Read more!

జ్ఞానప్రదాత హాయగ్రీవ జయంతి!

 

జ్ఞానప్రదాత హాయగ్రీవ జయంతి!

శ్రావణమాసం పూర్ణిమను రాఖీ పూర్ణిమగా ఎంతో గొప్పగా జరుపుకుంటారు. అదే రోజున మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదే హయగ్రీవ జయంతి.

అసలు ఎవరు ఈ హాయగ్రీవుడు!!

హాయగ్రీవుడు అంటే గుర్రం తలను కలిగి ఉన్నవాడు అని అర్థం. అంటే ఈ పేరు కలిగిన రూపానికి తల గుర్రానికి ఉన్నట్టు ఉంటుంది. పూర్వం గుర్రం తలతో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒక వారం ఉండేది. తనలాగే గుర్రం తలా ఉండే వ్యక్తి చేతిలోనే తనకు మరణం కలగాలి, లేదంటే తనకు మరణం ఉండకూడదు అని. వాడు రాక్షసుడు కాబట్టి వాడిని సంహరించడానికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే నడుం బిగించాడు. అందులో భాగంగా విష్ణుమూర్తి హాయగ్రీవ అవతారాన్ని ఎత్తాడు. ఆ గుర్రపు తల రాక్షసుడిని సంహరించాడు. ఇదీ హాయగ్రీవ అవతారం గురించి, హాయగ్రీవుడు గురించి చాలామంది చెప్పే కథ. అందుకే హాయగ్రీవుడిని శత్రునాశకుడు అని కూడా అంటారు.  ప్రత్యేకత ఏమిటో, ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందామ. హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

హాయగ్రీవుని అవతారం వెనుక మరొక కథనం!!

ఇకపోతే హాయగ్రీవుడిని జ్ఞానప్రదాత అని అంటారు. దాని వెనుక ఉన్న కారణం ఏమిటంటే!! ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారు. ఎంతో గొప్పవి, విలువైనవి అయిన వేదాలు దొంగతనానికి గురయ్యేసరికి దేవతలు, పండితులు, మహర్షులు బాధపడ్డారు. అప్పుడు ఆ వేదాల కోసం విష్ణుమూర్తి హాయగ్రీవ అవతారాన్ని ఎత్తి వేదాలను రక్షించాడు. జ్ఞానానికి, బుద్దికి, పండిత్యానికి, మనిషి జీవన విధానానికి మూలాల వేదాలు. అలాంటి వేదాలను రక్షించాడు కాబట్టి హాయగ్రీవుడిని జ్ఞానప్రదాత అన్నారు. 

అంటే హాయగ్రీవుడిని ఆరాధిస్తే ఒకవైపు జ్ఞానం, మరొకవైపు శత్రుబాధ రెండూ తొలగిపోతాయి.            

 అందరూ హయగ్రీవుడిని విష్ణుమూర్తి అవతారమని చెప్పినప్పటికీ  ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈయన కళ్ళలో సూర్యచంద్రులు, ఈయన శరీరంలో ఎముకలలో దేవతలు, ఈయన పాదాలలో అష్టవసువులు, ఈయన నాలుకలో అగ్ని, ఈయన మాటలలో సత్యం, ఈయన హృదయంలో బ్రహ్మ దేవుడు ఉంటారట. ఈ విధంగా ఈయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. అంటే దీని ద్వారా ఒక విషయం అర్థమవుతోంది. సకల దేవతలూ ఈయనలో ఉన్నారు కాబట్టి ఈయనను ఆరాధిస్తే అందరు దేవుళ్లను ఆరాధించినట్టే అని అభిప్రాయం. 

హాయగ్రీవునిలో ఇంత విశిష్టత ఉంది కాబట్టే కొంతమంది ప్రత్యేకంగా హాయగ్రీవుడిని ఉపాసిస్తారు. ఉపాసన అంటే పూజలు చేసినంత తేలిక కాదు. అందుకే ఎంతో నిష్ఠతో 

హయగ్రీవుడిని ఉపాసిస్తారు కొందరు. ఆయన ఉపాసన చేయలేకపోయిన వాళ్ళు కనీసం హాయగ్రీవుడిని  పూజించడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నించవచ్చు.  హాయగ్రీవ స్తోత్రం, హాయగ్రీవ అష్టోత్తర శతనామావాళి  పఠించవచ్చు.  అది కూడా కుదరకపోతే హాయగ్రీవ మంత్రాన్ని పఠించవచ్చు. 

హాయగ్రీవ మంత్రం:- 

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్|
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||

హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం చాలా ప్రీతి అని చెబుతారు. అన్నీ మనం చేయగలిగినవి, మనకు అందుబాటులో ఉండేవే కాబట్టి హాయగ్రీవ జయంతి రోజు ఆయన్ను అర్చించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి. 

చాలామంది సరస్వతీదేవి కృపతో అక్షరాభ్యాసం చేయిస్తారు. అయితే  కొంతమంది జ్ఞానప్రదాత అయిన హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి, ఆ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు. హాయగ్రీవ జయంతి రోజు హాయగ్రీవుడిని ఆరాధించినవారికి సకల విద్యలూ అబ్బుతాయనీ, అన్ని ఆటంకాలూ తొలగిపోతాయనీ చెబుతారు. ఇక విష్ణుమూర్తే హయగ్రీవుడు కాబట్టి ఆయన లక్ష్మీదేవి భర్త కాబట్టి, ఆయనను ఆరాధించడం వల్ల సిరిసంపదలకు లోటులేకుండా ఉంటుందని పెద్దలు, పండితులు చెబుతారు.

హయగ్రీవుని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది. పిల్లలున్న ఇంట్లో హయగ్రీవుడిని పూజిస్తే  పిల్లలకు విద్యలో ఏ ఆటంకాలు ఉన్నా అవి తొలగిపోయి ఉన్నత విద్యను అందిస్తుంది.

                                       ◆నిశ్శబ్ద.