ఆళ్వార్లలో ఒకే ఒక్క స్త్రీ మూర్తి.. గోదాదేవి భక్తి, ప్రేమ అమోఘం..!

 

ఆళ్వార్లలో ఒకే ఒక్క స్త్రీ మూర్తి.. గోదాదేవి భక్తి, ప్రేమ  అమోఘం..!


ధనుర్మాసం వచ్చిందంటే ఏ విష్ణు ఆలయంలో చూసినా మాములుగా చేసే సేవలకు భిన్నంగా సేవలు ఉంటాయి.  ముఖ్యంగా తిరుప్పావై ప్రతి క్షేత్రంలో వినిపిస్తూ ఉంటుంది.  తిరుప్పావైను గోదాదేవి అందించారు. 12మంది ఆళ్వారులలో గోదాదేవి ప్రముఖమైనవారు. ధనుర్మాసం అంతా గోదాదేవి ఇచ్చిన నియమాల ప్రకారమే స్వామి వారిని పూజించడం జరుగుతుంది.  సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే పెళ్లాడిన గోదాదేవి భక్తి, ప్రేమ అనిర్వచనీయం, అమోఘం, అపూర్వం.  ఇంతకీ గోదాదేవి ఎలా జన్మించింది? ఆమె విష్ణుమూర్తిని ఎలా ఆరాధించింది తెలుసుకుంటే..

తిరుప్పావై చదివిన వారికి, తిరుప్పావై పాశురాలలో ఉన్న భావాన్ని తెలుసుకున్న వారికి ధనుర్మాసంలో  ఆ స్వామిని ఎలా పూజించాలనే విషయం స్పష్టంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే తిరుప్పావై లో గోదాదేవి విష్ణుమూర్తిని ఎలా ఆరాధించాలి? నియమాలు ఏమిటి అనే విషయాలు వివరించింది. ఆళ్వారులు అందరిలోకి పెద్ద ఆళ్వారుగా సాక్షాత్తు విష్ణుమూర్తిచే గుర్తించబడిన విష్ణుచిత్తుని కూతురుగా పెరిగినదే గోదాదేవి. సాక్షాత్తు భూదేవి విష్ణుచిత్తుని భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ఆదేశంతో విష్ణుమూర్తి పెంచుకునే తులసి వనంలో అయోనిజగా జన్మించింది.  తులసి వనంలో అమితమైన తేజస్సుతో వెలిగిపోతున్న పాపను చూసి విష్ణుచిత్తుడు సంబరపడిపోయాడు.  ఆమెను తన కన్నకూతురిలా పెంచాడు.

గోదాదేవికి చిన్నతనం నుండి కృష్ణ ఆరాధన,  కృష్ణుడి సేవలు,  కైంకర్య ఇలా.. ఇవే ఆమెకు లోకం.  చిన్నతనంలో కృష్ణుడి పట్ల ఉన్న భక్తి కాస్తా పెద్దయ్యే కొద్ది ప్రేమగా మారింది.  కృష్ణుడినే వివాహం చేసుకోవాలని అనుకుంది.  విష్ణుచిత్తుడు తన తోటలో కోసిన పువ్వులు, తులసి దళాలలో మాలలు కడితే మొదట ఆమె వాటిని ధరించి తన రూపాన్ని బావిలో చూసుకుని పొంగిపోయేది. ఆమె ధరించిన మాలలు స్వామి వారికి అలంకరించేవారు. అయితే ఈ విషయం మొదట విష్ణుచిత్తుడికి తెలియదు.  కానీ ఒక రోజు ఈ సంగతంతా విష్ణుచిత్తుడి కంట పడింది.  నువ్వు అలంకరించుకున్న మాలలు స్వామికి అలంకరించుకోవడం ఏంటని ఆందోళన పడ్డాడు.  గోదాదేవి ధరించిన కారణంగా పాపం స్వామి వారికి ఆరోజు అలకంరించడానికి మాలలు కూడా పంపలేదు. జరిగిన పొరపాటును ప్రాయశ్చిత్తం చేసుకోవాలని  ఉపవాసం మొదలెట్టాడు.

విష్ణుచిత్తుడు ఉపవాసం ఉంటుంటే.. విష్ణుమూర్తి ఎప్పటిలాగే విష్ణుచిత్తుడితో కబుర్లు చెబుతూ నువ్వెందుకయ్యా ఉపవాసం చేస్తున్నావు, రోజూ నీ కూతురు అలంకరించుకున్న మాలలే నాకు అలంకరిస్తున్నారు.  నీ కూతురు ధరించిన మాలలు అలకంరించుకోవడంలో నాకు ఎంతో సంతోషం ఉంది.  నువ్వు ఈ రోజు నాకు అలంకరించకుండా అలాగే పెట్టేసిన ఆ మాలలు తీసుకొచ్చి నాకు అలంకరించు అని చెప్పాడు. దీంతో విష్ణుచిత్తుడికి అనుమానం వచ్చింది.  భక్తులందరూ స్వామి వారికి అలంకరించిన పువ్వులు ఇమ్మని అడుగుతారు.. కానీ స్వామి ఏమో నా కూతురు అలంకరించుకున్న మాలలు కావాలని అంటాడు ఏంటి అనుకున్నాడు. ఇక సాక్షాత్తు భూదేవి కావడంతో గోదాదేవి ఇక శ్రీ రంగనాథుడినే నేను వివాహం చేసుకుంటాను అని నిర్ణయించుకుంది. 30రోజుల పాటు 30 పాశురాలతో స్వామిని నియమబద్ధంగా  ఆరాధించింది.   ఈ కాలమే ధనుర్మాసం. ఇలా 30 రోజులు అయ్యాక స్వామి గోదాదేవి కలలో కనిపించి భోగం పెట్టాడట.  దీన్నే భోగి పండుగ అంటారని చెబుతారు.

సాక్షాత్తు స్వామిని వివాహం చేసుకోవడం ఏంటని విష్ణుచిత్తుల  వారు భాదపడ్డారు. అయితే విష్ణుచిత్తుడికి కలలో కనిపించి నేను నీ కూతురిని వివాహం చేసుకుంటాను, నా పుణ్యక్షేత్రాలు 108 ఉన్నాయి. వాటిలో ఏ పుణ్యక్షేత్రంలో వివాహం చేసుకుంటుందో నీ కూతురినే అడుగు అని అన్నారట.  దీంతో విష్ణుచిత్తుడు గోదాదేవికి 108 పుణ్యక్షేత్రాల గురించి చెబుతూ ఉంటే.. నేను శ్రీరంగంలోని రంగనాథస్వామిని వివాహం చేసుకుంటాను అని అన్నారట.

శ్రీరంగనాధ స్వామి గోదాదేవిని వివాహం చేసుకొనేటప్పుడు స్వామివారు మూలవిరాట్టు కదా ఎలా వివాహం చేసుకుంటాడో అని అందరూ ఆశ్చర్యపోయారట. కానీ వివాహం రోజు స్వామి వారి మూలవిరాట్టును గోదాదేవి అలా చేతితో తాకగానే సాక్షాత్తు రంగనాథస్వామి తన చేతితో గోదాదేవి చేతిని పట్టుకుని తనలో ఐక్యం చేసుకున్నారట.  పాపం ఎన్నో ఏళ్లు ముద్దుగా పెంచుకున్న కూతురు మాయమయ్యే సరికి విష్ణుచిత్తుడు బాధపడిపోయాడు.  విష్ణుచిత్తుడి బాద చూసి రంగనాథ స్వామి తనలో నుండి ఒక అమ్మవారి విగ్రహాన్ని సృష్టించి ఇదిగో నీ కూతురు అని విష్ణుచిత్తుడికి  ఇచ్చారట. శ్రీరంగంలో అయిదవ ప్రాకారంలో శ్రీరంగనాయార్ అనే పేరుతో ఈ అమ్మవారి విగ్రహం పూజలు అందుకుంటోంది. ఇది గోదాదేవి ప్రేమ, భక్తితో నిండిన కథ.  గోదాదేవి అంత ప్రేమగా, భక్తితో ఆలపించిన తిరుప్పావే పాశురాలు ప్రతి విష్ణుక్షేత్రంలో ఈ ధనుర్మాసం అంతా ఆలపించబడతాయి. ధనుర్మాసంలో తిరుప్పావే విన్నా, ఆలపించినా,  గోదాదేవి కథ విన్నా విష్ణుమూర్తి పొంగిపోతాడు.

                                         *రూపశ్రీ.