షత్రం కనిపిస్తుంది.