ధనత్రయోదశిని ఎందుకు జరుపుకుంటారు..ధనత్రయోదశి రోజు ఏం కొనాలి..!
ధనత్రయోదశిని ఎందుకు జరుపుకుంటారు..ధనత్రయోదశి రోజు ఏం కొనాలి..!
దీపావళికి ముందు రోజు వచ్చే త్రయోదశి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు సంపద, ఆరోగ్యం కోసం ధన్వంతరిని, కుబేరుడిని పూజిస్తారు. ఈ సంవత్సరం ధనత్రయోదశి అక్టోబర్ 18, 2025న వచ్చింది. ధన త్రయోదశి రోజు కొన్ని వస్తువులను కొనడం చాలా మంచిదని చెబుతారు. ధనత్రయోదశి రోజు కొన్ని శుభ వస్తువులను కొనడం వల్ల కుటుంబానికి ఆనందం, శాంతి లభిస్తుంది. ఆర్థిక లాభం కూడా లభిస్తుంది. అసలు ధన త్రయోదశి రోజు ఏం కొనాలి? ధనత్రయోదశిని ఎందుకు జరుపుకుంటారు? తెలుసుకుంటే..
బంగారం వెండి..
ధనత్రయోదశి రోజు లోహం కొనడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజున లోహం కొనడం వల్ల అదృష్టం వస్తుందని నమ్ముతారు. సాంప్రదాయకంగా ధన త్రయోదశి రోజు బంగారం, వెండి కొనాలి. బడ్జెట్‌ను బట్టి ఈ రోజున బంగారం, వెండి నాణేలు, నగలు, విగ్రహాలు వంటి వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
కుబేర యంత్రం
ధన త్రయోదశి రోజు యంత్రాన్ని కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో కానీ, దుకాణం డబ్బు ఉంచే పెట్టెలో లేదా సురక్షిత ప్రదేశంలో ఉంచాలి. తరువాత కుబేర మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రం డబ్బు కొరత సమస్యను తగ్గిస్తుంది.
ఇంకా ఏం కొనవచ్చంటే..
ధనత్రయోదశి నాడు రాగి వస్తువులు లేదా పాత్రలను కొనడం మంచిది. అలాగే చీపుర్లు కూడా కొనుగోలు చేస్తారు. ఈ రోజున కొత్త చీపురు కొనడం వల్ల పేదరికం, ప్రతికూల శక్తి తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు.
ధనత్రయోదశి రోజు శంఖం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. రోజూ పూజ సమయంలో శంఖం ఊదబడిన ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడూ వదిలి వెళ్ళదట. ఇది ఇంట్లో ఏవైనా సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఏడు ముఖాల రుద్రాక్షను కొనుగోలు చేయడం కూడా చాలా మంచిదిగా చెబుతారు.
దనత్రయోదశి రోజు గణేశుడు, లక్ష్మీ దేవి విగ్రహాలను కూడా ఇంటికి తీసుకురావచ్చు. ఏడాది పొడవునా ఐశ్వర్యం, ఆనందం, ఆహారానికి లోటు లేకుంటా ఉంటుందట. అలాగే జ్ఞానం కూడా లభిస్తుందట.
ధన త్రయోదశి వెనుక రెండు పురాణ కథనాలు ఉన్నాయి.
ధన్వంతరి అవతార కథ..
యమదీపదాన కథ..
ధన్వంతరి అవతార కథనం..
హిందూ పురాణాల ప్రకారం దేవతలు, అసురులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. ఆ సముద్ర మథనం నుండి అనేక దివ్య వస్తువులు, దేవతలు బయటపడ్డారు. చివరగా ధన్వంతరి ఉద్భవించారు.
ధన్వంతరి విష్ణువు అవతారంగా జన్మించారు. ఆయన చేతిలో అమృతకలశం ఉంటుంది. ఆయనను ఆయుర్వేద గురువుగా పూజిస్తారు . అన్ని రోగాలను నివారించే శక్తి కలిగినవాడు ఆయన. అందుకే ధనత్రయోదశిని ఆరోగ్యదాయక దినం, ఆయుర్వేద దినం, ధన్వంతరి జయంతిగా భావిస్తారు. ఈ రోజు ఆయుర్వేద వైద్యులు, వైద్య శాస్త్రంలో ఉన్నవారు ధన్వంతరిని ఆరాధిస్తారు.
యమదీప దానం కథనం..
ఒకప్పుడు హిమ రాజు అనే రాజుకు యమున అనే పుణ్యాత్మక కుమార్తె, హేమరాజు అనే కుమారుడు పుట్టారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హేమరాజు వివాహం అయిన నాల్గవ రోజు రాత్రి మరణం సంభవిస్తుంది. కానీ అతని భార్య భక్తిశ్రద్ధలతో తెలివిగా ఒక ఉపాయం చేసింది.
ఆమె తలుపు బయట ఒక దీపం వెలిగించి ఉంచింది, ఎన్నో బంగారు నాణేలు, రత్నాలతో గుట్టలు కట్టింది. నిత్య పఠనం చేసుకుంటూ రాత్రంతా జాగారముండి భర్తను కాపాడింది. యముడు వచ్చేటప్పుడు ఆ ప్రకాశం వల్ల అతనికి చూపు అడ్డుపడింది. ఆమె ప్రార్థనల శ్రద్ధను చూసి యముడు కరుణించి అతని ఆయుష్షును పెంచాడని కథనం.
కాబట్టి.. మరణం నుండి రక్షణ కావాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా ధన త్రయోదశి రోజు ధన్వంతరిని పూజించడం, యమదీపం పెట్టడం మంచిది. ఐశ్వర్యం కావాలంటే ధనత్రయోదశి రోజు ధనలక్ష్మి పూజ చేయడం మంచిది.
*రూపశ్రీ.