Read more!

దశరథ మహారాజు ఊర్ధ్వలోకం నుండి వచ్చి చెప్పిన మాటలేంటి?

 

దశరథ మహారాజు ఊర్ధ్వలోకం నుండి వచ్చి చెప్పిన మాటలేంటి?

రాముడు సీతను అనుమానించి మాట్లాడటం వెనుక కారణం గురించి వివరంగా చెప్పేసరికి సీతమ్మ సంతోషంతో పొంగిపోయింది. దేవతలందరితో పాటుగా అక్కడికి వచ్చిన శివుడు రాముడితో "నాయనా రామ! నీ తమ్ముడైన భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు. ఆయనని ఓదార్చు. నీ తల్లి అయిన కౌసల్యని ఊరడించు. కైకేయి, సుమిత్రలకి నమస్కరించు. లక్ష్మణుడిని ఊరడించు. ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుండి పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి, నీవారిని సంతోషపెట్టు. ఏ వంశంలో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. యాగాలు చెయ్యి, బ్రాహ్మణులకు భూరి దానాలు చేసి పరమ సంతృప్తిని పొందు. తదనంతరం స్వర్గానికి చేరుకుందువుగాని. అదిగో, ఆ విమానంలో మీ తండ్రిగారైన దశరథ మహారాజు ఉన్నారు, వెళ్ళి చూడు" అన్నాడు.

తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు. అప్పుడు దశరథుడు రాముడిని ఒకసారి ఆనందంతో గట్టిగా కౌగలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకుని "రామ! నేను స్వర్గలోకములో విహరించానురా, ఇంద్రలోకములో తిరిగానురా, కాని నువ్వు లేకపోతే అది కూడా నాకు పెద్ద సుఖంగా అనిపించలేదురా. శ్రీ ఆనాడు నీకు పట్టాభిషేకాన్ని చేద్దాము అనుకోవడం, నేను ఎంతో ఆనందాన్ని పొందడం, రాత్రి కైక దగ్గరికి వెళ్ళడం, కైక వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నం అవ్వడం, ఆనాడు నేను ఏడ్చి ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నేను ఇప్పుడు తెలుసుకున్నదేంటంటే, ఆ పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కారణం దేవతలు. రావణ సంహారం జరగాలి కనుక దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు" అన్నాడు.

అప్పుడు రాముడు "ఆనాడు మీరు భావనా వ్యగ్రతని పొంది, నా పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కైకమ్మ కారణం అనుకొని ఇప్పుడే నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నువ్వు నా భార్యవి కావు. నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాదు' అన్నారు. ఆ మాటని మీరు ఉపసంహారం చెయ్యండి, నేను సంతోషిస్తాను" అన్నాడు.

అప్పుడు దశరథుడు "నువ్వు కోరుకున్నటు తప్పకుండా జరుగుతుంది" అన్నాడు. తరువాత ఆయన లక్ష్మణుడితో "నాయన లక్ష్మణా! నువ్వురా ప్రాజ్ఞుడవి అంటే. చక్కగా అన్నయ్య సేవ చేశావు, ఇలాగే అన్ని సమయాలలో అన్నయ్యని, వదినని సేవిస్తూ నీ జన్మ చరితార్థం చేసుకో" అన్నాడు.

తరువాత దశరథుడు రామలక్ష్మణుల వెనకాల తనకి నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతమ్మని దగ్గరికి పిలిచి "అమ్మా సీతమ్మ! నీ మనస్సుకి కష్టం కలిగిందా, 'సీత! నీతో నాకు ప్రయోజనం లేదు. నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు' అని మావాడు అన్నాడు కదా, అలా అన్నాడని నువ్వు బాధపడ్డావా??. ఇవ్వాళ నేను ఊర్ధలోకవాసినమ్మా, తప్పు మాట చెబితే కిందకి పడిపోతాను, నీకొక నిజం చెప్పనా, రాముడికి నీమీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా, నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని మావాడి తాపత్రయం.

కూతురా! నువ్వు ఇవ్వాళ చేసిన పతి సేవ వలన జరిగిన గొప్పతనం ఏమిటో తెలుసా, ఇంతకు పూర్వం పతివ్రతలై భర్తని సేవించిన వాళ్ళందరి చరిత్రలను పక్కన పెట్టి, పతివ్రత అంటే సీతమ్మ అని నిన్ను చూపిస్తారు. నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టం. నీకు నేను ఇంక చెప్పడానికి ఏమిలేదమ్మ. నీకు అన్నీ తెలుసు, కాని మామగారిగా ఒక్క మాట చెబుతాను. అమ్మా! భర్త మాత్రమే దైవము అని తెలుసుకో" అన్నాడు. 

ఇలా దశరథ మహారాజు అందరికీ ఎన్నో విషయాలు చెప్పాడు.

                                        ◆నిశ్శబ్ద.