గణపతి మొదట గ్రామదేవత

 

గణపతి మొదట గ్రామదేవత అంటే నమ్మశక్యంగా లేదు కదూ! పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, గంగానమ్మ లాంటి గ్రామ దేవతల పేర్లు మనకు చిరపరిచితం. కానీ వినాయకుడు కూడా ఒకప్పుడు గ్రామదేవత. ఇది నిజమని చెప్పే కధనాలు, స్తోత్రాలు ఉన్నాయి.

మొదట పాళెగార్లుగా ప్రజల్ని కొల్లగొట్టినవారే, క్రమంగా రాజులు, చక్రవర్తులుగా మారిన దాఖలాలు ఎన్నో చరిత్రలో ఉన్నాయి. అలా గణపతిని మొదట ఆటవిక జాతులు "గణ నాయకుడి"గా కొలిచి ఉంటారు. మహా గణపతి సహస్ర నామంలో ఉన్న"ప్రతి గ్రామాధి దేవతా" అనే నామం ఇందుకు తార్కాణం. ఒక దశలో గణపతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆరాధించేవారు.

కాలక్రమంలో వినాయకుడు అందరికీ ఆరాధ్య దేవుడయ్యాడు. ఇలా జరిగి కూడా వేల వేల సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు గణపతి విగ్రహం లేని పూజామందిరం వుండదు. గణేశుని పూజించకుండా ఏ పనీ ప్రారంభించరు. అలాగే గణపతి మొదట విఘ్నకారి. తర్వాతికాలంలో విఘ్న నాశకుడు అయ్యాడు. అంటే వినాయకునిలో రెండు వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. గణపతి అంటే ప్రజలకు భక్తితోబాటు భయమూ ఉంది.

ఇంటి గుమ్మం మొదలు, పూజామందిరం వరకూ గణేశుని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ముందుగా వినాయకుని పూజిస్తారు. ఆఖరికి హిందూ మతాన్ని ద్వేషించిన ఔరంగజేబు పూనా దగ్గర్లో ఉన్న వినాయకుని దేవాలయానికి మాన్యాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. అంటే, గణపయ్య ప్రభావం ఎంతటిదో చూడండి. గణేశుని పట్ల ఇతర మతస్తులకు కూడా భక్తి భావం కలుగుతుంది.