Read more!

మహిళల కోసం గొప్ప సంపాదనా మార్గాలు!

 

మహిళల కోసం గొప్ప సంపాదనా మార్గాలు!

సొంత సంపాదన ప్రతి మహిళ ఆశ. సొంతంగా డబ్బు సంపాదించుకోవడం, ఆర్థికంగా మెరుగు పడటం. తన అవసరాలకు తను హాయిగా సంతోషంగా, స్వేచ్ఛగా ఖర్చుపెట్టుకోగలగడం ప్రతి మహిళకూ ఎంతో అవసరం కూడా. ప్రతి రూపాయికి ఇంట్లో మగవాళ్ల ముందు, పెద్దవాళ్ళ ముందు చెయ్యి చాపడం మహిళలకు ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా సగటు మధ్యతరగతి మహిళలు ఇంటి ఖర్చులను, అన్ని రకాల ఆర్థిక అవసరాలను చక్కబెడుతూ ఉండటం వల్ల వారి దగ్గర మిగిలేది ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే వారు చేసే చిన్న చిన్న పనుల ద్వారా సంపాదించే డబ్బును కూడా ఇంటి అవసరాలకు ఉపయోగిస్తారు. 

మహిళలు ఇంటి పట్టున ఉంటూ సంపాదించడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి కొన్ని సంపాదనా మార్గాలు ఇవిగో……

యోగా ట్రైనర్!!

దీనికి అనుభవం ఉంటే ఖచ్చితంగా గొప్ప సంపాదనా మార్గం అవుతుంది. కాస్త టెక్నాలజీ తోడైతే ఆన్లైన్ లో యోగా పాఠాలు చెప్పేయొచ్చు. నేటి కాలంలో మనుషులు ఎక్కువ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీటికి యోగ, మెడిటేషన్ అనేది గొప్ప సొల్యూషన్. చాలామంది శారీరకంగా జిమ్ లో కష్టపడటం కంటే మానసికంగా ఫిట్ గా ఉండటానికి యోగ, ధ్యానం గొప్ప పరిష్కార మార్గాలని తెలుసుకున్నారు. యోగాకు ప్రాధాన్యత పెరిగిన నేటి కాలంలో యోగ శిక్షకులుగా ఇంట్లోనే ఉంటూ సంపాదించవచ్చు మహిళలు.

కెరీర్ కౌన్సిలర్స్!!

జీవితం మీద మంచి అవగాహన ఉన్నవారు కెరీర్ కౌన్సిలర్ లుగా మారవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల కోర్స్ లు కూడా అందుబాటులో ఉంటాయి ఇవి. వాటిని పూర్తి చేస్తే కౌన్సిలర్ లు గా కొత్త ఉద్యోగం మొదలుపెట్టేయచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు సరైన అవగాహన లేక సందిగ్ధంలో ఉన్నవారు ఎంతో మంది ఉంటారు. పెద్ద పెద్ద కౌన్సిలర్ల దగ్గరకు వెళ్లలేక ఆలోచనల్లో పడిపోయి ఉంటారు. ఇలాంటి వాళ్లకు మంచి సలహాలు సూచనలు అందిస్తుంటే జీవితంలో తృప్తి కూడా దొరుకుతుంది.

టీచింగ్!!

ఆన్లైన్ లో క్లాసులు తీసుకోవడం ఇప్పటి కాలంలో రొటీన్. ఎక్కడో దూరంగా ఉండి సరైన ఉపాధ్యాయులు దొరకని వారు ట్యూషన్ కోసం ఆన్లైన్ టీచింగ్ ను అప్రోచ్ అవుతారు. కేవలం విద్యార్థులకు మాత్రమే టీచ్ చేయడం టీచింగ్ కాదు. వంట, డాన్సింగ్, మ్యూజిక్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఇలా చాలా రకాల విషయాలు ఆన్లైన్ లో టీచ్ చేయవచ్చు.

బేకరీ ఫుడ్స్!!

కేక్ లు, స్నాక్స్ వంటివి చక్కగా చేయడం వచ్చి ఉంటే వాటిలో మీ సృజనాత్మకతను మేళవించి బేకరీ ఐటమ్స్ ను తయారు చేసి అమ్మవచ్చు. ప్రస్తుత కాలంలో ఈ బేకరీ ఫుడ్స్ కు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి వీటిని ఫాలో అవచ్చు.

కంటెంట్ రైటర్!!

ఇంట్లోనే ఉంటూ చేయదగిన మంచి పని ఇది. కథలు, వ్యాసాలు చక్కగా రాయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మహిళల గురించి, పిల్లల గురించి, సమాజం గురించి, విద్య, ఉద్యోగం, కెరీర్ టిప్స్, గైడెన్స్, ఫ్యామిలీ కౌన్సెలింగ్, డెవోషనల్ ఇలా చాలా రకాల విషయాలు ఉంటాయి. ఆసక్తిని బట్టి మంచి మంచి టాపిక్స్ ఇవ్వచ్చు.

డే కేర్ సర్వీస్!!

చాలా మంది తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే చిన్న పిల్లలను చూసుకునేవారు వుండరు. ఇలాంటి వారి కోసం డే కేర్ సర్వీస్ లు ఉంటాయి. పిల్లలతో గడపడం, పిల్లలను చూసుకోవడం ఇష్టముంటే డే కేర్ సర్వీస్ ను స్టార్ట్ చేయవచ్చు. ఇది మంచి వ్యాపారమవుతుంది కూడా. అయితే చట్టపరంగా కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది వాటిని పూర్తి చేస్తే సరిపోతుంది.

ఇలా మహిళలకు మంచి సంపాదనా మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఎంతో విభిన్నమైనవి కూడా.

                                     ◆నిశ్శబ్ద.