Read more!

రామాయణంలో కైకేయి (Kaikeyi and Mandhara in Ramayan)

 

రామాయణంలో కైకేయి

(Kaikeyi and Mandhara in Ramayan)

 

మన తోటివారు ఎవరైనా అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తుంటే "కైకేయి", “మంధర"లతో పోల్చడం పరిపాటి. అలా ఎందుకు పోలుస్తారో తెలియాలంటే, మనకు ఆ రెండు పాత్రల స్వభావం ఏమిటో, ఎలా వ్యవహరించాయో తెలియాలి.

దశరథుని మూడవ భార్య కైకేయి. కైకేయి చెలికత్తె మంధర. వాళ్ళ ప్రస్తావన పెద్దగా ఏమీ ఉండదు. మరి వాళ్ళని గడసరులుగా ఎప్పుడు నిర్ధారించారు అంటే...

సీతారాముల కల్యాణం తర్వాత దశరథ మహారాజు పెద్ద కొడుకైన శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. రాముడికి రాజ్యభారం అప్పగించి, తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు మహారాజు. అందుగ్గానూ శుభ ముహూర్తం నిశ్చయించారు.

అయోధ్యాపురం వీధివీధినా మావిడాకుల మంగళ తోరణాలు, తీర్చిదిద్దిన సుమ మాలలతో చూడముచ్చటగా ఉంది. ఎక్కడికక్కడ నృత్యగానాలు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా జయజయధ్వానాలు మారుమోగుతున్నాయి. రాజభవనంలో వేడుక అంటే ఎవరికీ వారికి తమ ఇంట్లో వేడుక మాదిరిగానే ఉంది.

కైకేయి దగ్గర పనిచేసే మంధరకు ఆమె పట్ల మమతానురాగాలు ఉన్నాయి. రాజ్యం కైకేయి కొడుక్కు కాకుండా కౌసల్య కొడుకైన శ్రీరాముడికి దక్కడం ఆమెకి నచ్చలేదు. బాధనిపించింది.

మంధర, కైకేయి దగ్గరికి వెళ్ళి "అమ్మా, కైకమ్మా, నేకేం దిగులుగా లేదా తల్లీ?” అంది.

“అదేం ప్రశ్న మంధరా? ఇంత సంతోషకరమైన వాతావరణంలో, ప్రతి ఒక్కరూ కోలాహలంగా ఉన్న తరుణంలో దిగులు, దుఃఖం అంటావేంటి?” అంది ఆశ్చర్యంగా.

“కానీ, పట్టాభిషేకం జరుగుతోంది శ్రీరాముడికి కైకమ్మా"

“ఏమిటో మంధరా, నీ మనసు సరిగా పనిచేస్తున్నట్టు లేదు.. శ్రీరాముడికి పట్టాభిషేకమే చేస్తున్నారు కానీ శిక్ష విధించడం లేదుగా..” అంది.

“నువ్వు ఇంత అమాయకురాలివేంటి కైకమ్మా?”

“నీ ఉద్దేశం ఏమిటో సూటిగా చెప్పు మంధరా.. రాముడంటే నాకు చాలా ఇష్టం. అతనికి పట్టాభిషేకం అంటే సంతోషించే విషయమే కదా..”

"సవతి కొడుక్కి పట్టాభిషేకం అంటే సంతోషిస్తున్నావా? నీ కొడుక్కి రాజ్యం దక్కడం లేదని బాధగా లేదా?” అంది మంధర నిష్ఠూరంగా.

“అదేంటి మంధరా, పెద్ద కొడుకు రాముడు ఉండగా, నా కొడుక్కి రాజ్యాన్ని ఎలా అప్పగిస్తారు? పైగా నాకు అందరూ సమానమే"

“ఇంత అమాయకంగా ఉంటే, రోజులు ఎలా గడుస్తాయమ్మా? నాకే బాధగా, ఉంది, నీకు ఇంకెంత ఉండాలి? నీ కొడుకూ, నువ్వు ఎంత అన్యాయం అయిపోతారో ఒకసారి ఆలోచించు"

“అంటే, నా కొడుకు ఎప్పటికీ రాజు కాడా?”

“ఇప్పుడు గనుక అవకాశం వదులుకుంటే, ఎప్పటికీ కాడు"

“అంతేనంటావా?”

“ఖచ్చితంగా అంతే.. శ్రీరాముడినే రాజుగా కొలుస్తారు తప్ప, నీ కొడుకును కాదు.. కౌసల్యే రాజమాత అవుతుంది తప్ప, సవతి తల్లి అయిన నువ్వు కాదు"

కైకేయి ఆశ్చర్యంగా చూడసాగింది. మంధర మరింత హెచ్చరిస్తూ, “నీ కొడుక్కి గనుక పట్టాభిషేకం జరక్కపోతే, నీకు ఇక్కడే కాదు, మీ పుట్టింట్లో కూడా మర్యాద, గౌరవం దక్కవు.. అందరూ చులకనగా చూస్తారు, బాగా ఆలోచించుకో" అంది.

కైకేయికి మనసంతా భారమైంది. 'తాను ఇలా ఆలోచించలేదే.. నిజంగానే తెలివితక్కువగా వ్యవహరించాను అనుకుంది. మంధరకు తనమీద ప్రేమ ఉండబట్టి జరగబోయే పరిణామాన్ని తెలియచెప్పింది. బహుశా దేవుడే ఆమెకి ఆ బుద్ధి పుట్టించాడేమో.. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఈ పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలి' అనుకుంది.

దశరథుడు తనకు గతంలో రెండు వరాలు ఇచ్చాడు. తానెప్పుడూ వాటిని వినియోగించుకోలేదు. ఇప్పుడు కోరుకుంటే సరి.. ఆయన ఎటూ మాట తప్పుడు.. కనుక వరాలు ఇస్తాడు, తన కోరిక నెరవేరుతుంది.. అనుకుంది.

వెంటనే మహారాజు దశరథునికి కబురు పెట్టింది. దశరథుడు అంతఃపురానికి వచ్చాడు. తనకు ఇచ్చిన వరాలను గుర్తు చేసింది. భరతుడికి పట్టాభిషేకం మొదటి కోరిక, శ్రీరాముని అరణ్యవాసానికి పంపడం రెండో కోరిక. పెద్ద కొడుకు ఉండగా, భరతునికి రాజ్యాన్ని అప్పగించడం ఎలా అనే సమస్య తలెత్తకుండా కైకేయి అలా కోరింది.

అదీ, కైకేయి, మంధరల ప్రస్తావన.