వీరగురువు గురు తేగ్(తేజ్) బహదూర్!!

 

వీరగురువు గురు తేగ్(తేజ్) బహదూర్!!

సిక్కు మతం ఎంతో చిన్నది. కానీ దానికంటూ ప్రత్యేకముద్ర వేసుకుంది. ఓ గుర్తింపుకు నోచుకుంది.  ఏకేశ్వరోపాసనాన్ని ప్రచారం చేసే ఈ మతం మత సామరస్యత కోణంలో తన స్వరాన్ని వినిపిస్తుంది. గురునానక్ స్థాపించిన ఈ సిక్కు మతానికి కూడా పది మంది గురువులు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఒకో ప్రత్యేకత సంతరించుకున్నవారు. వారిలో తొమ్మిదవ సిక్కు గురువు గురు తేగ్(తేజ్) బహదూర్ ఎంతో ప్రత్యేకమైనవాడు. 

ఆరవ సిక్కు మత గురువు గురు హర గోబింద్ వంశానికి చెందిన గురు తేగ్ బహదూర్ గురువుగా మారడం వెనుక కూడా ఎంతో విచిత్రమైన సంఘటన ఉంది. ఎనిమిదవ గురువైన గురు హార్ క్రిషన్ తన తరువాత సిక్కు మతాన్ని నడిపేందుకు గురువు ఎవరు అనే మీమాంసలో ప్రజలు ఉన్నారనే విషయం తెలుసుకుని తన తరువాత బాబా బకాలా తొమ్మిదవ గురువు అవుతాడని ప్రకటించాడు. అయితే బకాలా అనేది ప్రదేశం పేరు కావడం వల్ల ఆ గురువు ఎవరు అనేది ఎవరికీ అంతుబట్టలేదు.  ఇక గురు తేగ్ బహదూర్ బకాలా ప్రాంతంలో 28 సంవత్సరాల పాటు ధ్యానం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఆయనే తొమ్మదవ గురువు అనే విషయం ఎవరికీ తెలియక అందరూ అయోమయంలో ఉండిపోయారు.

నేనే తొమ్మిదవ గురువు అంటే కాదు నేను తొమ్మిదవ గురువును అని చాలా మంది గురువుల ముసుగేసుకుని చెప్పుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బకాలా లో ఉండే ఒక వ్యాపారి జీవితంలో సమస్యలతో విలవిలాడుతూ ఆ సిక్కు మత గురువుకు మనసులో "నా జీవితం బాగుపడితే ఐదువందల నాణేలు కానుకగా ఇస్తానని" ముక్కుకున్నాడు. అయితే ఈ దొంగ గురువుల మధ్య అసలైన గురువును కనుక్కోవడం ఎలా అని గురువును అని చెప్పుకున్న ప్రతి ఒక్కరికి 2 బంగారు నాణేలు ఇచ్చాడు. అందరూ వాటిని తీసుకున్నారు కానీ ఇతని మొక్కు విషయం ఎవరు చెప్పలేదు అంటే వాళ్ళందరూ డమ్మీ గురువులని అర్థం చేసుకున్నాడు. చివరగా తేగ్ బహదూర్ దగ్గరకు వచ్చి 2 బంగారు నాణేలు ఇవ్వగా ఆయన నవ్వుతూ, నువ్వు మొక్కుకున్నది 500 బంగారు నాణేలు కదా అన్నాడు తేగ్ బహదూర్. అప్పుడు ఆ వ్యాపారి తేగ్ బహదూర్ ఏ తమ తొమ్మిదవ గురువని ఆయన్ను తాను కనుగొన్న విధం గురించి చెప్పాడు. ఇలా తేగ్ బహదూర్ తొమ్మిదవ సిక్కు గురువు అయ్యాడు. 

ఈయన సిక్కు మతాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశాడు. కాశ్మీర్ పండిట్లను ఇస్లాం మతంలోకి మారేందుకు బలవంత పెడుతున్న మొఘల్ పరిపాలకులకు వ్యతిరేక పోరాటం చేశారు. అంతే కాదు ఇస్లాం మతంలోకి మారమంటే  మారను అని తిరస్కారం వ్యక్తం చేసినందుకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో ఢిల్లీ లో బహిరంగంగా అందరూ చూస్తుండగానే తలా నరికివేయబడ్డాడు. 

ఈయన ఎన్నో కావ్యాలు, ద్విపద రచనలు చేసాడు, సిక్కుల మత గ్రంథమైన ఆది గ్రంధ్ లో తేగ్ బహదూర్ రచించిన వెయ్యికి పైగా రచనలకు స్తానం కల్పించారు. 

ఢిల్లీలో రెండు ప్రదేశాలలో ఒకటి గురు తేగ్  బహదూర్ చంపబడ్డ ప్రాంతం, మరొకటి ఆయన అంత్యక్రియలు జరిపిన ప్రాంతం. ఈ రెండు గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్, గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ పేరుతో స్మృతి మందిరాలుగా ఏర్పడ్డాయి. తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలకు సైతం తెగించిన గురు తేగ్ బహదూర్ సిక్కు మతస్తులకు ఎంతో ప్రీతిపాత్రుడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

◆ వెంకటేష్ పువ్వాడ